మళ్లీ బ్యాలెట్‌కు నో

ECI will never go back to era of ballot papers - Sakshi

ఈవీఎంలపై కావాలనే బురదచల్లుతున్నారు

కేంద్ర ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా

న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎం) విశ్వసనీయతపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) సునీల్‌ అరోరా స్పందించారు. ఈవీఎంలకు బదులుగా బ్యాలె ట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న కొన్ని రాజకీయ పక్షాల డిమాండ్‌కు తలొగ్గబోమని స్పష్టం చేశారు. మళ్లీ బ్యాలెట్‌ బాక్సులను వినియోగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈవీఎంలను కొందరు ఫుట్‌బాల్‌లా ఆడుకుంటున్నారనీ, వాటి పనితీరుపై ఉద్దేశపూర్వకంగానే బురద చల్లుతున్నారని మండిపడ్డారు.

బ్యాలెట్‌తో సిబ్బందికి నరకమే..
ఢిల్లీలో గురువారం జరిగిన ‘మేకింగ్‌ అవర్‌ ఎలక్షన్స్‌ ఇన్‌క్లూజివ్‌ అండ్‌ యాక్సెసబుల్‌’ అనే కార్యక్రమంలో అరోరా మాట్లాడుతూ.. ‘నేను ఒక విషయాన్ని స్పష్టం చేయదలచుకున్నాను. ఇప్పుడే కాదు.. భవిష్యత్‌లో కూడా మేం బ్యాలెట్‌ పేపర్ల విధానానికి మొగ్గుచూపబోం. మనుషుల సాయంతో బ్యాలెట్‌ బాక్సులను ఎత్తుకెళ్లడం, కౌంటింగ్‌లో తీవ్రమైన ఆలస్యం.. ఇదంతా పోలింగ్‌ సిబ్బందికి నరకంలా ఉంటుంది. రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి విమర్శలు, సలహాలు స్వీకరించేందుకు సిద్ధం గా ఉన్నాం. ఇదే సమయంలో బెదిరింపులు, ఒత్తిడి, విజ్ఞప్తులకు తలొగ్గి ఈవీఎంలను వదిలి బ్యాలెట్‌ విధానానికి మళ్లే ప్రసక్తే లేదు. మనం ఈవీఎంలను ఫుట్‌బాల్‌గా ఎందుకు మార్చేశాం? వాటిపై ఉద్దేశపూర్వకంగా బురదచల్లే కార్యక్రమం కొనసాగుతోంది’ అని తెలిపారు.

ఒకే ఫలితం రావాలి కదా..
ఈవీఎంల సమర్థతపై స్పందిస్తూ..‘2014 లోక్‌ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్నిరోజులకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, త్రిపుర, నాగాలాండ్, మిజోరంతో పాటు తాజాగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్తాన్‌.. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా ఎన్నికల ఫలితాలు నమోదయ్యాయి. నిజంగా ఈవీఎంలలో సమస్య ఉంటే ఇక్కడంతా ఒకేరకమైన ఫలితాలు రావాలి కదా.

ఈవీఎం, వీవీప్యాట్‌ యంత్రాలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఈసీఐఎల్‌), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌)లో రూపొందిస్తారు. వీటిని హ్యాక్‌ లేదా ట్యాంపరింగ్‌ చేయడం అసాధ్యం. ఇటీవల రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1.76 లక్షల పోలింగ్‌ కేంద్రాల్లో కేవలం ఆరంటే ఆరు చోట్ల మాత్రమే ఈవీఎంల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయంలో అలసత్వం చూపకుండా మేం వెంటనే స్పందించి పరిస్థితిని చక్కదిద్దాం’ అని అరోరా వెల్లడించారు. ఇక వీవీప్యాట్‌ యంత్రాలకు సంబంధించి చిన్నచిన్న ఘటనలు నమోదయ్యాయని అంగీకరించారు. వీవీప్యాట్‌ యంత్రాల వినియోగం విషయంలో ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నామనీ, ఈ తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు.

‘బ్యాలెట్‌’తోనే ఎన్నికలు జరపండి
త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతిలోనే నిర్వహించాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈవీఎంల సమర్థతపై తలెత్తిన వివాదంతో మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే నీలినీడలు కమ్ముకున్నాయని వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాల కోసం సాంకేతికను దుర్వినియోగం చేస్తున్నారనీ, ఇందులో తమకు ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. విద్యావంతులైన ప్రజలు ఈవీఎంలకు వ్యతిరేకంగా గొంతు విప్పాలన్నారు. హ్యాకర్‌ సయిద్‌ షుజా చేసిన ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్‌చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top