వారి దాడులు కాగితాలపైనే

Congress surgical strikes only on paper - Sakshi

సర్జికల్‌ దాడులపై కాంగ్రెస్‌ అబద్ధాలు మాత్రమే చెబుతుంది

రాజస్తాన్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ధ్వజం

జైపూర్‌/సికార్‌/హిందౌన్‌ సిటీ: కాంగ్రెస్‌ హయాంలో సర్జికల్‌ దాడులు కేవలం కాగితాలపైనే జరిగాయని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనూ భద్రతా బలగాలు జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖను దాటి వెళ్లి దాడులు జరిపాయన్న ఆ పార్టీ నేతల ప్రకటనలపై ఆయన పై వ్యాఖ్యలు చేశారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేశామంటూ కాంగ్రెస్‌ అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. శుక్రవారం ప్రధాని రాజస్తాన్‌లోని జైపూర్, సికార్, హిందౌన్‌లలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

‘మా ప్రభుత్వం సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసినట్లు ప్రకటించగానే కాంగ్రెస్‌ ఖండించింది. ఆ తర్వాత వ్యతిరేకించింది. ఇప్పుడు నేను కూడా అంటోంది (మీ టూ)’ అని తెలిపారు. ‘యూపీఏ జమానాలో మూడుసార్లు సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిపినట్లు ఆ పార్టీ నేత(రాహుల్‌) ప్రకటించారు. ఇప్పుడేమో మరొక నేత దానిని ఆరుసార్లకు పెంచారు. ఈ ఎన్నికలు పూర్తయ్యేలోగా ఈ సంఖ్య 600కు చేరుకుంటుంది. కాగితాలపైనే చేసిన ఈ దాడులతో ఫలితమేంటి? కాంగ్రెస్‌ అబద్ధాలు మాత్రమే చెబుతుంది’ అని అన్నారు.

మై ఆప్కా ‘అభినందన్‌’ కర్తా హూ
మీ అందరికీ శుభాకాంక్షలు (మై ఆప్కా ‘అభినందన్‌’ కర్తా హూ) అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ.. ‘ఇలా అని నేను అనగానే కాంగ్రెస్‌ వాళ్లు...ఐఏఎఫ్‌ పైలెట్‌ అభినందన్‌ పేరును ప్రస్తావించి ప్రధాని మోదీ నిబంధనావళిని అతిక్రమించారంటూ ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఫిర్యాదు చేస్తారు. ఆపై వాళ్ల నేత సుప్రీంకోర్టుకు వెళతారు. దీంతో కోర్టు ఒక వారంలోగా ఈ విషయాన్ని పరిష్కరించండంటూ ఈసీని కోరుతుంది. మోదీ నిబంధనలను ఉల్లంఘించలేదని, ప్రజలకు అభివాదం  చేశారని ఈసీ స్పష్టం చేస్తుంది.

వెంటనే కాంగ్రెస్‌  మీడియాను పిలిచి నన్ను విమర్శిస్తుంది’ అని వ్యంగ్యంగా అన్నారు.  ‘అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించినందుకు సంతోషపడాల్సింది పోయి.. ఎన్నికల సమయంలో ఇలా జరిగినందుకు కాంగ్రెస్‌ విచారంతో ఉంది. ఐరాస అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడాన్నీ ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. అలా ప్రకటించడానికి ముందుగా మేడమ్‌(సోనియా గాంధీ), నామ్‌దార్‌(రాహుల్‌)లను ఐరాస సంప్రదించాలని కాంగ్రెస్‌ అనుకుంటోందా’ అని ప్రధాని ప్రశ్నించారు.

125 రోజుల్లో దేశమంతా..
న్యూఢిల్లీ: డిసెంబర్‌ 25 నుంచి మే 1 మధ్య 125 రోజుల్లో మోదీ దేశం మొత్తాన్నీ చుట్టేశారు. ఆయన వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, ఎన్నికల ప్రచారం కోసం మోదీ ఈ 125 రోజుల్లో 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పర్యటించారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, జామ్‌నగర్‌ నుంచి సిల్చార్‌ వరకు దేశం నలుదిక్కులా పర్యటిస్తూ శాస్త్రవేత్తలు, రైతులు తదితరులతో మాట్లాడారని వెబ్‌సైట్‌ పేర్కొంది. ప్రజలకు హామీలు ఇవ్వడమే కాకుండా వాటిని సత్వరమే నెరవేర్చేందుకు కృషి చేశారంది. ప్రధానమంత్రి రైతు గౌరవనిధి తదితర పథకాలను ఉదాహరణలుగా చూపింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top