ఓటర్ల జాబితాలో మళ్లీ లోపాలు! 

Errors again in the voters list - Sakshi

25 వేల పేర్లు పునరావృతం

తుది జాబితా ప్రచురణకు సాంకేతిక సమస్యలు

సవరణలతో వారంలోగా అనుబంధ ఓటర్ల  జాబితా

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ వెల్లడి

పెరిగిన ఓటర్లు 11.81 లక్షలు

తొలగించిన ఓట్లు.. 5.87 లక్షలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఓటర్ల జాబితా రెండో సవరణలో తప్పులు దొర్లాయి. దాదాపు 25వేల మంది ఓటర్ల పేర్లు జాబితాలో పునరావృతమయ్యాయి. అయితే.. సాంకేతిక కారణాలతోనే తుది జాబితాలో తప్పులు చోటుచేసుకున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ శనివారం వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ఈఆర్వో నెట్‌ వెబ్‌సైట్‌లో ఈ జాబితాను ప్రచురించడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయన్నారు.  ‘వెబ్‌సైట్‌లో ఓటర్ల వివరాలను నమోదు చేసి ‘సబ్మిట్‌’బటన్‌ నొక్కినా.. ఆ కమాండ్‌ పూర్తి కాలేదు. దీంతో డీటీపీ ఆపరేటర్లు రెండు, మూడు సార్లు మళ్లీ సబ్మిట్‌ బటన్‌ను నొక్కారు. దీంతో ఓటర్ల పేర్లు జాబితాలో పునరావృతమయ్యాయి. దాదాపు 25 వేల మంది ఓటర్ల పేర్లు రిపీట్‌ అయినట్లు గమనించాం. ఈ విషయాన్ని సుమోటోగా పరిగణించి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో పునరావృతమైన పేర్లను తొలగించి వారం రోజుల్లో అనుబంధ ఓటర్ల జాబితాను మళ్లీ ప్రచురిస్తాం’అని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంయుక్త అధికారి ఆమ్రపాలితో కలసి ఆయన శనివారం రాత్రి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో తుది ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఉర్దూలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు, మరాఠీలో 3 నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను ప్రచురించాల్సి ఉందని, మరో నాలుగైదు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.  

కొత్త ఓటర్లు 11,81,827 
గత నెల 10న ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,61,36,776గా ఉండగా, తాజాగా ప్రకటించిన తుది జాబితాలో ఈ సంఖ్య 2,73,18,603కు పెరిగింది. రెండో సవరణ అనంతరం విడుదల చేసిన తుది జాబితాలో 1,37,87,920 మంది పురుషులు, 1,35,28,020 మంది మహిళలు, 2,663 మంది ఇతర ఓటర్లున్నారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 17,68,873 మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకోగా.. వివిధ కారణాలతో 5,87,046 మంది పేర్లను తొలగించారు. మార్పులు, చేర్పులు పూర్తయిన తర్వాత.. తుది జాబితాలో సరాసరిగా 11,81,827 మంది ఓటర్లు పెరిగారు. రాష్ట్రంలో వందేళ్లకు పైబడిన ఓటర్లు 2472 మంది ఉండటం గమనార్హం. 

నమోదులో మహిళలదే ఆధిక్యం! 
ఓటర్ల జాబితాలో మొత్తంగా పోల్చితే.. పురుషుల కన్నా మహిళల సంఖ్య తక్కువగా ఉన్నా, కొత్త ఓటర్లుగా నమోదు చేసుకున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారని రజత్‌కుమార్‌ పేర్కొన్నారు.  9,36,969 మంది మహిళలు, 8,31,472 మంది పురుషులు, 432 మంది ఇతరులు కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. అదే విధంగా 18–19 ఏళ్ల వయసున్న వారిలో 3,22,141 మంది యువకులు, 2,53,247 మంది యువతులు, 112 మంది ఇతరులున్నారు. తుది ఓటరు జాబితాలో 3,01,723 మంది మరణించిన, 1,93,586 మంది పునరావృతమైన 91,737 మంది చిరునామా మారిన ఓటర్ల పేర్లను తొలగించారు. దీంతో తొలగించిన ఓటర్ల సంఖ్య 5,87,046గా నమోదైంది. 

బెల్ట్‌షాపులపై కఠినంగా.. 
రాష్ట్ర వ్యాప్తంగా బెల్టుషాపులను మూసివేయాల్సిందేనని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖను ఆదేశించినట్లు రజత్‌కుమార్‌ తెలిపారు. మద్యం పంపిణీతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు జరిగే ప్రయత్నాలను అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ అధికారులను ఆదేశించామన్నారు. రాష్ట్రంలో ఇటీవల కొకైన్, గంజాయి సరఫరా ఎక్కువైందని.. వాటిపై ఉక్కుపాదం మోపాలని సూచించామన్నారు. అమల్లో ఉన్న పథకాలపై ఎన్నికల ప్రవర్త నియమావళి ప్రభావం ఉండదన్నారు. అయితే, సంక్షేమ పథకాలకు.. కొత్త లబ్ధిదారుల ఎంపిక జరపరాదని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు ఎన్నికల కోడ్‌ వర్తింపు అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని, అవసరమైతే ఈసీ వివరణ కూడా కోరతామన్నారు. కొండగట్టు బస్సు ప్రమాద మృతులు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపుకు అనుమతుల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరముందని.. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని రజత్‌ కుమార్‌ తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top