ఓటు.. గెలిచేట్టు..

Free transportation facility for all Disabled Voters - Sakshi

దివ్యాంగులందరూ పోలింగ్‌ బూత్‌కు వచ్చేట్టు...

దివ్యాంగ ఓటర్లు 4,12,098 మంది

అందరికీ ఉచిత రవాణా సౌకర్యం

5 కేటగిరీలుగా గుర్తింపు కార్డుల జారీ

ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిన యంత్రాంగం.. పోలింగ్‌ రోజు ప్రతి ఓటు పడేలా చూసేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కారణం ఏదైనా.. దివ్యాంగులు పోలింగ్‌కు దూరంగానే ఉండిపోతున్నారు. అందుకోసమే ఈసారి ప్రత్యేకించి పోలింగ్‌ ప్రక్రియలో దివ్యాంగులు, వృద్ధులను భాగస్వాముల్ని చేసే ప్రయత్నం జరుగుతోంది. దివ్యాంగులతో పాటు వృద్ధులు నేరుగా పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకోవడానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తోంది. దేశంలోనే తొలిసారి ఈ వినూత్న ప్రయోగానికి తాజాగా ఎన్నికలు జరుగుతున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం, ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రాలు వేదిక కానున్నాయి. వయోభారం, అంగవైకల్యంతో పోలింగ్‌ స్టేషన్‌కు రావడానికి ఇబ్బంది పడే ఓటర్లను ఆటో రిక్షాల ద్వారా తరలిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 32,572 పోలింగ్‌ కేంద్రాల్లో ఈ ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్‌ బూత్‌లను అనుసంధానిస్తూ 19,044 లొకేషన్లలో వీటిని వృద్ధులు, దివ్యాంగుల సేవల కోసం అందుబాటులో ఉంచుతారు. 80 ఏళ్ల పైబడిన వృద్ధులు ఈ ఆటోల్లో ప్రయాణించడానికి అనుమతిస్తారు. మరోవైపు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకునే వికలాంగులు సులువుగా ఓటు వేయడానికి వీల్‌చైర్లను కూడా సమకూరుస్తున్నారు. ఇప్పటికే జిల్లాల్లో ట్రైసైకిళ్లను సేకరించాలని జిల్లా ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు కూడా జారీచేసింది.

దివ్యాంగ ఓటర్లు 4 లక్షల పైనే..
తెలంగాణలో ‘సదరం’ రికార్డుల ప్రకారం 18 ఏళ్లు నిండిన దివ్యాంగులు 7 లక్షల మందికి పైనే ఉంటారని అంచనా. వీరిలో ఓటుహక్కు కలిగిన వారు 4,12,098 మంది ఉన్నారు. ‘సదరం’ రికార్డుల ద్వారా ఇంకా దివ్యాంగులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం పోలింగ్‌ బూత్‌ల వారీగా వారిని గుర్తించే ప్రక్రియ కూడా నడుస్తోంది. దివ్యాంగులకు కల్పించే సౌకర్యాల విషయమై ప్రతి జిల్లా కేంద్రంలోనూ హెల్ప్‌లైన్లనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇక, ‘వాదా యాప్‌’ ద్వారా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలను అందుబాటులోకి తేనున్నారు. తీవ్ర వైకల్యం ఉన్న వారికి ఆన్‌లైన్‌ ద్వారా ఓటింగ్‌ సదుపాయాన్ని కల్పించాలనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి.  

మ్యాపింగ్‌ పూర్తి!
దివ్యాంగ ఓటర్లు ఉన్న పోలింగ్‌ బూత్‌ల మ్యాపింగ్‌ ప్రక్రియ 70 శాతం వరకు పూర్తయింది. ఇది మొత్తం పూర్తయితే తదనుగుణంగా రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుంది. దివ్యాంగులు ఏ సమయంలో ఓటెయ్యడానికి వస్తారో తెలుసుకుని ఆ సమయంలో వాహన సౌకర్యం కల్పిస్తారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 వేల వీల్‌చైర్లను అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో చిన్నపాటి ర్యాంపు నిర్మించి, అక్కడ వీల్‌చైర్‌ను ఉంచుతారు. అంతకుముందు పోలింగ్‌ బూత్‌ వరకు వారిని తరలించేందుకు ఆటోలు, ఇతర రవాణా వాహనాలను వినియోగిస్తారు. అలాగే, మహిళల కోసం పింక్‌ పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇది నియోజకవర్గానికి ఒకటి ఉంటుంది.

ఇంకా దివ్యాంగ ఓటర్లను ఓటు వేయించే దిశగా ప్రోత్సహించేందుకు ఎన్నికల సంఘం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను అంబాసిడర్లుగా నియమించింది. వీరిలో సినీ నటి అభినయశ్రీ, అంధ క్రికెటర్లు మహేంద్ర, మధు, అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు ఆంజనేయులు, టీవీ యాంకర్‌ సుజాత, గాయకురాలు శ్రావ్య, శాస్త్రవేత్త బాబూ నాయక్‌ దివ్యాంగుల్లో ఓటు చైతన్యం కోసం వివిధ రూపాల్లో ప్రచారం నిర్వహిస్తారు. 

ఐదు రకాల గుర్తింపు కార్డులు
దివ్యాంగులను మొత్తం ఐదు రకాలుగా విభజించారు. ఈ మేరకు గుర్తింపు కార్డులను తయారు చేస్తున్నారు. వీటిని నవంబర్‌ నెల చివరి నుంచి ప్రతి ఇంటికీ వెళ్లి దివ్యాంగులకు అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కార్డులను బట్టి దివ్యాంగులను సులభంగా గుర్తించేందుకు వీలుగా ఈ ఐదు రకాల రంగులతో కూడిన దివ్యాంగుల ఓటర్ల జాబితాను ఎన్నికల సిబ్బందికి కూడా అందచేస్తారు. దీనివల్ల ఓటు వేయడానికి వచ్చిన దివ్యాంగులు ఏ కేటగిరీ వారో గుర్తించి, వెంటనే వారికి తగిన సౌకర్యం కల్పిస్తారు. 

- కాళ్లు, చేతులు లేనివారు
వీరిని ‘లోకోమోటర్‌’గా వ్యవహరిస్తారు. వీరిని గుర్తించేందుకు వీలుగా ఎరుపు రంగు (రెడ్‌) గుర్తింపు కార్డు జారీ చేస్తారు.

- అంధులు
కంటి చూపు లేని వారిని గుర్తించేందుకు ఆరెంజ్‌ కార్డు కేటాయించారు.

- మానసిక వికలాంగులు
వీరిని గుర్తించేందుకు పర్పుల్‌ కార్డులను జారీ చేస్తారు.

- బధిరులు: వినికిడి లోపం గల వీరి కోసం నీలి రంగు (బ్లూ) కార్డు అందచేస్తారు. వీరితో సంజ్ఞల భాషలో మాట్లాడేందుకు వీలుగా పోలింగ్‌ సిబ్బందికి కూడా అవగాహన కల్పిస్తున్నారు. అలాగే, ఈ లోపం గల ఓటర్లకు 15 అంశాలతో కూడిన ఒక కరపత్రాన్ని రూపొందించి అందచేస్తారు.

- మల్టిపుల్‌ డిసేబిలిటీ
ఒకటి కంటే ఎక్కువ వైకల్యలోపాలు గల వారిని పర్పుల్‌ రంగు కార్డు ద్వారా గుర్తిస్తారు. 

అంధుల కోసం ఓటరు కార్డు
మలక్‌పేటలోని బ్రెయిలీ ప్రెస్‌లో అంధుల కోసం దాదాపు 50 వేల ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించారు. ఇటువంటి గుర్తింపు కార్డుల ముద్రణ దేశ ఎన్నికల చరిత్రలోనే తొలి ప్రయత్నమని అంటున్నారు. ఇటీవల నగర పర్యటనకు వచ్చిన ఎన్నికల ప్రధాన అధికారి రావత్‌ వీటిని పరిశీలించారు. అలాగే, అంధులు ఆయా పార్టీల చిహ్నాలను గుర్తించేందుకు వీలుగా కూడా ప్రత్యేక బ్యాలెట్‌ను తయారు చేసే ప్రయత్నాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ బ్యాలెట్‌ ద్వారా అంధులు ఎవరికి ఓటు వేయాలో సులభంగా గుర్తించగలుగుతారని బ్రెయిలీ ప్రెస్‌ ఎడిటర్‌ జి.వెంకటేశ్వర రావు (అంధుడు) తెలిపారు. దాదాపు రూ.90 లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో నార్వే దేశం నుంచి బ్రెయిలీ ముద్రణ యంత్రాన్ని కొనుగోలు చేసి ముద్రణ పనులు మొదలు పెట్టినట్లు వివరించారు. ఈ మిషన్‌ ద్వారా ప్రతీ రోజూ 20 వేల కార్డులను ముద్రించవచ్చని ఆయన అంటున్నారు. 

ఓటెయ్యడమెంతో ‘సరళ’ం
దివ్యాంగులను ఓటింగ్‌ ప్రక్రియలో భాగస్వామ్యుల్ని చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు వనపర్తి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శ్వేతామహంతి చెప్పారు. ఈ జిల్లాలో దివ్యాంగుల కోసం ‘సరళ్‌’ పేరుతో ఆమె ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి దివ్యాంగుడు పోలింగ్‌ నాడు ఓటేసేలా చూడటం, ఓటింగ్‌లో వారినీ భాగస్వాముల్ని చేయాలనే లక్ష్యాలతో ‘సరళ్‌’కు శ్రీకారం చుట్టినట్టు ఆమె చెబుతున్నారు. జిల్లాలోని 14 మండలాల్లో సదరం క్యాంపు ద్వారా సర్టిఫికెట్లు పొందిన, పొందని దివ్యాంగులను కూడా గుర్తించి ఓటుహక్కు కల్పిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 4,709 మంది దివ్యాంగులను గుర్తించారు. పోలింగ్‌ స్టేషన్‌ వారీగా ఉన్న దివ్యాంగులను గుర్తించే పని కూడా పూర్తయిందని, ఇక వారి చేత ఓటెయ్యించడమే మిగిలిందని శ్వేతా హమంతి ‘సాక్షి’కి చెప్పారు. ‘‘దివ్యాంగులకు సహకరించేందుకు  వలంటీర్లను నియమిస్తాం. వికలాంగ సంఘాలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. 3,600 మంది దివ్యాంగులకు ఇంటి నుంచి వాహన సౌకర్యం కల్పించాలని నిర్ణయించా’మని చెప్పారు.
ఇన్‌పుట్స్‌: డి.వెంకటేశ్వర్‌రెడ్డి, సిలివేరు యాదగిరి, ఎన్‌.వెంకటేశ్వర్లు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top