కర్రను జమ్మిపై దాచి.. ఓట్లకు బయలెల్తా | Sakshi
Sakshi News home page

కర్రను జమ్మిపై దాచి.. ఓట్లకు బయలెల్తా

Published Mon, Jul 23 2018 3:10 AM

Gaddar about new party - Sakshi

హైదరాబాద్‌: ఎప్పుడూ చేతిలో కర్ర, ఎర్రగుడ్డతో కనిపించే ప్రజా గాయకుడు గద్దర్‌ భవిష్యత్‌లో ఈ కర్రను జమ్మిచెట్టుపై పెడుతున్నట్లు ప్రకటించారు. ఇక తాను ఓటును నమోదు చేసుకొని ఓట్ల కోసం బయలుదేరుతానని.. పార్టీ పెట్టడం తథ్యమని స్పష్టం చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో గద్దర్‌ అభిమానుల ఆధ్వర్యంలో బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా గద్దర్‌ ఇష్టాగోష్టి కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా గద్దర్‌ మాట్లాడుతూ పార్టీని ప్రకటించే ముందు స్టీరింగ్‌ కమిటీని వేసి గ్రామ గ్రామానికి వెళ్లి ప్రజలను ఒప్పిస్తానని, ప్రజలను ఓటర్లుగా మారుస్తానని అన్నారు. భావసారూప్యత కలిగిన పార్టీలతో చర్చలు జరుపుతామన్నారు. ఆగస్టు చివరి వారంలో కరీంనగర్‌ జిల్లా వేములవాడలో లక్షలాది మందితో బహిరంగ సభను నిర్వహించి విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. దేనికైనా సిద్ధపడేవారే తనతో కలసి రావాలని అన్నారు. తనకు ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలో సభ్యత్వం లేదని, 70 ఏళ్ల వయస్సులో కూడా ఓటు హక్కు లేదని అన్నారు.

నేడు ఓటు హక్కు నమోదు
పార్టీ పెట్టాలంటే ఓటు హక్కు ఉండాలని.. అందుకే సోమవారం తాను ఓటు హక్కును నమోదు చేసుకుంటానని గద్దరు వెల్లడించారు. ఓటు కూడా పోరాట రూపం అని తెలిసింది కాబట్టే తన పంథాను మార్చుకున్నానని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓడిపోయేది, గెలిచేది ప్రజలేనని, నాయకులు కాదని అన్నారు.

కార్పొరేట్‌ కబంధ హస్తాల నుంచి ఓటు హక్కును విముక్తి చేయాలని పిలుపునిచ్చారు. ఇక నుంచి పల్లె పల్లెకు పాటతో పార్లమెంటుకు బాట వేస్తానని చెప్పారు. ఓట్ల రాజకీయంలోకి రావాలంటే వెయ్యి మంది శత్రువులను తయారు చేసుకున్నట్లేనని అన్నారు. పార్టీ అంటే ఏమిటో చిరంజీవిని అడగటానికి వెళ్తానని, అమితాబ్‌ను కూడా అడుగుతానని చెప్పారు.  

ఓటు కూడా ఓ పోరాట రూపం
రాజకీయ అధికారంలో ఓటు చాలా విలువైందన్నారు. ఓటు కూడా ఒక పోరాట రూపమేనని అన్నారు. తాను చనిపోయిన తర్వాత తన బొందమీద బుద్ధుడి జెండాను పెట్టాలని చెప్పారు. ఓటు బందీ అయిందని దాన్ని విముక్తి చేయాలని కోరారు.

మార్క్స్, పూలే, అంబేడ్కర్‌ పార్టీ అంటే మామూలు విషయం కాదని, పార్టీ నిర్మాణంతో పాటు త్యాగం చేయాలన్నారు. నేను చదవని పుస్తకం లేదు, పోని ప్రాంతం లేదు, తెలియని భాష లేదని, ఎర్ర జెండాతో నీలం జెండా కలుపుకొని తిరిగానని అన్నారు. సీఎల్‌ యాదరిగి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జె.బి.రాజు, ప్రొఫెసర్‌ ప్రభంజన్‌ యాదవ్, ప్రొఫెసర్లు రాము, కుమారస్వామి, వనజ, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement