ఢిల్లీ, ఏపీ సీఎంలకు జీవీఎల్‌ కౌంటర్‌

GVL Narasimha Rao Counter To Chandrababu And Kejriwal - Sakshi

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేపట్టిన నిరసనకు నాలుగు రాష్ట్రాల సీఎంలు మద్దతు తెలపడాన్ని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహరావు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అద్భుతంగా పాలిస్తున్నారని, రాష్ట్రాలతో స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాలకు గతంతో పోల్చితే రెట్టింపు నిధులు ఇస్తున్నారని జీవీఎల్‌ పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌లు సీఎంగా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. కేవలం వారి అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికే సీఎంలు నిరసన చేపడుతున్నారని విమర్శించారు.

చంద్రబాబు, కేజ్రీవాల్‌లపై ట్వీట్‌లో జీవీఎల్‌ మండిపడ్డారు. ’ చంద్రబాబు, కేజ్రీవాల్‌ల మధ్య కామన్‌ పాయింట్‌ ఉంది. సీఎంలుగా బాధ్యతలు నిర్వహించడంలో ఈ ఇద్దరూ విఫలమయ్యారు. వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే దీక్షలు, నిరసనలు చేపడుతున్నారు. చంద్రబాబు ఫైవ్‌ స్టార్‌ నిరసనల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. నిధుల కోసమే తాను ఇలా చేస్తున్నానని చెబుతుంటారు’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

వీరు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రభుత్వ అధికారులను ఉపయోగించారని జీవీఎల్‌ విమర్శించారు. చంద్రబాబు తన రాజకీయాల కోసం నాన్‌ గెజిటెడ్‌ కార్మికులను ఉపయోగించడంలో నిపుణుడని.. కేజ్రీవాల్‌ ప్రధాన కార్యదర్శిపై దాడికి తన గుండాలను ఉపయోగించారని తెలిపారు. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో కేజ్రీవాల్‌ దీక్షకు సంఘీభావంగా పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ సీఎంలు మమత బెనర్జీ, కుమారస్వామి, పినరయి విజయన్‌, చంద్రబాబు నాయుడులు కేజ్రీవాల్‌ భార్యను పరామర్శించిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top