‘మహాత్ముని ఆత్మ క్షోభించేది’

Congress uses Gandhi birth anniversary to stage show of strength - Sakshi

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా

న్యూఢిల్లీ: మహాత్ముని 150వ జయంతి సందర్భంగా గాంధీకి నివాళులర్పించిన కాంగ్రెస్‌ పార్టీ అధికార బీజేపీపై విమర్శల వర్షం కురిపించింది. అబద్ధపు రాజకీయాలతో పబ్బం గడుపుకునేవారు మహాత్ముని సిద్ధాంతాలు, ఆదర్శాలు, నిస్వార్థ సేవలను అర్థం చేసుకోలేరని బీజేపీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. బుధవారం రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధి వద్ద కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మహాత్మునికి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. భారత్‌లో గత కొన్నేళ్లుగా నెలకొన్న పరిస్థితులను చూసి ఉంటే మహాత్ముని ఆత్మ క్షోభించేదని వ్యాఖ్యానించారు.

‘అసత్య రాజకీయాలు చేసే వారు గాంధీ చూపిన సత్య మార్గాన్ని ఎలా అర్థం చేసుకోగలుగుతారు? అధికారంతో ఏమైనా చేయవచ్చని భావించేవారు గాంధీ అహింస మార్గాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? తమను తాము గొప్ప వ్యక్తులుగా (సుప్రీమ్‌) భావించుకునేవారు దేశం కోసం గాంధీ చేసిన నిస్వార్థ సేవలను ఎలా అర్థం చేసుకోగలరు?’అని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లూ గాంధీ, భారత్‌ అనేవి పర్యాయ పదాలుగా ఉన్నాయని.. కానీ కొందరు ఇప్పుడు దానిని ఆరెస్సెస్, ఇండియాగా మార్చాలని చూస్తున్నారని సోనియా ఆరోపించారు. గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసువద్ద కార్యకర్తలు నిర్వహించిన మార్చ్‌కు రాహుల్‌ గాంధీ నేతృత్వం వహించారు. మహాత్ముని 150వ జయంతి సందర్భంగా వారంపాటు దేశమంతా ‘పాదయాత్రలు’నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top