ఖరారైన కాంగ్రెస్‌ జాబితా

Congress Party Ready To Announce Assembly Candidates List - Sakshi

119 స్థానాలకు ఒక్కో నియోజకవర్గం నుంచి ఒకరి పేరు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముందస్తు ఎన్నికలకోసం కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా ఖరారైంది. 119 నియోజకవర్గాలకు ఒక్కో అభ్యర్థిని ఎంపికచేసి పంపించాలన్న అధిష్టానం ఆదేశాలతో.. సోమవారం టీపీసీసీ సీనియర్‌ నేతలతో కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ సుదీర్ఘంగా భేటీ అయింది. మధ్యాహ్నం ఒంటిగంటనుంచి సాయంత్రం 6 గంటల వరకు గోల్కొండ రిసార్టులో స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్త చరణ్‌దాస్‌ నేతృత్వంలో.. సభ్యులు షర్మిష్ట ముఖర్జీ, జ్యోతిమణి సెన్నామలై, తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ చైర్మన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క, సీనియర్‌ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, రేవంత్‌రెడ్డిలు సమావేశమయ్యారు.

ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాస్‌ కృష్ణన్‌ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీలో మొత్తం 119 స్థానాల్లో 4–5 చోట్ల (హైదరాబాద్‌ పాతబస్తీ) మినహా ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో అభ్యర్థి పేరును ఖరారు చేశారు. అనంతరం ఈ జాబితాను ఏఐసీసీకి పంపించారు. మొత్తం స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడం కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత వ్యవహారమని.. కూటమితో సీట్లపై తుదినిర్ణయం కుదిరిన తర్వాత వారికి కేటాయించే స్థానాలపై ఆ సమయంలో తుదినిర్ణయం తీసుకుంటారని గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి. 

గ్రీన్‌ సిగ్నల్‌ రావడమే తరువాయి.. 
సోమవారం నాటి భేటీతో కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికలో కీలక అడుగు పడింది. ఈ జాబితాలో దాదాపుగా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి. అధిష్టానం ఈ జాబితాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన మరుక్షణం నుంచి ప్రచారం రంగంలోకి దూకినట్లేనని కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏఐసీసీకి జాబితా పంపిన నేపథ్యంలో పార్టీ బీసీ నేతలైన వీహెచ్, మధుయాష్కీ, పొన్నాల తదితరుల.. సోమవారం రాత్రి గోల్కొండ హోటల్‌లో భేటీ ఈయ్యారు. బీసీలకు కేటాయించిన 32 స్థానాల్లో అభ్యర్థులపై చర్చించారు.

ఏయే స్థానాల్లో ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి.. అభ్యర్థుల బలాబలాలపై కసరత్తు చేశారు. ఎన్నికల నగారా మోగినప్పటినుంచి.. ఉత్తమ్, పొన్నం, రేవంత్, కోమటిరెడ్డి బ్రదర్స్, జానా, మధుయాష్కీ వంటి నేతలే టీఆర్‌ఎస్‌ సవాళ్లకు ప్రతిసవాళ్లు విసురుతున్నారు. ఇపుడు స్క్రీనింగ్‌ కమిటీ పంపిన జాబితాకు అధిష్టానం ఆమోదముద్ర పడగానే.. అసలు సిసలు రాజకీయ వేడి రాజుకుంటుందనే ధీమా కాంగ్రెస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top