టికెట్‌ ఇచ్చేందుకు రూ. 3 కోట్లు అడిగారు

Congress Leader Kyama Mallesh Sensational Comments On Bhakta Charan Das - Sakshi

భక్త చరణ్‌దాస్‌పై రంగారెడ్డి డీసీసీ చీఫ్‌ మల్లేశ్‌ సంచలన ఆరోపణ

అందుకు సంబంధించిన ఆడియో టేపులు విడుదల

బీసీ నేతలతో కలసి మీడియా సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్త చరణ్‌దాస్‌పై రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఇబ్రహీంపట్నం టికెట్‌ కోసం భక్త చరణ్‌దాస్‌ కుమారుడు సాగర్‌ తన కుమారుడు అంజన్‌ కుమార్‌ను రూ. 3 కోట్లు డిమాండ్‌ చేశారని ఆరోపిం చారు. దీనికి సంబంధించిన ఆడియో టేపులను ఆయన గురువారం హైదరాబాద్‌లో మీడియా సాక్షి గా విడుదల చేశారు. ‘ఈ నెల 2న భక్త చరణ్‌దాస్‌ దగ్గరకు నా కుమారుడిని ఇబ్రహీంపట్నం టికెట్‌ కోసం పంపించా. ఇబ్రహీంపట్నం టికెట్‌ కావాలంటే రూ. 3 కోట్లు ఇవ్వాలని భక్తచరణ్‌ దాస్‌ కుమారుడు సాగర్‌ డిమాండ్‌ చేశారు.

ఈ ఆడియోను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, జానారెడ్డి, భట్టి విక్రమార్కలకు వినిపించా. వారంతా దీనిపై మేము మాట్లాడతాం, అప్పటివరకు బయట చెప్పకు అన్నారు. అంతేతప్ప ఎలాంటి చర్య లు తీసుకోలేదు. కాంగ్రెస్‌లో చాలా మంది బ్రోకర్లు, లోఫర్లు చేరారు. డబ్బులు తీసుకొని నాలాంటి నిజ మైన నాయకులకు అన్యాయం చేస్తున్నారు. రాహుల్‌ దూతలంతా దొంగల్లా, ఉత్తమ్, జానాలకు తొత్తుల్లా మారారు. ఈ విషయాలు రాహుల్‌ దృష్టికి పోకుండా జాగ్రత్త పడుతున్నారు.

బ్రోకర్లంతా కుమ్మక్కై అన్నదమ్ములు, భార్యాభర్తలు, తండ్రీకొడుకులకు టికెట్లు ఇప్పించుకుంటున్నారు’ అని మల్లేశ్‌ ఆరోపించారు. భక్త చరణ్‌దాస్‌ వంటి వారివల్ల కాంగ్రెస్‌ భ్రష్టుపడుతోందని, ఇలాంటి బ్రోకర్ల వ్యవహారం రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లేందుకే మీడియా ముందు ఆడియో టేపులు విడుదల చేస్తున్నానని చెప్పారు. తన వ్యాఖ్య లను సుమోటోగా తీసుకొని ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.

టికెట్లు ఆశించి భంగపడ్డ బీసీ నేతలంతా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, మేడ్చల్‌ నుంచి టికెట్‌ ఆశించిన జంగయ్య యాదవ్, యాదవ సంఘం నేతలు మల్లేశ్‌ యాదవ్, బాబూరాం యాదవ్‌లతో కలసి మల్లేశ్‌ మీడియాతో మాట్లాడారు.

మా తడాఖా చూపిస్తాం: భిక్షపతి యాదవ్‌
కాంగ్రెస్‌ పార్టీలో 40 ఏళ్లుగా పనిచేస్తూ వార్డు సభ్యుడి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగానని, అయినా తనకు టికెట్‌ నిరాకరించడం కేవలం కొందరి కుట్ర లో భాగమేనని భిక్షపతియాదవ్‌ మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఇటీవల రాహుల్‌ నిర్వహించిన సభను విజయవంతం చేసినందుకు రాహుల్‌ ప్రశంసించార ని, అలాంటి తనకే టికెట్‌ ఇవ్వకుండా ఉత్తమ్‌ అన్యాయం చేశారన్నారు. బీసీ వర్గాలకు సంబంధించిన నియోజకవర్గాలకు కూటమి పేరు చెప్పి మోసం చేశారన్నారు. ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని, ఈ నెల 17న నామినేషన్‌ వేస్తానన్నారు. యాదవుల తడాఖా ఏమిటో చూపిస్తామన్నారు.

కాంగ్రెస్‌ భరతం పడతాం:జంగయ్య యాదవ్‌
గత ఎన్నికల్లో మేడ్చల్‌ నియోజకవర్గంలో తనకన్నా తక్కువ ఓట్లు వచ్చిన కె.లక్ష్మారెడ్డికి టికెట్‌ ఎందుకిచ్చారో చెప్పాలని జంగయ్య యాదవ్‌ ప్రశ్నించారు. ఆయన టీఆర్‌ఎస్‌తోనూ టచ్‌లో ఉన్నారని, అలాంటి నేతకు టికెట్‌ ఎలా ఇచ్చారన్నారు. పార్టీని ముంచే నేతలు కావాలా లేక గెలిచే నేతలు కావాలా? అని అడిగారు. యాదవులను కాంగ్రెస్‌ మోసం చేసిందని, రాష్ట్రమంతా తిరిగి కాంగ్రెస్‌ భరతం పడతామన్నారు.

కూటమి మోసం చేసింది: చెరుకు సుధాకర్‌
మహాకూటమిలోని పార్టీలన్నీ బీసీలను దారుణంగా మోసం చేశాయని ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ ఆరోపించారు. టికెట్ల విషయంలో బీసీలకు సుముచిత స్థానం కల్పించలేదన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తే ప్రజలే ఆయా పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారన్నారు.

 

ఉత్తమ్, జానాల పీకలు ప్రజలే కోస్తారు...
కాంగ్రెస్‌ పార్టీలో 35 ఏళ్లుగా ఉండి డబ్బు, ఆరోగ్యం పోగొట్టుకున్నానని, పార్టీ కోసం ఉన్నదంతా ఖర్చు చేశానని క్యామ మల్లేశ్‌ పేర్కొన్నారు. తనకు టికెట్‌ ఇస్తానని చెప్పి ఉత్తమ్, జానారెడ్డిలు నమ్మించి గొంతు కోశారని, వారి గొంతును ఎన్నికల్లో ప్రజలే కోస్తారంటూ శాపనార్థాలు పెట్టారు. రాష్ట్రంలో దొంగల ముఠా తయారైందని, డబ్బున్న వారినే పిలిపించి మాట్లాడుతున్నారని మల్లేశ్‌ ఆరోపించారు.

ఖైరతాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ నుంచి రూ. 10 కోట్లు తీసుకొని బలహీనుడు, స్థానికేతరుడు అయిన దాసోజు శ్రవణ్‌కు టికెట్‌ ఇచ్చారని ఆరోపించారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు భార్యలు, కొడుకులకు టికెట్లు పంచుకుంటున్నారని ఉత్తమ్, జానాలపై ధ్వజమెత్తారు. వారిద్దరికీ రోజులు దగ్గర పడ్డాయని, ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌ కార్యకర్తలు, తన అనుచరులతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని మల్లేశ్‌ తెలిపారు. ఈ నెల 17న బీసీ సంఘాలు తలపెట్టిన బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top