తండ్రి బీజేపీ.. కొడుకు కాంగ్రెస్‌లో

In Himachal Pradesh BJP Minister Will Not Contest Against Son Who Is In Congress Said Family Matter - Sakshi

సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. తండ్రి బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతుండగా.. కొడుకు మాత్రం కాంగ్రెస్‌ పార్టీ తరపున లోక్‌ సభ ఎన్నికల బరిలో నిలిచారు. అయితే కొడుకు తరఫున తాను ప్రచారం చేయనంటున్నారు హిమాచల్‌ బీజేపీ మంత్రి అనిల్‌ శర్మ. మాజీ కాంగ్రెస్‌ నాయకుడు సుఖ్‌రామ్‌.. ఆయన కుమారుడు అనిల్‌ శర్మ 2017, అక్టోబర్‌లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత జరిగిన హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అనిల్‌ శర్మ మండి శాసనసభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం బీజేపీ ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చింది.

అయితే అనిల్‌ శర్మ తండ్రి సుఖ్‌రామ్‌, కుమారుడు ఆశ్రయ్‌ శర్మ ఈ ఏడాది మార్చి 25న  తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఆశ్రయ్‌ శర్మకు మండి పార్లమెంట్‌ టికెట్‌ను కేటాయించింది. ఈ విషయం గురించి అనిల్‌ శర్మ మాట్లాడుతూ.. ‘మా తండ్రి, కుమారుడు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. అంతేకాక ఆశ్రయ్‌కు కాంగ్రెస్‌ పార్టీ మండి నియోజకవర్గం టికెట్‌ను కూడా కేటాయించింది. ఈ విషయం గురించి నేను అధిష్టానంతో కూడా చర్చించాను. మండిలో బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయలేనని చెప్పాను. పార్టీ నా అభ్యర్థనను మన్నించింది. అలా అని నా కొడుకు తరఫున కూడా ప్రచారం చేయన’ని చెప్పుకొచ్చారు.

ఈ విషయం గురించి హిమాచల్‌ ప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు సత్పాల్‌ సింగ్‌ సట్టి మాట్లాడుతూ.. ‘ఇది వారి కుటుంబానికి సంబంధించిన విషయం. మీడియా ఎందుకు దీని వెనకే పరుగులు తీస్తుందో నాకు అర్థం కావడం లేదు’ అంటూ మండి పడ్డారు. మరో మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ తరఫున మండి నియోజకవర్గంలో తప్ప ఎక్కడైనా ప్రచారం చేస్తానని స్పష్టం చేయడం గమనార్హం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top