ఎలా గెలుస్తారో చూస్తాం...

Contract Employees JAC Indefinite strike - Sakshi

బాబు సర్కారుకు కాంట్రాక్టు ఉద్యోగుల హెచ్చరిక

హామీలిచ్చి విస్మరించిన ఘనత చంద్రబాబుదే!   

విజయనగరం మున్సిపాలిటీ: సమస్యలు పరిష్కారమిస్తామని, రెగ్యులరైజ్‌ చేస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని హమీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 20 నుంచి కాంట్రాక్టు విద్యుత్‌ ఉద్యోగుల నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు ఏపీ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ పి.మధుబాబు, ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశీ స్పష్టం చేశారు. ఇదే తరహాలో వ్యవహరిస్తే రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఎలా గెలుస్తుందో చూస్తామని హెచ్చరించారు.  స్థానిక వీటీ అగ్రహారం సబ్‌స్టేషన్‌ వద్ద జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు విద్యుత్‌ ఉద్యోగుల బహిరంగ సభ నిర్వహించారు. జిల్లా జేఏసీ నాయకులు బి.గోవిందరావు, సంతోష్‌కుమార్, ఎం.వెంకటఅప్పారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతకు ముందు  వేదికపై ఉన్న అతిథులంతా చేయి చేయి కలిపి సమరశంఖం పూరించారు.

రాష్ట్రంలో 35 వేల మంది ఉద్యోగులు కాంట్రాక్టు ప్రాతిపదికన విద్యుత్‌ శాఖలో విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు తన మేనిఫేస్టోలో కాంట్రాక్టు  ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని హమీ ఇచ్చారన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు అవుతున్న తమ గురించి పట్టించుకోకపోవటం దారుణమన్నారు. మరో వైపు పదే పదే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులను కలిసి తమ సమస్యలపై విన్నవించినా పట్టించుకున్న వారు లేకపోయారన్నారు. చివరికి గత నెల 25 వరకు కలెక్టరేట్‌ ఎదుట రిలే దీక్షలు చేపట్టగా... సమ్మెను వాయిదా వేయాలని... ఈనెల 4లోగా సమస్యలు పరిష్కరిస్తామని హమీ ఇవ్వగా.. ఎటువంటి స్పందన లేదన్నారు. 15 నుంచి 20 సంవత్సరాలుగా విద్యుత్‌ శాఖలో ప్రాణాలకు తెగించి వెట్టి చాకిరి చేస్తున్న తమకు పీసు రేటు పెట్టి బానిసలుగా చూస్తున్నారన్నారు.

సుప్రీంకోర్టు  చెప్పిన కనీస వేతనాలు అమలు చేయలేదన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మించి మా కుటుంబాలకు చెందిన ఓట్లు వేయించుకున్న చంద్రబాబు నేడు ప్రభుత్వం వైఖరి చూస్తుంటే వ్యతిరేక ఓటు తప్పనిసరిగా మారిందన్నారు. తక్షణమే పీసు రేటును రద్దు చేయాలని, కాంట్రాక్టు్ట ఉద్యోగులందరిని రెగ్యులరైజ్‌  చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఈ నెల 20 నుంచి  మరోమారు చేపట్టనున్న నిరసన కార్యక్రమాల్లో కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభలో కాంట్రాక్టు ఉద్యోగులకు మద్దతుగా వైఎస్సార్‌ విద్యుత్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు  బికెవి.ప్రసాద్, యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.అప్పలసూరి, సీపీఐ జిల్లా కార్యదర్శి వి.కృష్ణంరాజు తదితరులు మద్దతుగా మాట్లాడారు.  కాంట్రాక్ట్‌ ఉద్యోగుల న్యాయ పోరాటానికి మద్దతు ఇస్తామని, ప్రభుత్వం మెడలు వంచి హక్కులు సాధించేంత వరకు వెన్నంటే ఉంటామంటూ సంఘీభావం తెలిపారు.  అధిక సంఖ్యలో కాంట్రాక్టు విద్యుత్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top