కరుణానిధి హెల్త్‌ బులిటెన్‌ విడుదల

DMK Chief Karunanidhi Condition Was Stable - Sakshi

సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యంపై వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక పల్స్‌ రేటులో మార్పులు రావటంతో ఆయన్ని కావేరి ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. వదంతులు నమ్మొద్దని, ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందంటూ తనయుడు స్టాలిన్‌ ప్రకటన చేసిన కొద్దిగంటలకే ఈ పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం. 

గత కొంతకాలంగా వయసురీత్యా సమస్యలతో కరుణానిధి(94) బాధపడుతున్నారు. గొంతులో అమర్చిన ట్రాకియాస్టమీ ట్యూబ్‌ మార్పిడి కారణంగా కరుణకు స్వల్పంగా జ్వరం, ఆపై ఇన్ఫెక్షన్‌ సోకింది. దీంతో గోపాలపురంలోని ఆయన ఇంటిలోనే శుక్రవారం వైద్యులు చికిత్స అందించారు. వార్త తెలియగానే పలువురు ప్రముఖులు కూడా ఆయన్ని పరామర్శించారు. పరిస్థితి మెరుగవుతున్న క్రమంలో ఒక్కసారిగా బీపీ పడిపోవటంతో పరిస్థితి విషమించింది. దీంతో అర్ధరాత్రి హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఐసీయూకి తరలించి వెంటిలేటర్ల సాయంతో ఆయనకు చికిత్స అందించారు. అయితే కాసేపటికే కరుణానిధి పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు డీఎంకే నేత డీ రాజా వెల్లడించారు. ఆపై వైద్యులు కూడా బులిటెన్‌ విడుదల చేశారు. 

ఇదిలా ఉంటే ‘కలైగ్నర్’ ఆరోగ్యంపై వదంతులు రావటంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు ఆస్పత్రి వద్దకు దూసుకొచ్చారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర కార్యకర్తలతో రోడ్డు నిండిపోవటంతో భారీ ఎత్తున్న పోలీసులు మోహరించారు. ప్రస్తుతం కావేరీ ఆస్పత్రి వద్దకు భారీ ఎత్తున్న కార్యకర్తలు, అభిమానులు చేరుకుంటున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top