రాజీనామా చేసిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు

Jacob Zuma Resigned for South Africa President Post - Sakshi

జోహెన్నెస్‌ బర్గ్‌ : ఎట్టకేలకు దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవికి జాకోబ్‌ జుమా రాజీనామా చేశాడు. బుధవారం సాయంత్రం తన నిర్ణయాన్ని ఓ టెలివిజన్‌ సంస్థ ద్వారా ఆయన ప్రకటించారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన జుమా.. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను కూలంకశంగా వివరించారు. 

ఆరోపణలు... అవినీతితో దేశ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీశాడని అధ్యక్షుడు జాకోబ్‌ జుమాపై ఆరోపణలు రుజువు అయ్యాయి.  భారీ అవినీతి, దేశ ఆర్థిక మందగమనం, రికార్డు స్థాయిలో పెరిగిన నిరుద్యోగం తదితర కారణాలు జుమాపై వ్యతిరేకత ఎక్కువ కావటానికి కారణాలు అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన స్వచ్ఛందంగా పదవి నుంచి దిగిపోవాలని అధికార ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌(ఏఎన్‌సీ) కోరింది. అయితే అందుకు ఆయన నిరాకరించటంతో సోమవారం ఏఎన్‌సీ అత్యున్నత స్థాయి భేటీ నిర్వహించింది. వెంటనే ఆయన్ని రీకాల్‌ చేయాలని తీర్మానించింది. రాజీనామా చేయకపోతే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని హెచ్చరింది.  

దీంతో దిగొచ్చిన జుమా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. రాజీనామా తర్వాత కూడా జుమా 6 నెలలు కొనసాగాలని భావిస్తున్నట్లు ఏఎన్‌సీ ప్రధాన కార్యదర్శి మగషులే తొలుత పేర్కొన్నారు. అయితే అందుకు జుమా సుముఖత చూపకపోవటంతో డిప్యూటీ ప్రెసిడెంట్‌ సిరిల్‌ రామాఫోసా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించనున్నారు. మరోపక్క ప్రభుత్వాన్ని పార్లమెంట్‌ను రద్దుచేసి, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top