ఛత్తీస్‌గఢ్‌లో హై అలర్ట్‌..

High alert in Chhattisgarh - Sakshi

మావోయిస్టుల వరుసదాడులతో అతలాకుతలమవుతున్న ఛత్తీస్‌గఢ్‌లోని 90 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 12న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఓవైపు భద్రతా బలగాలు అడవులన్నీ గాలిస్తుంటే.. మరోవైపు మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం ఉన్న ఆరు జిల్లాల్లో పరిస్థితి గంభీరంగా ఉంది. అయితే, మారుమూల ప్రాంతాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్నికలు జరిపి తీరాల్సిందేనన్న పట్టుదలతో.. ఎన్నికల సంఘం 65వేల మంది కేంద్రీయ, రాష్ట్ర పోలీసు బలగాల సాయంతో ఏర్పాట్లు చేస్తోంది. డ్రోన్లు, హెలికాప్టర్లతో భద్రతను పర్యవేక్షిస్తోంది. ‘ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు బలగాలన్నీ అప్రమత్తంగా ఉండాలి’ అని పైనుంచి ఆదేశాలొచ్చాయని సీఆర్‌పీఎఫ్‌ అధికారి ఒకరు తెలిపారు.

రాజస్తాన్‌
దళితుల 24 గీ7 కంట్రోల్‌రూమ్‌
ఎన్నికలు రాగానే.. ప్రధాన, ప్రాంతీయ పార్టీల నుంచి చిన్నా, చితకా పార్టీల వరకు తమ అభ్యర్థుల ప్రచార సరళిని గమనించేందుకో, కార్యకర్తలతో అనుసంధానంలో ఉండేందుకో 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా కంట్రోల్‌ రూమ్స్‌ను ఏర్పాటుచేసుకోవడం సహజం. కానీ తొలిసారిగా రాజస్తాన్‌లో దళితుల కోసం 24 గంటల కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటైంది. దళిత సంఘాలన్నీ ఏకమై దీన్ని ఏర్పాటుచేసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఏయే పార్టీలు దళితుల గురించి ఎలాంటి హామీలిస్తున్నాయని గమనించడం, ఆయా హామీలపై అవసరమైనప్పుడు స్పందించడం, ఎన్నికల నేపథ్యంలో దళితులు, బడుగు బలహీనవర్గాలు ఇచ్చే ఫిర్యాదులపై అధికారులను అప్రమత్తంత చేయడం వంటి పనులను ఈ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా నిర్వర్తిస్తారు. మొత్తంగా ఎన్నికల సందర్భంగా దళితుల హక్కులకు ఎక్కడా భంగం వాటిల్లకుండా చూడటమే దీని ఏర్పాటువెనక ముఖ్యోద్దేశమని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌
ఆ రెస్టారెంట్‌ ఇప్పుడో హాట్‌ టాపిక్‌! 
మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మూడు రోజుల క్రితం రాహుల్‌ గాంధీ ఇండోర్‌లోని ‘యంగ్‌ తరంగ్‌’అనే చిన్న రెస్టారెంట్‌లో స్నాక్స్‌ తిన్నారు. రుచికరమైన మసాలా చాట్‌ను రాహుల్‌ సంతోషంగా లాగించేశారు. నిజానికి ఆ రెస్టారెంట్‌ యజమాని బీజేపీ అభిమాని. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌పై అభిమానం కొద్దీ సీఎం ఫొటోను రెస్టారెంట్‌లో ఎదురుగా పెట్టుకున్నారు. ఈ కారణంతోనే రెస్టారెంట్‌ పేరు హాట్‌ టాపిక్‌గా మారింది. హోటల్‌కు వచ్చే వారందరికీ.. రాహుల్‌ మా హోటల్లోనే భోజనం చేశారని ఆయన గర్వంగా చెప్పుకుంటున్నారు. ‘ శివరాజ్‌ చౌహాన్‌ ఫొటో పక్కనే రాహుల్‌ ఫొటో పెడతా’అంటున్నాడు. ప్రస్తుతం ఆ రెస్టారెంట్‌ గురించి ఇండోర్‌ నగరమంతా చర్చ జరుగుతోంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top