హజ్‌ రాయితీ రద్దు ; తీర్థయాత్రల మాటేంటి? : అసదుద్దీన్‌ | Haj Subsidy withdraw ; Asaduddin owaisi questions to BJP | Sakshi
Sakshi News home page

హజ్‌ రాయితీ రద్దు ; తీర్థయాత్రల మాటేంటి? : అసదుద్దీన్‌

Jan 16 2018 8:47 PM | Updated on Jan 16 2018 8:47 PM

Haj Subsidy withdraw ; Asaduddin owaisi questions to BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హజ్‌ యాత్రికులకు సబ్సిడీని రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైదరాబాద్‌ ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. తాము కూడా మొదటి నుంచీ హజ్‌ సబ్సిడీని వ్యతిరేకిస్తూనే ఉన్నామని గుర్తుచేశారు. అయితే, హిందూ, ఇతర మతస్తుల తీర్థయాత్రలకు అందిస్తోన్న సబ్సిడీలపైనా కేంద్రం ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. మంగళవారం దారుసలాంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘హజ్‌యాత్రికులకు ప్రభుత్వాలు అందించే రాయితీలను ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు ఓటు బ్యాంకు రాజకీయాలని విమర్శించాయి. నిజమే, మేము కూడా రాయితీలేవీ అవసరం లేదని మొదటి నుంచి చెబుతున్నాం. ఈ ఏడాది సబ్సిడీ విలువ రూ.200 కోట్లు మాత్రమే. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. 2022 నాటికి ఈ(రాయితీలు ఇచ్చే) విధానం పూర్తిగా అంతంకావాల్సిఉంది. కానీ ఈలోపే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. మరి హిందూ తీర్థయాత్రలకు నేటికీ అందుతోన్న సబ్సిడీలు ఓటు బ్యాంకు రాజకీయాల కిందికి రావా?

కుంభమేళా, అయోధ్య, కాశీ, మథుర, మానససరోవర యాత్రికులకు బీజేపీ ప్రభుత్వాలు ఇస్తోన్న సబ్సిడీల మాటేమిటి? ఆయా యాత్రలకు సబ్సిడీల కింద రూ.800 కోట్లు ఖర్చుచేస్తోన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను బీజేపీ నిలువరించగలదా? ఆలయాల పునరుద్ధరణకు, అర్చకులకు నిధులివ్వడం ఆపేస్తారా? అసలీ విషయంలో కాషాయపార్టీకి స్పష్టత ఉందా, రాజ్యాంగంలోని 290ఏ ఆర్టికల్‌ రద్దు చేసేలా పార్లమెంటులో బిల్లు పెట్టే దమ్ముందా?’’ అని అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. ఈ ఏడాది హజ్‌ యాత్రకు వెళ్లే 1.75 లక్షల మంది యాత్రికులకు సబ్సిడీని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తర్‌ అబ్బాస్‌ నక్వీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement