అక్కడ ‘చేయి’ పడలేదు.. ఇక్కడ ‘కాషాయం’ పండలేదు | History of Political Parties in Lok Sabha Election | Sakshi
Sakshi News home page

అక్కడ ‘చేయి’ పడలేదు.. ఇక్కడ ‘కాషాయం’ పండలేదు

Mar 26 2019 8:56 AM | Updated on Mar 26 2019 8:56 AM

History of Political Parties in Lok Sabha Election - Sakshi

ఆ 14 లోక్‌సభ స్థానాల్లో ఒక్కదాంట్లోనయినా పాగా వేయాలని కాంగ్రెస్‌ గత పదిహేనేళ్లుగా విఫలయత్నం చేస్తోంది. అలాగే, రెండు లోక్‌సభ సీట్లను కాంగ్రెస్‌ నుంచి గుంజుకోవడానికి బీజేపీ కూడా పదిహేనేళ్లుగా పోరాడుతోంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి ఇది. గత పదిహేనేళ్లుగా బీజేపీ చేతిలో ఉన్న మధ్యప్రదేశ్‌ను ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. ఆ స్ఫూర్తితో ఈ ఎన్నికల్లోనయినా ఆ 14 సీట్లలో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని ఆశపడుతోంది. రాష్ట్రంలోని భోపాల్, ఇండోర్, విదిష, మొరెనా, భింద్, సాగర్, తికంగఢ్, దామో, ఖజురహో, సత్నా, జబల్‌పూర్, బాలాఘాట్, బీటల్, రెవా లోక్‌సభ నియోజకవర్గాల్లో గత పదిహేనేళ్లలో ఒక్కసారి కూడా కాంగ్రెస్‌ విజయం సాధించలేదు.

ఈ సీట్లన్నింటిలోనూ ఎప్పుడూ బీజేపీయే నెగ్గుతోంది. అలాగే, కాంగ్రెస్‌ నేతలు కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియాలు ప్రాతినిధ్యం వహిస్తున్న గుణ, చింద్వారా నియోజకవర్గాల్లో ఇంత వరకు బీజేపీ బోణీ చేయలేదు. ఇక్కడ నెగ్గడం కోసం కమలదళం గత దశాబ్దంన్నరగా కృషి చేస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని 29 నియోజకవర్గాల్లో 27 చోట్ల విజయం సాధించింది. అయితే, ఈ రెండూ మాత్రం కాంగ్రెస్‌ ఖాతాలోకే వెళ్లాయి. ఈ 14 సీట్లలో తమ పార్టీ ఒక్కసారి కూడా నెగ్గకపోవడాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రతినిధి పంకజ్‌ చతుర్వేది అన్నారు. ఈసారి ఈ నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులను నిలబెడతామని, మోదీ వ్యతిరేకత కారణంగా ఇక్కడ తాము గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ప్రతినిధి దీపక్‌ విజయవర్గీయ కూడా గుణ, చింద్వారా నియోజకవర్గాల్లో శక్తిమంతమైన అభ్యర్థులను బరిలో దించుతామని అంటున్నారు. ఈ రెండు సీట్లను కూడా గెలుచుకుని ఈ ఎన్నికల్లో క్వీన్‌స్వీప్‌ చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement