హస్తంలో.. నూతనోత్సాహం | Congress Party New Josh In combined karimnagar and adilabad | Sakshi
Sakshi News home page

హస్తంలో.. నూతనోత్సాహం

Mar 11 2018 10:25 AM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Party New Josh In combined karimnagar and adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మూడున్నరేళ్ల తరువాత కాంగ్రెస్‌ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నప్పటికీ... స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్‌ ముఖ్య నేతల్లో భవిష్యత్తుపై ఆత్మవిశ్వాసం పెరిగింది. టీఆర్‌ఎస్‌లోని కొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల పట్ల ఆయా నియోజకవర్గాల్లో పెరిగిన వ్యతిరేకత తమకు లాభిస్తుందన్న అంచనాతో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో మెజారిటీ వర్గంగా ఉన్న ఆదివాసీలకు, లంబాడాలకు మధ్య ఇటీవల చోటు చేసుకున్న విభేదాలు, ఆదివాసీల ఆందోళ నలు కూడా కాంగ్రెస్‌కు కలిసి వస్తాయని భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల కాలంలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీలో హుషారు పెరిగింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు దక్కించుకునే ప్రయత్నాలు పెరిగాయి. బహు నాయకత్వం ఉన్న నియోజకవర్గాల్లో అప్పుడే టిక్కెట్ల కోసం కొందరు నాయకులు రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులతో పైరవీలు జరుపుతున్నారు.

కలిసి రానున్న ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత
ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ చేతిలోనే ఉన్నాయి. ఈ పదింట ఆరు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉన్నట్లు కాంగ్రెస్‌ పార్టీ అంచనా వేస్తోంది. ఇందులో ఓ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న సీటుతో పాటు మూడు ఎస్టీ నియోజకవర్గాలు, తూర్పు ప్రాంతంలోని మరో రెండు స్థానాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉందని కాంగ్రెస్‌ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. గతంలో ముఖ్యమంత్రి రెండు విడతలుగా జరిపిన సర్వేల్లో కూడా వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉన్నట్లు తేల్చడం కాంగ్రెస్‌ నాయకుల్లో సమరోత్సాహానికి కారణమవుతోంది. వీటితో పాటు ఆదివాసీలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నట్లు ఇంటలిజెన్స్‌ రిపోర్టులు కూడా స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఆశావహులు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిర్మల్‌లో డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ బస్సు యాత్ర విజయవంతమైంది. దీంతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని ఢీకొట్టేందుకు మహేశ్వర్‌రెడ్డి ఉర్రూతలూగుతున్నారు. అసెంబ్లీ సమావేశాల తరువాత మిగతా నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్‌ నేతల పర్యటన జరిపేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

ఇక్కడ వీరే కాంగ్రెస్‌ హీరోలు
నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతన్నారు. ఆయనకు ఇక్కడ ఎలాంటి అడ్డంకులు లేవు. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ టిక్కెట్టు ఆశించేవారు కూడా లేరు. ఆసిఫాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆదివాసీ ఉద్యమంతో మరోసారి వెలుగులోకి వచ్చారు. ఆదివాసీ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేయడంలో బోథ్‌ మాజీ ఎమ్మెల్యే సోయం బాబూరావుతో పాటు ఆత్రం సక్కు పాత్ర కూడా మరువలేనిది. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు గత మూడేళ్లుగా తనదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి కాంగ్రెస్‌ టిక్కెట్టు ఆశిస్తున్నా, ప్రేంసాగర్‌రావే ప్రత్యామ్నాయం అనే రీతిలో నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నారు. అరవింద్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళతారనే ప్రచారం నేపథ్యంలో ప్రేంసాగర్‌రావుకు కాంగ్రెస్‌లో ఎదురులేని పరిస్థితి. చెన్నూరులో మాజీ మంత్రి బోడ జనార్ధన్‌ పరిస్థితి కూడా అదే. టీడీపీ నుంచి వలస వచ్చిన ఆయనే ఇక్కడ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కయ్యారు. సిర్పూరులో రావి శ్రీనివాస్‌ టీడీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన నాయకుడే. ఆయన కూడా ఇప్పుడు సిర్పూరు సీటు నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక్కడ కూడా ప్రత్యామ్నాయ నాయకుడు లేని పరిస్థితి.

ఆదిలాబాద్‌ జిల్లాలో పోటీ అధికం..
ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్‌ నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ టిక్కెట్టు కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి శ్రీరాంచంద్రారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి గండ్రత్‌ సుజాత, ఆదిలాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి భార్గవ్‌ దేశ్‌పాండేలు టికెట్‌లు ఆశిస్తున్నారు. సామాజిక కుల పరంగా ఈ నియోజకవర్గంలో మున్నూరు కాపు ఓట్లు కీలకంగా ఉండగా, టీఆర్‌ఎస్‌ నుంచి జోగు రామన్న పోటీలో ఉంటే అదే సామాజిక వర్గానికి చెందిన గండ్రత్‌ సుజాత తనకే టికెట్‌ వస్తుందని భావిస్తున్నారు. మాజీ మంత్రి శ్రీరాంచంద్రారెడ్డి టికెట్‌పై ఆశలు పెట్టుకొని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఆయన వయసే అడ్డంకిగా మారింది. యువ నాయకుడైన భార్గవ్‌ దేశ్‌పాండే గత ఎన్నికల్లో ఆదిలాబాద్‌ నుంచి పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. మరోసారి టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. బోథ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి అనిల్‌ జాదవ్‌ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. గతేడాది వరకు బోథ్‌ నియోజకవర్గంలో ఆయన పరిస్థితికి డోకా లేకున్న ఇటీవల కాలంలో ఆదివాసీ ఉద్యమంతో జోరు పెంచిన మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో పోటీ ఏర్పడింది. అధిష్టానం ఆశీస్సులతోనే సోయం కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఖానాపూర్‌ నియోజకవర్గం నుంచి భరత్‌ చౌహాన్, హరినాయక్‌లు టికెట్‌ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి హరినాయక్‌ పోటీ చేసినప్పటికి ఓటమి చెందాడు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలో దిగెందుకు ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌చార్జి ఆజ్మీరా హరినాయక్, ఎస్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి భరత్‌ చౌహన్‌లు తమ ప్రయత్నాలు మమ్మురం చేశారు. అయితే రాథోడ్‌ రమేశ్‌ టీఆర్‌ఎస్‌లో చేరక ముందు కేసీఆర్‌ సేవాదళ్‌ అధ్యక్షురాలుగా చారులత ప్రజల ముందుకు వచ్చి టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ అశించారు. అయితే ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో చారులత కూడా కాంగ్రెస్‌ టిక్కెట్‌ అశిస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ నుంచి టిక్కెట్‌ను ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ అధికారిగా కొనసాగుతున్న రాంకిషన్‌ నాయక్‌ ప్రయత్నాలు చేస్తున్నారు.

బెల్లంపల్లిలో ఆశావహులు ముగ్గురు
కాంగ్రెస్‌ నుంచి ఇద్దరి ముగ్గురు పేర్లు వినపడుతున్నాయి. బెల్లంపల్లి కాంగ్రెస్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి చిలుముల శంకర్, మున్సిపల్‌ కౌన్సెలర్‌ రొడ్డ శారద, మహిళ కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్‌.దుర్గాభవానీ టిక్కెట్‌ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. భవిష్యత్తులో సీపీఐతో కాంగ్రెస్‌ పొత్తు ఉంటే ఈసారి కూడా బెల్లంపల్లి స్థానాన్ని వదిలేసే అవకాశాలు లేకపోలేదు.

ముథోల్‌లో మూడు ముక్కలాట
మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతున్నారు. టికెట్టు విషయంలో ఈయన సోదరుడు బోస్లే మోహన్‌రావుపటేల్‌ ఈసారి పోటీచేస్తారని అంతా అనుకుంటున్నారు. టికెట్టు ఇద్దరిలో ఎవరికి వస్తుందో తెలియడంలేదు. ఆయనకు వరుసకు సోదరుడైన పవార్‌ రామారావుపటేల్‌ సైతం కాంగ్రెస్‌పార్టీలో చురుకైన పాత్రపోషిస్తున్నారు. అనసూయపవార్‌ ట్రస్ట్‌పేరిట సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. భైంసాలో రాధమ్మ భోజనాలయంలో రూ.10కే భోజనం, ఉచిత ప్యూరిఫైడ్‌ వాటర్‌ అందిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీలో కిసాన్‌ సందేశ్‌యాత్రను కూడా ప్రారంభిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావుపటేల్, అనసూయపవార్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పవార్‌ రామారావుపటేల్‌లు పోటాపోటీగా కాంగ్రెస్‌ అధిష్టానంలో నాయకులను కలుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement