మధ్యప్రదేశ్‌ సంక్షోభంలో మరో ట్విస్ట్‌ | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌ సంక్షోభంలో మరో ట్విస్ట్‌

Published Tue, Mar 10 2020 3:47 PM

SP MLA And BSP MLA Meeting With BJP leader Shivraj Singh Chouhan - Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో మరో ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ఎస్పీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించారు. తాజా సంక్షోభం నేపథ్యంలోనే ఎస్పీ ఎమ్మెల్యే రాజేష్‌ శుక్లా, బీఎస్పీ ఎమ్మెల్యే రాజీవ్‌ కుషావా బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో భేటీ అయ్యారు. బీజేపీకి మద్దతు ఇవ్వాలని వారిని చౌహాన్‌ కోరినట్లు తెలుస్తోంది. దీనికి ఎమ్మెల్యేలు కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు నలుగురు స్వతంత్ర శాసన సభ్యులతో కూడా బీజేపీ నేతలు మంతనాలు ప్రారంభించారు. తమకి మద్దతు ఇస్తే కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇస్తామనే ఆఫర్‌ను వారి ముందు ఉంచినట్టు సమాచారం. తాజా పరిణామం కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో నెట్టింది. (రాజ్యసభకు సింధియా.. కేంద్రమంత్రి పదవి!)

ఇక కమల్‌నాథ్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన 20 ఎమ్మెల్యేలు తమ రాజీనామాను స్పీకర్‌కు పంపించారు. రాజీనామా చేసిన వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉండటంతో వారందరినీ మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎంకు గవర్నర్‌ టాండన్‌ లేఖ రాశారు. గవర్నర్‌ లేఖపై స్పందించిన ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ వారిని ఇప్పటికే మంత్రిపదవుల నుంచి తొలగించినట్లు వివరణ ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన జ్యోతిరాధిత్య సింధియా ఢిల్లీ వేదికగా చక్రం తిప్పుతున్నారు. మంగళవారం సాయంత్రం బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉంది.

Advertisement
Advertisement