కేసీఆర్‌ వ్యతిరేకులు ఏకం కావాలి: జైపాల్‌రెడ్డి

jaipal reddy on kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చడంలోనూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులోనూ విఫలమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా అన్ని శక్తుల పునరేకీకరణ జరగాలని కేంద్ర మాజీమంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనలో నిరంతరం శ్రమించి, ఎన్నో త్యాగాలకు పాల్పడిన వారికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ పాలన ఉందని సోమవారం ఒక ప్రకటనలో జైపాల్‌రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి, కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయి నాలుగేళ్లు కావస్తున్నా రాష్ట్ర ఏర్పాటు ఫలితాలు ఉద్యమకారులకు అందలేదన్నారు.

రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉందన్నారు. కేసీఆర్‌ హామీలు ఇచ్చి మభ్యపెడుతూ, రాజకీయ భ్రమలు కల్పించి కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 4వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, నిరుద్యోగులు ప్రాణాలు వదులుతున్నా సీఎంకు చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి అవినీతిని పెంచిపోషించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

కులాల మధ్య చిచ్చుపెడుతూ, వారిని కులవృత్తులకు పరిమితం చేసి పాలనాధికారాలను తన చేతిలో పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారని, రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని జైపాల్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను సాధించుకోవడానికి తెలంగాణవాదుల పునరేకీకరణ జరగాలని జైపాల్‌ పిలుపునిచ్చారు. దీనికోసం ఈనెల 20న జడ్చర్లలో జనగర్జన పేరుతో జరిగే బహిరంగసభకు టీఆర్‌ఎస్‌ వ్యతిరేక శక్తులన్నీ హాజరు కావాలని కోరారు. జడ్చర్లలో జరగబోయే బహిరంగ సభ టీఆర్‌ఎస్‌ వ్యతిరేక శక్తుల ఐక్యతకు నాంది పలుకుతుందని ఆయన అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top