స్థాయి మరిచిన అచ్చెన్నాయుడు

CPI Ramakrishna Demands Achennayudu Resign To His Post - Sakshi

 ఆర్టీసీ ఎన్నికల్లో ప్రచారం చేశారు

ఎన్‌ఎంయూ ఓటమికి నైతిక బాధ్యత వహించాలి

మంత్రి పదవికి రాజీనామా చేయాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌  

అల్లిపురం (విశాఖ): ఆర్టీసీ ఎన్నికల్లో నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఇక్కడి సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఒక యూనియన్‌ నాయకుడిగా ప్రచారం చేశారని, మంత్రి ప్రచారం చేసినా ఎన్‌ఎంయూ ఓడిపోయినందున నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. లేకుంటే ముఖ్యమంత్రే ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. విశాఖ నగరం చుట్టుపక్కల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని, ప్రభుత్వం వాటిని కాపాడి ప్రజా అవసరాలకు వినియోగించాలని సీపీఐతో పాటు ప్రతిపక్ష పార్టీలు అనేక పోరాటాలు నిర్వహించడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసిందన్నారు. సిట్‌  నివేదిక అందజేసి మూడు నెలలు కావస్తున్నా దర్యాప్తు వివరాలు బయటపెట్టలేదని, అందుకు కారణం అధికార పార్టీ మంత్రులు, శాసనసభ్యులకు సంబంధాలు ఉండడమేనని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదకను బయటపెట్టాలని, కబ్జాదారులు ఎంతటి వారైనా వారిపై పీడీ యాక్ట్‌ పెట్టి నగర బహిష్కరణ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. వారికి సహకరించిన రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సీపీఐ పరిశీలనలో వెల్లడైన కబ్జాదారుల వివరాలను ఆయన వెల్లడించారు.

కొమ్మాది సర్వే నంబరు 28/8లో 10.18 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాతంత్ర సమరయోధుడు దాకవరపు రాములు పేరిట ఉంది. ఆ భూమి కె.శ్రీనివాసరెడ్డి ఆక్రమణలో ఉంది.
సర్వేనంబర్‌ 161/1లో 10 ఎకరాలు ప్రభుత్వ భూమి బుద్ద మహాలక్ష్మీ, వై.పార్వతిల అధీనంలో ఉంది.
7 పార్టులో 10 ఎకరాలు ప్రభుత్వ భూమి మాజీ సైనికుడు కె.రామారావు పేరిట ఉంది.
సర్వే నంబరు 154/35లో  5 ఎకరాల భూమిని మంత్రి గంటా శ్రీనివాసరావు శాడో ఎమ్మెల్యే పరుచూరి భాస్కరరావు ఆక్రమించారు.
సర్వే నంబరు 7లో 50 ఎకరాల ప్రభుత్వ భూమి మైటాస్‌ సంస్థ ఆధీనంలో ఉంది.
పీఎంపాలెం పరిధిలో సర్వే నంబరు 20/4లో 2.82 ఎకరాల ప్రభుత్వ భూమి తిరుమల రాణి పేరిట ఆక్రమణలో ఉంది.
గాజువాక సర్వేనంబరు 87లో వెయ్యి గజాల ప్రభుత్వ భూమి మాజీ శాసనసభ్యులు పల్లా సింహాచలం కుటుంబీకులు స్వాధీనంలో ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top