ప్రజాస్వామ్య సంస్థలను అవమానించింది

Congress humiliated all democratic institutions - Sakshi

కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ 

రఫేల్‌పై తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు

కాంగ్రెస్‌ పార్టీ డీఎన్‌ఏ 1975 నుంచి మారలేదు

చెన్నై: భారత ప్రజాస్వామ్య మనుగడకు కీలకమైన ఆర్మీ, కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) వంటి ప్రతిష్టాత్మక సంస్థలను కాంగ్రెస్‌ పార్టీ అవమానించిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. రఫేల్‌ ఫైటర్‌ జెట్ల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చినప్పటికీ ఆ పార్టీ నేతలు తనపై తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో ఎన్నికల ముందు అనుమానాలు రేకెత్తించేందుకు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై కాంగ్రెస్‌ నేతలు రాద్ధాంతం చేస్తారనీ, తీరా ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే సంతోషంగా స్వీకరిస్తారని ఎద్దేవా చేశారు. తమిళనాడు, పుదుచ్చేరిలోని బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన మోదీ.. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కాగ్, ఆర్మీలను అవమానించారు..
భారత ఆర్మీ చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్స్, యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న బొగ్గు కుంభకోణాలను ప్రస్తావిస్తూ.. ‘కాంగ్రెస్‌ నేతలకు ఎన్నికల సంఘం(ఈసీ), ఈవీఎంలతోనే సమస్య అని మీరు అనుకుంటూ ఉంటే ఒక్కక్షణం ఆగండి. వాళ్లు ఆర్మీ, కాగ్‌ సహా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకంగా ఉన్న ప్రతీ సంస్థను అవమానించారు. రఫేల్‌ ఫైటర్‌ జెట్ల కేసులో సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పును ఇవ్వకపోవడంతో దాన్ని వ్యతిరేకిస్తున్నారు.

తమ బెదిరింపులకు లొంగకుండా నిజాయితీగా వ్యవహరించినందుకు గతంలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినే(జస్టిస్‌ దీపక్‌ మిశ్రా) అభిశంసన ద్వారా తొలగించేందుకు యత్నించారు’ అని తెలిపారు. కాంగ్రెస్‌ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రజల్లోకి వాస్తవాలను తీసుకెళ్లాలనీ, కాంగ్రెస్‌ నైజాన్ని బయటపెట్టాలని ఓ బీజేపీ కార్యకర్త అడిగిన ప్రశ్నకు మోదీ సమాధానం ఇచ్చారు. ఈవీఎంల విషయంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాల వ్యవహారశైలి.. పిల్లాడు పరీక్షల్లో ఫెయిల్‌ అయితే ఆ త ప్పంతా అతను చదువుకున్న స్కూలు, పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు, పరీక్షల నిర్వాహకుడిదే అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ను భారత్‌ క్షమించదు..
భారత ప్రజాస్వామ్యం ఉనికికి గతంలోనూ ఓసారి(1975 ఎమర్జెన్సీ పాలన) ప్రమాదం ఎదురైనప్పటికీ, ప్రజలు దాన్ని కాపాడుకున్నారని ప్రధాని మోదీ అన్నారు.  ‘బీజేపీ కార్యకర్తలు ప్రజల్లో మమేకమై కాంగ్రెస్‌ పార్టీ డీఎన్‌ఏ అప్పటికీ, ఇప్పటికీ మారలేదని వివరించాలి. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు తిరగబడటంతో ఆ పార్టీ నేతలు ఇప్పుడు మరింత జిత్తులమారిగా తయారయ్యారు. కానీ ప్రజాస్వా్యమ్యంతో ఆటలాడితే భారత్‌ ఈసారి కాంగ్రెస్‌ను క్షమించదు’ అని అన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top