మూకుమ్మడిగా నిరాహార దీక్షలు!

Congress Hunger strike - Sakshi

ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ అంశంపై కాంగ్రెస్‌ యోచన

మాక్‌ అసెంబ్లీ.. జిల్లా కేంద్రాల్లో సభలు కూడా..

అన్యాయంగా అసెంబ్లీ నుంచి గెంటేశారంటూ ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహం

హైదరాబాద్‌ కేంద్రంగా నిరసనలు.. బస్సు యాత్రలో సభలు

ఈ అంశంపై నేడో, రేపో రాష్ట్రపతిని కలసి ఫిర్యాదు చేసే అవకాశం  

సాక్షి, హైదరాబాద్‌ :  అసెంబ్లీలో 12 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయడాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. ఇప్పటికే ప్రత్యక్ష ఆందోళనలకు దిగిన టీపీసీసీ నేతలు.. అధికార పార్టీ తీరును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

ఇద్దరు సభ్యులను బహిష్కరించిన విషయంపై న్యాయ పోరాటం చేయడం, జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని చర్చనీయాంశం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలోని ప్రజానీకం దృష్టిని ఆకర్షించేలా కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. ఏఐసీసీ ప్లీనరీ నుంచి రాగానే దీనిపై కార్యాచరణ ఖరారు చేయనున్నట్లు సమాచారం.

మూకుమ్మడిగా నిరాహార దీక్షలు
ప్రజాసమస్యలపై అసెంబ్లీ వేదికగా చర్చకు అవకాశమివ్వకుండా తమను బయటికి పంపారన్న ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. ఈ అంశాన్ని వదిలిపెట్టకూడదని నిర్ణయించింది. దేశంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 12 మంది ఎమ్మెల్యేలను సమావేశాలు పూర్తయ్యేంతవరకు సస్పెండ్‌ చేయడం, రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక ఓటేయాల్సిన ఇద్దరు సభ్యులను బహిష్కరించడం ప్రజాస్వామ్య విరుద్ధమనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తోంది.

అయితే హైదరాబాద్‌ కేంద్రంగా పోరాటాలు చేయాలా, క్షేత్రస్థాయికి వెళ్లాలా అన్న దానిపై టీపీసీసీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఉద్యమం చేయడం ద్వారా నేరుగా ప్రజల్లోకి వెళుతోందని.. 48 గంటల నిరాహార దీక్ష కూడా తమ వాదనను హైలైట్‌ చేసేందుకు ఉపయోగపడిందని కొందరు నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలంతా కలసి మూకుమ్మడి నిరాహార దీక్షలకు దిగాలని యోచిస్తున్నారు. గాంధీభవన్‌ వేదికగా 12 మంది నిరాహార దీక్ష చేపట్టి.. పార్టీ కేడర్‌ను ఉద్యమానికి సమాయత్తం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు.

ఇప్పటికే పోరుబాట
ఈనెల 12న అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా జరిగిన ఆందోళనపై అధికార పక్షం దూకుడుగా వ్యవహరించింది. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలందరినీ బడ్జెట్‌ సమావేశాల వరకు సస్పెండ్‌ చేయడంతో పాటు ఇద్దరి సభ్యత్వాలను రద్దు చేసింది. దీంతో కంగుతిన్న కాంగ్రెస్‌ పార్టీ వెంటనే పోరుబాట పట్టింది. బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు 48 గంటలు నిరాహార దీక్ష చేశారు.

తర్వాత మూకుమ్మడి రాజీనామాల దిశగా సీఎల్పీ యోచన చేసినా.. ఏకాభిప్రాయం రాకపోవడంతో విరమించుకుంది. అయితే ప్రభుత్వ తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టునూ ఆశ్రయించింది. పార్టీ ఎన్నికల కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలోని పార్టీ బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి నేరుగా ఫిర్యాదు చేసింది. అటు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో ఉన్న టీపీసీసీ నేతలు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. నేడో, రేపో కొందరు ఏఐసీసీ పెద్దలతో కలసి టీపీసీసీ నాయకత్వం రాష్ట్రపతిని కలిసే అవకాశముంది.  

రెండు మూడు రోజుల్లో కార్యాచరణ
ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సభలు పెట్టాలన్న దిశగా టీపీసీసీ నేతలు చర్చించారు. అయితే ఎలాగూ బస్సుయాత్రలో భాగంగా జిల్లాలకు వెళతాం కాబట్టి.. అప్పుడే సభలు పెట్టాలని కొందరు నేతలు పేర్కొన్నారు. వీలైతే బస్సుయాత్రను వెంటనే ప్రారంభించాలని, మంచి ఊపు మీదున్న బస్సుయాత్రలోనే ప్రభుత్వ చర్యను ఎండగట్టాలని ప్రతిపాదించారు.

కానీ షెడ్యూల్‌ ప్రకారమే బస్సుయాత్ర జరపాలని, ఆలోగా హైదరాబాద్‌ కేంద్రంగా ఉద్యమాలు చేయాలని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు. ఇక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే.. సస్పెండైన ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కలసి మాక్‌ అసెంబ్లీ నిర్వహించడం ద్వారా మీడియా దృష్టికి ఆకర్షించాలని దాదాపుగా నిర్ణయించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనలపై మరోసారి క్షుణ్నంగా చర్చిస్తామని, సోమ, మంగళవారాల్లో భవిష్యత్‌ కార్యాచరణను ఖరారు చేస్తామని టీపీసీసీ ముఖ్య నాయకుడొకరు వెల్లడించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top