
అధికార పార్టీ ఆత్మరక్షణలో పడ్డప్పుడల్లా పవన్ కల్యాణ్ రంగంలోకి దిగి ఆ అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తూ...
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలకు సరిగ్గా సంవత్సరం ముందుగా... జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేస్తున్న పర్యటనలు, విమర్శలు కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి తెలుగుదేశం పార్టీకి లబ్ధి కలిగించి పరోక్షంగా సహకరించేందుకేననే విమర్శలు బలపడుతున్నాయి. 2014 ఎన్నికల సమయంలో టీడీపీకి మద్దతు ఇచ్చిన జనసేనాధిపతి, అధికారంలోకి వచ్చాక తప్పులు చేస్తే ప్రశ్నిస్తానని చెప్పినా ఏ సందర్భంలోనూ నోరు మెదపలేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. రాజధాని పేరుతో ప్రభుత్వ పెద్దలు విచ్చలవిడిగా భూ దందాలు సాగించినా, పోలవరం తదితర సాగునీటి ప్రాజెక్టుల్లో అంచనాలు భారీగా పెంచేసి కొల్లగొడుతున్నా, ఫిరాయింపుల చట్టాన్ని తుంగలోకి తొక్కి విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా, చరిత్రలోనే తొలిసారిగా విశాఖలో రికార్డులు గల్లంతు చేసి లక్ష ఎకరాల భూములను కాజేసినా పవన్ కల్యాణ్ గళం విప్పలేదని గుర్తు చేస్తున్నారు. ప్రశ్నిస్తానని పదేపదే చెప్పిన ఆయన ఎన్నడూ ప్రశ్నించనే లేదని పేర్కొంటున్నారు. చంద్రబాబు సర్కారుపై తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా కీలకమైన ఏ సందర్భంలోనూ పవన్ స్పందించలేదు. మరోసారి ఎన్నికల వేడి మొదలవుతుండటంతో ఇప్పుడు ఏడాది ముందుగా బయల్దేరి టీడీపీపై పైపైన కొన్ని విమర్శలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడమే లక్ష్యంగా...
అధికార పార్టీ ఆత్మరక్షణలో పడ్డప్పుడల్లా పవన్ కల్యాణ్ రంగంలోకి దిగి ఆ అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తూ సర్కారు అవినీతి, నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతిపక్షంపైనా, నిరంతరం ప్రజల్లోనే గడుపుతున్న ప్రతిపక్ష నేతపైనా విమర్శలు చేస్తూ అందరినీ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడే ప్రాంతాల్లోనే పవన్ పర్యటన అంతా కేంద్రీకృతం కావడం గమనార్హం. ఇతర ప్రాంతాలకు పవన్ పెద్దగా వెళ్లటం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు అజెండాను అమలు చేసేందుకే పవన్ ప్రయత్నిస్తున్నారనే విమర్శలకు బలం చేకూర్చేలా పవన్ పర్యటన సాగుతోందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
జనం సమస్యలను పట్టించుకోకుండా జననేతపై విమర్శలా?
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ అరాచకాలు పెరిగిపోతున్నా పట్టించుకోకుండా, ప్రజాసమస్యలపై మౌనంగా ఉంటూ అప్పుడప్పుడు తెరపైకి వస్తూ ప్రధాన ప్రతిపక్షంపై విమర్శలకు దిగడం వెనక పవన్‌కు వేరేప్రయోజనాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటన సందర్భంగా ప్రభుత్వంపై సుతిమెత్తని వ్యాఖ్యలు చేస్తున్నట్లు కనిపించినా ప్రధాన ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకునే ఆయన విమర్శలు కొనసాగాయి. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సమర్థత లేదని, అసెంబ్లీకి వెళ్లకుండా కేసులకు భయపడి పారిపోతున్నారని, ఆ స్థానంలో తానే ఉంటే ఎమ్మెల్యేలంతా అమ్ముడుపోయినా ఒంటరిగానే ప్రజాసమస్యలపై పోరాడేవాడినంటూ పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అయితే టీడీపీ నేతలు విచ్చలవిడిగా అరాచకాలు సాగిస్తున్నా, పలు సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నా పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం అలుపెరగకుండా పోరాడుతూ ఏడాదికి పైగా ‘ప్రజాసంకల్ప పాదయాత్ర’ ద్వారా ప్రజల్లో మమేకమై తిరుగుతున్న ప్రతిపక్ష నేతపై ఏ ప్రయోజనాలు ఆశించి పవన్ ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు? పవన్ విమర్శల వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజల మదిలో తలెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు సన్నిహితుడు, కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టడంపై నోరు మెదపని పవన్‌కల్యాణ్ ప్రతిపక్షనేతపై విమర్శలు చేయడాన్ని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్ర సర్కారు అవినీతి వ్యవహారాలు, టీడీపీ నేతల అక్రమాలు బయటకు వచ్చినప్పుడల్లా ఆ అంశాలపై ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేలా ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకొని పవన్ విమర్శలకు దిగుతున్నారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.
ఒక్క సీటుకూ పోటీ చేయకుండా సంపూర్ణ మద్దతు
పవన్‌కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించడం నుంచి ఇప్పటివరకు చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన డైరెక్షన్‌లోనే సాగుతున్నారని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. నాలుగేళ్లు చంద్రబాబుతో పాటు కలసి నడిచిన పవన్ ఏనాడూ ప్రభుత్వ అరాచకాలు, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించిన పాపానపోలేదు. ప్రజారాజ్యం పార్టీని ఎన్నికల తరువాత కాంగ్రెస్‌లో విలీనం చేస్తే ఇప్పుడు పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందే పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెట్టేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల సమయంలో పార్టీని ఏర్పాటు చేసిన పవన్ ఒక్క సీటుకూ పోటీ చేయకుండా టీడీపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారంటే దీని వెనక ఎంత ‘ఆర్థిక వ్యవహారం’ నడిచిందోననే విమర్శలున్నాయి.
భూ సమీకరణకు పవన్ ప్రశంసలు...
చంద్రబాబు ప్రభుత్వానికి చిక్కులు ఎదురైనప్పుడల్లా పవన్ రంగంలోకి ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని పలు ఘటనలు రుజువు చేస్తున్నాయి. రాజధాని పేరిట నాలుగు పంటలు పండే వేలాది ఎకరాల భూములను రైతుల నుంచి భూసమీకరణ పేరిట బలవంతంగా లాక్కున్నా పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని నిలదీయలేదు. కొన్ని గ్రామాల ప్రజలు భూములు ఇచ్చేందుకు నిరాకరించి ఎదురొడ్డి నిలిస్తే ప్రభుత్వానికి చిక్కులు రాకుండా అక్కడికి వెళ్లి రైతులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడమే కాకుండా తరువాత హైదరాబాద్ వచ్చి భూసమీకరణ మంచిదేనంటూ ప్రశంసలు కురిపించటాన్ని గుర్తు చేస్తున్నారు.
అలా ముందుకు వెళ్తున్నారు....!
శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించి అక్కడికి వెళ్లేందుకు నిర్ణయించిన సమయంలోనూ పవన్ కల్యాణ్ రాత్రికి రాత్రి అక్కడికి చేరుకొని ఆ అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని గుర్తు చేస్తున్నారు. పంచాయితీల అధికారాలను కాలరాసి జన్మభూమి కమిటీల ద్వారా చంద్రబాబు అరాచక పాలన చేస్తున్నా పవన్‌కల్యాణ్ కళ్లు మూసుకుని కూర్చున్నారని, నాలుగేళ్లుగా ఇసుక, మట్టి, బెల్టుషాపులు, ప్రాజెక్టుల అంచనాలు పెంపుతో లూటీ చేస్తున్నా, విశాఖలో భారీ భూ కుంభకోణం జరిగినా అధికార పార్టీని ప్రశ్నించిన దాఖలాలు లేవని స్పష్టం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎలా చెబితే అలా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళ్తూ పవన్‌కల్యాణ్ పైపైన విమర్శలు చేయటాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ పరిణామాలన్నిటినీ గమనిస్తే తెలుగుదేశం పార్టీకి జనసేన పిల్లపార్టీగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఎమ్మెల్యేలను కొంటున్నా పట్టదా?
ప్రతిపక్షనేత భయపడి పారిపోయారని, తానైతే ఎమ్మెల్యేలు లేకపోయినా ఒంటరిగానైనా పోరాడేవాడినని చెబుతున్న పవన్‌కల్యాణ్.. విలువలను కాలరాస్తూ, అసలు రాజ్యాంగాన్ని పరిహసిస్తూ సీఎం చంద్రబాబు రూ.కోట్ల కొద్దీ డబ్బులు కుమ్మరించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నా ప్రశ్నించకపోవడం గమనార్హం. చంద్రబాబు అరాచకాలకు ఇది మద్దతు ఇవ్వడం కాదా? ఆయనతో స్నేహబంధం కొనసాగించడానికే పవన్ రాజకీయాలు చేస్తుండడం నిజం కాదా? అని నిలదీస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం ఘటనకు సంబంధించిన కేసును హైకోర్టు విచారిస్తుండటం, సీసీ కెమేరాలు పని చేయకపోవటాన్ని తీవ్రంగా పరిగణిస్తూ వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశాన్ని పలుచన చేసేందుకే కోడికత్తితో జరిగిన దాడిగా పవన్ వ్యాఖ్యలు చేశారని పరిశీలకులు పేర్కొంటున్నారు. హత్యాయత్నంపై సమగ్ర విచారణ జరపాలని కోరకపోగా ప్రభుత్వ పెద్దలు ప్రధాన ప్రతిపక్షనేతపై విమర్శలు చేస్తున్నా ఎందుకు ఖండించలేకపోయారని పరిశీలకులు పవన్‌ను తప్పుబడుతున్నారు. సీఎం చంద్రబాబు సన్నిహితులపై ఐటీ సోదాలు జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నేతపై పవన్ తీవ్ర విమర్శలకు దిగుతుండటం గమనార్హం.
ఆ స్థలం కారుచౌకగా ఎలా వచ్చింది?
నీతి, విలువల గురించి పవన్‌కల్యాణ్ తన ప్రసంగాల్లో పేర్కొనటంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం చంద్రబాబు సన్నిహితుడైన లింగమనేని రమేష్ ద్వారా రాజధాని ప్రాంతంలో ఎకరం నాలుగు కోట్ల రూపాయల విలువైన రెండెకరాల భూమి రూ.25 లక్షలకే ఎలా దక్కిందో పవన్‌కల్యాణ్ ప్రజలకు వివరించగలరా? అని ప్రశ్నిస్తున్నారు. లింగమనేని కృష్ణానది కరకట్టపై అక్రమంగా నిర్మించిన గెస్ట్ హౌస్‌ను చంద్రబాబు తన అధికారిక నివాసంగా చేసుకున్నారని, అదే లింగమనేని నుంచి అత్యంత చౌకధరకు కొన్న స్థలంలో పవన్‌కల్యాణ్ ఇల్లు కడుతున్నారంటే వీరిమధ్య ఎంతబలమైన బంధముందో అర్థమవుతోందని పేర్కొంటున్నారు. గెస్ట్‌హౌస్‌తో పాటు ఇతర కమీషన్లు అందడం వల్లే రాజధాని భూసమీకరణ లింగమనేని భూముల సరిహద్దు వరకు వచ్చి అక్కడితో నిలిచిపోవడం నిజం కాదా? అని ప్రశ్నిస్తున్నారు.
ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే పవన్ పర్యటన ఎందుకంటే?
2014 ఎన్నికలకు ముందు, ఆ తరువాత కూడా ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే ఒకసారి టీడీపీతో కలసి వెళ్లినట్లు, మరోసారి విడిపోయినట్లు ప్రవర్తిస్తున్న పవన్‌కల్యాణ్ తీరు రానున్న ఎన్నికల్లో మరోసారి చంద్రబాబుకు మేలు చేయడానికేననే అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. పవన్‌కల్యాణ్ కొన్ని ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న పర్యటనల వెనుక చంద్రబాబు డైరెక్షన్ ఉందని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా ప్రభుత్వ అరాచకాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా పవన్‌కల్యాణ్ ఎంపిక చేసిన ప్రాంతాల్లో పర్యటిస్తుండటం గమనార్హం. పవన్ పర్యటించే ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకత చాలా తీవ్రరూపం దాల్చింది. ఇక్కడ ప్రజలు వైఎస్సార్ సీపీకి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజాసంకల్ప యాత్రలో బ్రహ్మరథం పట్టారు. గతంలో ఎన్నడూ లేనంతగా పోటెత్తారు. ఈ పరిణామాలతో కంగుతిన్న ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ వ్యతిరేకత ఓటులో చీలిక వచ్చేలా పవన్‌కల్యాణ్‌ను రంగంలోకి దించారని పరిశీలకులు పేర్కొంటున్నారు. పర్యటనల పేరుతో పవన్ కల్యాణ్ కొద్దిరోజులుగా ఈ ప్రాంతాలపైనే దృష్టి పెట్టడం అధికార పార్టీకి మేలు చేయడం కోసమేనని విశ్లేషిస్తున్నారు.