18 ‘ఎంపీపీ’లకు 15న ఎన్నికలు

Gazetted Officers of relevant MPP will issue notices on 14th of this month - Sakshi

నోటిఫికేషన్‌ జారీ చేసిన ఎస్‌ఈసీ

సాక్షి, హైదరాబాద్‌: వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగకుండా వాయిదా పడిన 18 మండలాల్లోని కోఆప్టెడ్, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికను ఈ నెల 15న నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 7న ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎంపీపీ కోఆప్టెడ్, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జెడ్పీపీ కోఆప్టెడ్‌ చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నికలు పూర్తిచేసేందుకు ఎస్‌ఈసీ ఏర్పాట్లు చేసింది. జెడ్పీపీ పదవులన్నింటికీ ఏకగ్రీవ ఎన్నికలు పూర్తికాగా, కొన్ని ఎంపీపీల్లో కోరం లేక కోఆప్టెడ్, అధ్యక్షులు, ఉపాధ్యక్ష ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో 18 ఎంపీపీల్లోని పదవులకు ఎన్నిక నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి నోటిఫికేషన్‌లో తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికయ్యే పాలక మండళ్ల పదవీ కాలం ఏ తేదీ నుంచి మొదలయ్యేది ఎస్‌ఈసీ విడిగా నోటిఫై చేస్తుందని పేర్కొన్నారు.  

ఎన్నికలు జరిగే స్థానాలు ఇవే..
ఆదిలాబాద్‌ జిల్లాలోని గుడిహత్నూర్, జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, సారంగపూర్, భద్రాద్రి జిల్లా లోని అల్లపల్లి, ములకలపల్లి, సుజాత నగర్, లక్ష్మీదేవిపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మహబూబ్‌నగర్, మెదక్‌ జిల్లాలోని టెక్మల్, సంగారెడ్డి జిల్లాలోని మొగుడంపల్లి, నల్లగొండ జిల్లాలోని చందంపేట, కేతేపల్లి, నేరేడుగొమ్ము, సూర్యా పేట జిల్లాలోని చిల్కూరు, రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్, మాడుగుల, జనగామ జిల్లా తరిగొప్పుల, జయశంకర్‌ జిల్లా మహదేవ్‌పూర్‌ ఎంపీపీ స్థానాలకు 15న ఎన్నికలు జరగుతాయి.  

ఎన్నిక నిర్వహిస్తారిలా..
15న నిర్వహించే ప్రత్యేక సమావేశానికి సంబంధించి 14వ తేదీలోగా సంబంధిత ఎంపీపీల గెజిటెడ్‌ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. ఈ మండలాల్లో ఉదయం 9 నుంచి 10 మధ్య కోఆప్టెడ్‌ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. వీటిని పరిశీలించాక మధ్యాహ్నం ఒంటి గంటకు కోఆప్టెడ్‌ సభ్యుల ఎన్ని క, అది ముగిశాక మధ్యాహ్నం 3కి ఎంపీపీ అధ్యక్షు లు, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహిస్తారు.

ఏదైనా కారణంతో కోఆప్టెడ్‌ సభ్యుడి ఎన్నిక జరగకపోతే అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహించరు. ఈ విషయాన్ని అధికారులు ఎస్‌ఈసీకి తెలపాల్సి ఉంటుంది. కోఆప్టెడ్‌ల ఎన్నిక పూర్తయ్యాక ఏ కారణంతోనైనా ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక జరగకపోతే, 16న ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ రోజు కూడా ఎన్నికలు జరగకపోతే ఈ విషయాన్ని ఎస్‌ఈసీకి తెలియజేస్తే దీనికోసం మరో తేదీని నిర్ణయిస్తుంది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top