బాబు అవినీతి అనకొండ

IYR Krishna Rao and Ajeya kallam Comments on TDP Govt - Sakshi

ఇద్దరు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల అభియోగ సారాంశం

దేశ చరిత్రలోనే ఇద్దరు మాజీ సీఎస్‌లు వేలెత్తి చూపిన ఏకైక సర్కార్‌ ఇది

టీడీపీ ప్రభుత్వం అక్రమాలను నిర్ధారిస్తున్న మాజీ ఉన్నతాధికారులు

పదవిలో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టిన వైనం

చంద్రబాబు పాలనపై ఇంతకన్నా వేరే చార్జిషీట్‌ అవసరమా?

భూములు కేటాయింపుల్లో భారీ అక్రమాలు

ఐటీ విధానం మేరకు లీజుకు ఇవ్వకుండా కారుచౌకగా విక్రయం  

రికార్డులను తారుమారు చేసి లక్షల ఎకరాల కబ్జాకు పాల్పడిన విశాఖ భూ కుంభకోణం రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీది. రాజధాని పేరుతో రైతుల నుంచి మూడు పంటలు పండే సారవంతమైన భూములు తీసుకోవడం ఘోర తప్పిదం. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం అంచనాలను విచ్చలవిడిగా పెంచేసి ఓ కామధేనువులా భావిస్తోంది. అందుకే ప్రాజెక్టు పూర్తి కావడం లేదు.  
–ఐవైఆర్‌ కృష్ణారావు 

పేదలకు పని కల్పించేందుకు వినియోగించాల్సిన ఉపాధి హామీ పథకం నిధులను నీరు–చెట్టు లాంటి ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తూ అధికార పార్టీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. ఐటీ కంపెనీలకు భూ కేటాయింపుల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి సాగుతోంది. ప్రజాసంక్షేమం కోసం వెచ్చించాల్సిన వేలాది కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం కోసం దుర్వినియోగం చేస్తోంది.  
– అజేయ కల్లం  

సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు పాలనలో అవినీతి తారాస్థాయికి చేరిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అజేయ కల్లాం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం కలిగిస్తున్నాయి. ఆయన కంటే ముందు, రాష్ట్ర విభజన అనంతరం తొలి సీఎస్‌గా వ్యవహరించిన ఐవైఆర్‌ కృష్ణారావు కూడా టీడీపీ సర్కారు అవినీతిని నిర్ధారిస్తూ పలుమార్లు ప్రకటనలు చేయడం తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఉన్నతాధికారులే ధ్రువీకరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పాలనపై ఇంతకన్నా వేరే చార్జిషీట్‌ అవసరమా? అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. ఇవికాకుండా టీడీపీ సర్కారు రూ.లక్షల కోట్ల మేర లూటీకి పాల్పడినట్లు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ సీపీ ఆరోపణలు చేసింది. 

అది చరిత్రలోనే అత్యంత భారీ కుంభకోణం..
ఐవైఆర్‌తో పాటు అజేయ కల్లాం కూడా సీఎస్‌లుగా పదవుల్లో కొనసాగినప్పుడే నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ సర్కారు దోపిడీకి, ఖజానాకు నష్టం కలిగించేలా వ్యవహరించటాన్ని తీవ్రంగా, స్పష్టంగా వ్యతిరేకించారు. ఆ తరువాత కూడా పలు సందర్భాల్లో... రికార్డులను తారుమారు చేసి లక్షల ఎకరాల కబ్జాకు పాల్పడిన విశాఖ భూ కుంభకోణం రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీదని ఐవైఆర్‌ పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని అంతా అధికారులపైకి నెట్టేసి రాజకీయ నేతలను తప్పించారని, సిట్‌ దర్యాప్తు సక్రమంగా లేదని ఆయన స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి మూడు పంటలు పండే సారవంతమైన భూములు తీసుకోవడాన్ని ఐవైఆర్‌ తప్పుబట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అంచనాలను విచ్చలవిడిగా పెంచేసి ఓ కామధేనువులా భావిస్తోందని, లేదంటే ఈ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి అయ్యేదని వ్యాఖ్యానించారు. అంతులేని అవినీతి జరుగుతున్నప్పుడు కేంద్రం ప్రశ్నలు అడగడంలో తప్పులేదని, గుడ్డిగా ఈ అంచనాలను ఆమోదిస్తే కేంద్రం కూడా ఈ మహా స్కామ్‌లో కూరుకుపోవచ్చని ఐవైఆర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘నవ్యాంధ్రలో నా నడక’ పేరుతో పుస్తకాన్ని ఐవైఆర్‌ ఈ నెల 25 తేదీన విడుదల చేయనున్నారు. సీఎం కార్యాలయం, సీఎస్‌గా ఉండగా సీఎంతో ఎదురైన పలు అంశాలతో పాటు విభజన సమస్యలపై సర్కారు వైఖరి, భూ కేటాయింపులు తదితర అంశాలను ఆయన ఇందులో ప్రస్తావించనున్నారు. 

ప్రచారం కోసం ప్రజాధనం లూటీ...
ఐవైఆర్‌ కృష్ణారావు 2013 మే నుంచి 2014 జూన్‌ 1వ తేదీ వరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ)గా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 జూన్‌ 2వ తేదీ నుంచి 2016 జనవరి నెలాఖరు వరకు ఏపీకి తొలి సీఎస్‌గా వ్యవహరించారు. అజేయ్‌ కల్లాం 2014 జూన్‌ 2 నుంచి ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా 2017 ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనసాగారు. దీంతోపాటు రెవెన్యూ ప్రత్యేక సీఎస్‌గా కూడా కొన్నాళ్ల పాటు బాధ్యతలు పర్యవేక్షించారు. 2017 మార్చి 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో అజేయ్‌ కల్లాం విధులు నిర్వర్తించారు. పదవీ విరమణ చేసిన అనంతరం టీడీపీ సర్కారు సాగిస్తున్న అరాచకాలు, అవినీతి అంశాలను అజేయ కల్లాం బహిరంగంగా వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలో అవినీతి తీవ్రస్థాయికి చేరిందని, ప్రజాసంక్షేమం కోసం వెచ్చించాల్సిన వేలాది కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం కోసం పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తోందని పేర్కొన్నారు. పేదలకు పని కల్పించేందుకు వినియోగించాల్సిన ఉపాధి హామీ పథకం నిధులను నీరు–చెట్టు లాంటి ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తూ అధికార పార్టీ నేతలు జేబులు నింపుతున్నారు. ఐటీ కంపెనీలకు భూ కేటాయింపుల పేరుతో సాగుతున్న అవినీతిని అజేయ కల్లాం ప్రధానంగా తప్పుబట్టారు.

లీజుకు ఇవ్వకుండా కారుచౌకగా కట్టబెట్టారు.. 
సీఎం తనయుడు, మంతినారా లోకేశ్‌ సూచనల మేరకు విశాఖపట్టణంలో ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కారు చౌకగా భూములను విక్రయించింది. ప్రభుత్వ ఐటీ విధానం మేరకు ఐటీ కంపెనీలకు భూములను లీజుకు మాత్రమే ఇవ్వాలి. అయితే మంత్రి లోకేశ్‌కు కావాల్సిన వ్యక్తులు అందులో ఉండటంతో  రూ.400 కోట్ల విలువ చేసే 40 ఎకరాలను కారు చౌకగా ఎకరం రూ.32.50 లక్షల చొప్పున రూ.13 కోట్లకే సర్కారు విక్రయించింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినా లక్ష్యపెట్టలేదు. అమెరికాలోని శాన్‌ ఫ్రాన్స్‌కోలో ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ప్రధాన కార్యాలయం పది ఎకరాల్లో మాత్రమే ఉందని, అలాంటిది ఇక్కడ 40 ఎకరాలు కేటాయించాల్సిన అవసరం లేదని కమిటీ పేర్కొంది. విశాఖ రూరల్‌ మండలం  మధురవాడలో గతంలో ఈ 40 ఎకరాలను పర్యాటక శాఖకు కేటాయించారని, అయితే ఆ భూమి మార్కెట్‌ ధర ఎకరం రూ.10 కోట్లకు పైగా ఉందని, ఏపీఐఐసీ నిర్ధారించిన ధర ఎకరం రూ. 2.70 కోట్లుగా ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థ కోరినట్లుగా ఎకరం రూ.32.50 లక్షలకు కాకుండా కనీసం ఏపీఐఐసీ నిర్ధారించిన ధర ప్రకారం ఎకరం రూ.2.70 కోట్ల చొప్పునైనా కేటాయించాలని, అది కూడా తొలుత కేవలం పది ఎకరాలనే ఇవ్వాలని సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ గట్టిగా సూచించింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఐటీ మంత్రి లోకేశ్‌ సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ సిఫార్సులను పట్టించుకోకుండా ఎకరం రూ.32.50 లక్షల చొప్పున ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థకు అమ్మేశారు. ఐటీ విధానం మేరకు లీజుకు మాత్రమే ఇవ్వాల్సి ఉన్నా లోకేశ్‌ సూచన మేరకు విక్రయించారు. మరికొన్ని ఐటీ కంపెనీలు కూడా భూములను విక్రయించాలని కోరగా ప్రభుత్వం తిరస్కరించింది. దీన్నిబట్టి తమకు కావాల్సిన వారికి ఒక విధానం ప్రకారం, ఇతరుల పట్ల  మరో విధానాన్ని అనుసరించడం ద్వారా దోపిడీ, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడుతున్నట్లు ప్రభుత్వమే ధ్రువీకరించినట్లైంది.

స్విస్‌ ఛాలెంజ్‌ వద్దన్న కల్లాం
రాజధాని అమరావతిలో రైతుల నుంచి తీసుకున్న భూములను స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో సంప్రదింపుల ద్వారా సింగపూర్‌ కంపెనీలకు అప్పగించాలని టీడీపీ సర్కారు నిర్ణయించినప్పుడు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అజేయ కల్లాం గట్టిగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల మేరకు అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించాలని స్పష్టం చేశారు. సింగపూర్‌ కంపెనీలకు భారీ రాయితీలు ఇవ్వడంపై కూడా ఆయన తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. పర్యాటక విధానం మేరకు ప్రాజెక్టు వ్యయంలో రాయితీలు 20 శాతానికి మించరాదని, అంతేకాకుండా సింగపూర్‌ సంస్థలకు ఇచ్చే భూముల్లో మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌ నుంచి రూ. 5,500 కోట్లు వ్యయం చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. వివాదాలు తలెత్తితే లండన్‌ కోర్టులో పరిష్కరించుకోవాలనే షరతుతోపాటు ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగితే సింగపూర్‌ కంపెనీలకు పెనాల్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో చెల్లించాలనే షరతులను అంగీకరించరాదని కల్లాం లిఖిత పూర్వకంగా పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు దీన్ని పెడచెవిన పెడుతూ సింగపూర్‌ కంపెనీలకు భారీ రాయితీలతో 1,691 ఎకరాలను కట్టబెట్టేశారు. సింగపూర్‌ కంపెనీలతో ఒప్పందం రాష్ట్ర ఖజానాకు గుదిబండగా మారుతుందని అజేయ కల్లాం బహిరంగంగానే హెచ్చరించారు.

విరాళాలివ్వాలంటూ ‘ప్రత్యేక’ విమానాల్లో విహారాలా?
సీఎం చంద్రబాబు ఒకపక్క రాజధాని నిర్మాణం పేరుతో విరాళాలు వసూలు చేస్తూ మరోపక్క రెగ్యులర్‌ ఫ్లైటున్నా సరే ప్రత్యేక విమానాల్లో విహరించడాన్ని అజేయ కల్లాం ‘మేలుకొలుపు’ పుస్తకంలో తప్పుబట్టారు. ఏటా రూ.15 కోట్లకుపైగా ప్రత్యేక విమానాలకు వ్యయం చేస్తున్నారని, రాష్ట్రం రెవెన్యూ లోటులో ఉండగా దుబారా వ్యయం సరికాదన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికీ  లేని విధంగా రెండేసి క్యాంపు ఆఫీసులు, ఇళ్లు ఉండటం, వాటికి మరమ్మతుల పేరుతో కోట్ల రూపాయలు వెచ్చించడాన్ని కూడా అజేయ కల్లాం తప్పుపట్టారు. 

‘హెచ్‌సీఎల్‌’ రాకుండా సీమకు అన్యాయం..
‘హెచ్‌సీఎల్‌’ కంపెనీని తిరుపతిలో స్థాపించాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అడ్డుపడి అమరావతికి తరలించి రాయలసీమకు అన్యాయం చేశారని అజేయ కల్లాం పేర్కొన్నారు. అమరావతి పేరుతో ఇతర ప్రాంతాలకు అన్యాయం చేస్తోందని, హెచ్‌సీఎల్‌ కంపెనీని తిరుపతిలో  ఏర్పాటు చేయించాలని తాను మొత్తుకున్నా ప్రభుత్వం అంగీకరించలేదని అజేయ కల్లాం స్పష్టం చేశారు. ధర్మ పోరాటాలు, దీక్షలు పేరుతో ప్రభుత్వం నాటకాలు, డ్రామాలాడుతూ కాలం గడుపుతోందన్నారు.

తాత్కాలిక భవనాలకు కళ్లు చెదిరే ఖర్చు
ఇక రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణాలకు వెచ్చించిన వ్యయం చూస్తే నివ్వెరపోవడం ఖాయమని అధికారులు పేర్కొంటున్నారు. వర్షం వస్తే కారిపోయే తాత్కాలిక సచివాలయానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి రూ.11,666 చొప్పున వ్యయం చేసింది. ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి రూ.750 కోట్లు వ్యయం చేసినట్లు కేంద్ర ప్రభుత్వానికి పంపిన వినియోగ పత్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇంతకన్నా దోపిడీ ఎక్కడైనా ఉంటుందా? అని సచివాలయ ఉద్యోగుల్లోనే చర్చ సాగుతోంది.

సెట్‌టాప్‌ బాక్సుల పేరుతో దోపిడీ
ప్రజలు తమ ఇష్ట్రపకారం కొనుక్కునే సెట్‌టాప్‌ బాక్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి పంపిణీ చేసే బాధ్యతను సీఎం చంద్రబాబు సన్నిహితుడికి కట్టబెట్టారు. నాణ్యమైన సెట్‌టాప్‌ బాక్సులు రూ.1,500కే లభిస్తుండగా ప్రభుత్వం కొనుగోలు చేసే ఒక్కో సెట్‌టాప్‌ బాక్సుకు రూ. 4,000 చెల్లిస్తోంది. ఇందులో భారీ అవినీతి జరుగుతున్నట్లు తేలిపోతోంది. అంతే కాకుండా ఈ బాక్సుల కొనుగోలు కోసం రూ.4 వేల కోట్లు అప్పు చేయడమే కాకుండా దానికి ప్రభుత్వమే గ్యారెంటీ కూడా ఇస్తోంది. 

సాగునీటిలో కమీషన్ల పర్వం..
సాగునీటి ప్రాజెక్టుల ముసుగులో అంచనాలు భారీగా పెంచేసి కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్సుల రూపంలో ప్రభుత్వ పెద్దలు కమీషన్లు దండుకుంటూ సర్కారు ఖజానాను కొల్లగొడుతున్నారు. నీరు–చెట్టు పనుల పేరుతో ఉపాధిహామీ నిధులను మళ్లించి చెరువుల పూడికతీత పనుల్లో మట్టిని సైతం విక్రయిస్తూ అధికార పార్టీ నేతల జేబులను నింపుతున్నట్లు పలుమార్లు వెల్లడైంది. ఇసుక నుంచి మట్టి దాకా దోపిడీకి పాల్పడటంతో పాటు ఎక్కువ ధరకు బొగ్గు కొనుగోళ్లు, ఎక్కువ ధరకు సోలార్‌ విద్యుత్‌ కొనుగోళ్లు చేస్తూ జనం నెత్తిన భారం మోపుతోంది. డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రభుత్వం సెల్‌ఫోన్లు కొనుగోలు చేసి ఇస్తూ అందులోనూ భారీ అవినీతికి తెరతీసింది. తొలుత ఐదు లక్షల సెల్‌ఫోన్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు కొన్నట్లు చూపిస్తూ రూ. 150 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. సెల్‌ఫోన్ల కొనుగోళ్లకు మరో రూ.403 కోట్లు కావాలంటూ ఐటీ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఇందులో ఇంకెంత దోపిడీ జరుగుతుందోనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పారిశ్రామిక, ఐటీ రాయితీల పేరుతో ప్రాజెక్టు స్థాపనకు అయ్యే వ్యయానికి మించిపోయి ఖజానా నుంచి రాయితీలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆంతర్యం ఏమిటో తేలిగ్గానే ఊహించవచ్చని పేర్కొంటోంది. ప్రైవేట్‌ వ్యక్తులు చేయాల్సిన టవర్ల నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖజానా నుంచి ఖర్చు చేయటాన్ని తప్పుబడుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top