నీళ్లకు 20, పాలకు 18 రూపాయలా!

Farmers feel Despondent - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘బాటిల్‌ మంచినీరు 20 రూపాయలు. లీటరు పాలు 17, 18 రూపాయలా! ఇదెక్కడి అన్యాయం. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో వ్యాపారులు హాయిగానే బతుకుతున్నారు. రైతులకే చావొచ్చింది’ అని లింబాదేవీ గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పశు శిబిరంలో కచ్రూసాహెబ్‌ రాథోడ్‌ అనే 62 ఏళ్ల రైతు వ్యాఖ్యానించారు. గత ఏడాది కాలంకాక వర్షాలు లేకపోవడంతో ఇతర రైతుల్లాగానే తాను పంట వేయలేక పోయానని, దీనికి మోదీ మాత్రం ఏం చేయగలరని అదే శిబిరంలో పశువులతోపాటు తలదాచుకుంటున్న హర్షుభాయ్‌ సనప్‌ అనే రైతు వ్యాఖ్యానించారు. రాథోడ్‌ మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పుడల్లా బీజేపీ కార్యకర్త  అయిన సనప్‌ అడ్డుపడుతున్నారు. 2012 నుంచి మూడేళ్లపాటు వర్షాలు లేకపోవడం వల్ల రైతులకు ఈ దుస్థితి దాపురించిందని సనప్‌ వాదించారు. పంటలు పండించినా మార్కెట్‌లో తమ పంటలకు మార్కెట్‌లో ఎవరు గిట్టుబాటు ధరలు ఇస్తారని ఆయన నిర్లిప్తత వ్యక్తం చేశారు. 

‘మార్కెట్‌ ధరల పరిస్థితిని పక్కన పెట్టండి, పంటలను మార్కెట్‌ను తరలించేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి?’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ యువ రైతు వ్యాఖ్యానించారు. లింబాదేవీ గ్రామం మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో ఉంది. రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు తాండవిస్తుండడంతో పశువుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో పశు శిబిరాలను నిర్వహిస్తోంది. శిబిరాల నిర్వహణ పట్ల కూడా రైతులు అసంతప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఎన్నికలను దష్టిలో పెట్టుకొని ఈ శిబిరాలను ఏర్పాటు చేశారని, అది కూడా మార్చి నెలలో ఏర్పాటు చేశారని, పశువుల గ్రాసం కూడా అంతంత మాత్రంగానే అందుతుందని పలువురు రైతులు విమర్శించారు. ఎన్నికల గురించి ప్రశ్నించగా మోదీ ప్రభుత్వం పట్ల కొందరు సంతప్తి వ్యక్తం చేయగా, ఎక్కువ మంది ఎవరొస్తే మాత్రం తమకు ఒరిగేదేముంటుందని నిర్లిప్తత వ్యక్తం చేశారు. మోదీ కారణంగా కనీసం రోడ్లు, వంతెనలు, మంచినీళ్లు వస్తున్నాయని చెప్పారు. 

బీడ్‌లో ఎవరు గెలుస్తారు ?
బీడ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ఈ నెల 18వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది. 2014, అక్టోబర్‌లో ఈ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రీతమ్‌ ముండే అఖండ మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ సీనియర్‌ నాయకుడు, ఆమె తండ్రి గోపీనాథ్‌ ముండే మరణంతో ఆ సీటుకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గం నుంచి 36 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నప్పటికీ వారిలో ప్రీతమ్‌ ముండేతోపాటు కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్న బజరంగ్‌ సోనవానేలే ప్రముఖులు. వీరిద్దరి మధ్యనే పోటీ ఉంటుంది. ప్రీతమ్‌ ముండే సమీప బంధువు, ఎన్సీపీ నాయకుడు ధనంజయ్‌ ముండేకు మద్దతు ఇస్తున్న కారణంగా పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. అయినప్పటికీ విజయావకాశాలు ప్రీతమ్‌ ముండేకే ఉన్నాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top