హైదరాబాద్‌ను ఎందుకు వదిలి రావాల్సి వచ్చిందో..

IYR Krishna Rao Slams Chandrababu In His Book Navyandhra Tho Naa Nadaka - Sakshi

విజయవాడ: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను వదిలి హడావిడిగా ఎందుకు రావాల్సి వచ్చింది అనే అంశం కూడా ‘ నవ్యాంధ్రతో నా నడక’  అనే పుస్తకంలో ప్రస్తావించినట్లు ఏపీ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణా రావు తెలిపారు. ఆదివారం విజయవాడలో ఐవైఆర్‌ కృష్ణారావు రచించిన ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ ముఖ్య అతిధిగా హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎస్‌లు గోపాలకృష్ణ, అజయ్‌ కల్లాం, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, తదితరులు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఐవైఆర్‌ మాట్లాడుతూ.. విభజనకు సంబంధించిన అంశాలు, లోపభూయిష్టమైన విభజన చట్టం, అందులోని సమస్యలు ఎలా పరిష్కరించాలి, ఇప్పటికీ ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే విషయాలు ప్రస్తావించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, తనకు మధ్య ఉన్న బేధాభిప్రాయాలు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు వెల్లడించారు. విభేదాల వల్ల ఎలాంటి నష్టం వచ్చిందో కూడా పేర్కొన్నట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రెండో దశలో విఫలమయ్యారని విమర్శించారు.

దానికి సంబంధించిన కారణాలు కూడా పుస్తకంలో రాసినట్లు తెలిపారు.  నేను పుట్టుకతోనే గొప్పవాడిని అనే భావన చంద్రబాబులో ఉండటం వల్లే రెండో దశలో బాబు ఫెయిల్‌ అయ్యారని అన్నారు. రాష్ట్ర పాలనకు, విభజన చట్టానికి సంబంధించిన మరిన్ని విషయాలు, అంశాలు పుస్తకంలో ప్రస్తావించినట్లు వెల్లడించారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top