కాంగ్రెస్‌ సభ్యుల సస్పెన్షన్‌

Congress MLAs Suspended At Telangana Legislative Assembly - Sakshi

సీఎం ప్రసంగానికి అడ్డుతగలడం వల్లే...

సభ నుంచి ఒకరోజు సస్పెండ్‌ చేస్తూ అసెంబ్లీ తీర్మానం

రాజగోపాల్‌రెడ్డి తీరుపై కేసీఆర్‌ ఆగ్రహం

తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. ఆమోదించిన సభ

మిగతా సభ్యులపై తన విచక్షణాధికారం కింద స్పీకర్‌ సస్పెన్షన్‌ వేటు  

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభలో సీఎం ప్రసంగానికి అడ్డు తగిలినందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై శనివారం సస్పెన్షన్‌ వేటు పడింది. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా కాంగ్రెస్‌ ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆయన ప్రసంగాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్‌కి చెందిన పీఏసీఎస్‌ చైర్మన్‌ను టీఆర్‌ఎస్‌ నేతలు కిడ్నాప్‌ చేశారం టూ ఆరోపించారు. దీంతో రాజగోపాల్‌రెడ్డితోపాటు మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, పోడెం వీరయ్య, సీతక్కను ఒక రోజు సస్పెండ్‌ చేయాలంటూ సభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఆ వెంటనే వారు సస్పెండ్‌ అయినట్లు స్పీకర్‌ ప్రకటించారు.

అంతకుముందు నల్లగొండ జిల్లాకు చెందిన పీఏసీఎస్‌ చైర్మన్‌ కె. శ్రీనివాసరెడ్డి మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌గా నామినేషన్‌ వేయడానికి ప్రయత్నించినప్పుడు టీఆర్‌ఎస్‌ నాయకులు కిడ్నాప్‌ చేశారంటూ మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన విఫలయత్నం చేశారు. తనకు మైక్‌ ఇవ్వాలని స్పీకర్‌ను కోరగా తోసిపుచ్చారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానం ఇవ్వాలని సీఎంని కోరారు.

ముఖ్యమంత్రి లేచి మాట్లాడుతుండగా రాజగోపాల్‌రెడ్డి నల్లగొండ జిల్లా పీఏసీఎస్‌ చైర్మన్‌ వ్యవహారంపై గట్టిగా అరుస్తూ చెప్పే ప్రయత్నం చేశారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా రాజగోపాల్‌రెడ్డికి తోడుగా లేచి నిలబడ్డారు. అత్యవసర అంశాన్ని ప్రస్తావించేందుకు ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని పదేపదే కోరారు. సీఎం ప్రసంగంపై వివరణలకు సమయం ఇస్తామని స్పీకర్‌ చెప్పినా కాంగ్రెస్‌ సభ్యులు పట్టువీడలేదు. ఈ సమయంలో కోమటిరెడ్డి బిగ్గరగా అరుస్తూ ఏదో చెప్పబోతుంటే సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభా నిబంధనలు తెలియవా..?: సీఎం
‘అటు నలుగురే. ఇటు ఎంతమంది ఉన్నారో చూడండి. మీకంటే రెట్టింపు అరవగలం. సభా సంప్రదాయానికి కట్టుబడి ఉన్నాం. ప్రజాతీర్పును గౌరవించరు. వెళ్లాలంటే వెళ్లిపోండి. ఈ రాద్ధాంతం ఎందుకు? సభలో సభా నాయకుడు ప్రసంగిస్తున్నారనే సంస్కారం కూడా మీకు లేదు. సీఎం ప్రసంగం వినే ఓపిక కూడా మీకు లేదు.’’అని కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. సభలో సీఎం మాట్లాడేందుకు లేచినప్పుడు అడ్డుకోరాదనే సభా నిబంధనలు కూడా తెలియదా? లేక తెలిసే అడ్డుకోవాలని అనుకుంటున్నారా? ఇదేం పద్ధతి?   సస్పెండ్‌ చేయాలంటూ సీఎం అనడంతో శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి లేచి సస్పెన్షన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top