టీఆర్‌ఎస్‌లో భగ్గుమంటున్న విభేదాలు 

Disputes In TRS Activists  - Sakshi

మణుగూరులో మొదలై గుండాలకు చేరిన అసమ్మతి

గుండాల మండల కార్యదర్శిపై అధ్యక్షుడి దాడి

ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారుతున్న పరిణామాలు

సాక్షి, కొత్తగూడెం :  సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో గ్రూపు రాజకీయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే పినపాక నియోజకవర్గంలో ఇవి మరింతగా ముదురుతున్నాయి. టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండడంతో ఇతర ప్రాంతాల మాదిరిగానే ఇక్కడా భారీ వలసలతో పార్టీ కిక్కిరిసిపోయింది. 2014లో ఈ నియోజకవర్గంలో నామమాత్రంగా ఉన్న పార్టీ బలం ప్రస్తుతం గణనీయంగా పెరిగింది.

పార్టీలోకి వలసల పరంపర ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వైఎస్సార్‌సీపీని వీడి టీఆర్‌ఎస్‌లోకి వచ్చాక చేరికలు ఇబ్బడిముబ్బడిగా జరగడంతో ప్రస్తుతం కిటకిటలాడిపోతోంది. ఈ క్రమంలో దాదాపు అన్ని పార్టీల గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో గ్రూపుల సంఖ్య కూడా అదేస్థాయిలో పెరుగుతూ వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీని మించి  టీఆర్‌ఎస్‌లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో సహ జంగానే గ్రూపుల లొల్లి నడుస్తోంది. ఎన్నికల ఏడాది కావడంతో ఈ గ్రూపు రాజకీయాలు మరింత క్రియాశీలకం అవుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ప్రస్తుత గ్రూపులు అసమ్మతి రాజకీయాలుగా రూపాంతరం చెందాయి. ఇవి చివరకు దాడులకు దారితీస్తున్నాయి. మణుగూరు మండలంలో ప్రారంభమైన అసమ్మతి గళాలు ఇతర మండలాలకూ విస్తరించాయి. అసమ్మతి ప్రభా వంతో గుండాల మండలంలో దాడి సైతం చోటుచేసుకుంది.  

పాయం అండతో పదవులు పొంది చివరకు అసమ్మతి రాగాలు.. 

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వైఎస్సార్‌సీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఇతర పార్టీలకు చెందిన అనేకమంది టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పాయం తన అనుచరులతో పాటు, వివిధ పార్టీల నుంచి వచ్చిన వారిలో పలువురికి పార్టీ, నామినేటెడ్‌ పదవులు అప్పగించారు.

అయితే వివిధ అభివృద్ధి పనుల కేటాయింపుల్లో మాత్రం ఎమ్మెల్యే పక్షపాతం చూపిస్తూ కొంతమందినే ప్రోత్సహిస్తున్నారంటూ కొందరు అసమ్మతి రాగం అందుకున్నారు. మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల జెడ్పీటీసీలు, ఇతర నాయకులు కొందరు మొదట మణుగూరులో అసమ్మతి శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. వీరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సంతకాలు సైతం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో మణుగూరుకు చెందిన కొందరు అసమ్మతివాదులు గత 26న గుండాలలో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ద్వారా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు సదరు అసమ్మతి నాయకులు చెప్పినట్లు సమాచారం. 

మండల కార్యదర్శిపై అధ్యక్షుడి దాడి..  

కాగా, టీఆర్‌ఎస్‌ గుండాల మండల కార్యదర్శి కదిర్‌ 27న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కొందరు పార్టీలో ఉంటూ చీలికకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీంతో 28న పార్టీ గుండాల మండలాధ్యక్షుడు భాస్కర్‌.. తనకు సమాచారం లేకుండా ప్రెస్‌మీట్‌ ఎలా పెట్టావంటూ కదిర్‌పై కర్రతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స అనంతరం కదిర్‌ భాస్కర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పరిస్థితి మరింత చేయిదాటిపోకుండా ఉండేందుకు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగాల్సి వచ్చింది.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top