కాంగ్రెస్‌కు నయా జోష్‌

Congress Appointed DCC Presidents In Telangana - Sakshi

31 జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకం

నలుగురు పాత వారు మినహా మిగిలిన చోట్ల కొత్త వారే..

12 బీసీ, 10 మంది రెడ్డి సామాజిక వర్గాల నేతలకు చాన్స్‌

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలకూ పగ్గాలు

మొత్తంగా ముగ్గురు మహిళలకు అవకాశం

ఖమ్మం సిటీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కూడా...

పెండింగ్‌లోనే ములుగు, నారాయణపేట  

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత డీలా పడిన రాష్ట్ర కాంగ్రెస్‌లో జోష్‌ నింపేందుకు పార్టీ అధిష్టానం అన్ని జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించింది. పార్టీలో ‘కొత్త రక్తాన్ని’ ఎక్కించడంతోపాటు సామాజిక సమ తౌల్యత పాటిస్తూ 31 డీసీసీలకు అధ్యక్షులను నియమించింది. ఇందులో ప్రస్తుతం డీసీసీ అధ్య క్షులుగా ఉన్న వారిలో నలుగురికే అవకాశం ఇవ్వగా మిగిలిన అన్ని జిల్లాల్లో కొత్త వారినే నియమించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ గురువారం ఢిల్లీలో ప్రకటన విడుదల చేశారు. సామాజిక వర్గాలవారీగా పరిశీలిస్తే 12 జిల్లాలకు బీసీ సామాజిక వర్గాలకు చెందిన నేతలను, మరో 10 జిల్లాలకు రెడ్డి సామాజికవర్గ నేతలకు అవకాశ మిచ్చారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారికి రెండు జిల్లాల చొప్పున అధ్యక్ష పదవులు కేటాయించారు. బ్రాహ్మణ, వెలమ, కమ్మ సామాజిక వర్గాలకు చెందిన ఐదుగురు నేతలను కూడా డీసీసీ అధ్యక్షులుగా నియమించారు. మొత్తం మీద 3 జిల్లాలకు మహిళలను డీసీసీ అధ్యక్షులుగా ప్రకటించగా, అందులో ఇద్దరు ఎమ్మెల్యేల భార్యలు, ఒక మాజీ ఎమ్మెల్సీ సతీమణి ఉన్నారు. ఎమ్మెల్యేలుగా ప్రస్తుతం ఎన్నికయిన సీనియర్లు, యువ శాసనసభ్యులకు, మాజీ ఎమ్మెల్సీలకు, మాజీ డీసీసీ అధ్యక్షులకు కూడా అవకాశమమిచ్చారు.

హైదరాబాద్‌ సిటీకి అంజన్‌ కొనసాగింపు...
కాంగ్రెస్‌ పార్టీ హైదరాబాద్‌ నగర అధ్యక్షుడిగా అంజన్‌కుమార్‌ యాదవ్‌ను కొనసాగించిన అధిష్టానం ఖమ్మం సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మైనారిటీ నేత జావేద్‌ను నియమించింది. ఖమ్మం రూరల్‌ జిల్లాకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ దుర్గాప్రసాద్, నాగెండ్ల దీపక్‌చౌదరిలను అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమిం చారు. ఇటీవలే ప్రకటించిన ములుగు, నారాయణ పేట జిల్లాలకు మాత్రం అధ్యక్షులను నియమించ లేదు. మహిళా నేతలు గండ్ర జ్యోతి (జయశంకర్‌ భూపాలపల్లి), కొక్కిరాల సురేఖ (మంచిర్యాల), నిర్మలాగౌడ్‌ (సంగారెడ్డి)లకు డీసీసీ అధ్యక్షులుగా అవకాశమిచ్చారు. ఇక ఎమ్మెల్యేలుగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు (భద్రాద్రి కొత్తగూడెం), పైలట్‌ రోహిత్‌రెడ్డి (వికారాబాద్‌)లను కూడా డీసీసీ అధ్యక్షులుగా నియమించారు. రంగారెడ్డి జిల్లాకు సబితా ఇంద్రారెడ్డి ప్రతిపాదించిన నర్సింహారెడ్డిని అధ్యక్షుడిగా ప్రకటించి వికారాబాద్‌కు చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి సన్నిహితుడు రోహిత్‌రెడ్డికి అవకాశమిచ్చారు. నల్లగొండ జిల్లాకు అనూహ్యంగా లంబాడా సామాజిక వర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ కె. శంకర్‌ నాయక్‌ను నియమించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన టి.నర్సారెడ్డిని సిద్దిపేట జిల్లాకు అధ్యక్షుడిగా నియమించడం గమనార్హం.

కొత్త డీసీసీలు వీరే...
భార్గవ్‌ దేశ్‌పాండే–ఆదిలాబాద్‌
కొక్కిరాల సురేఖ–మంచిర్యాల
రామారావు పటేల్‌ పవార్‌–నిర్మల్‌
ఆత్రం సక్కు–కొమరమ్‌ భీమ్‌ ఆసిఫాబాద్‌
కె. మృత్యుంజయం–కరీంనగర్‌
ఎ. లక్ష్మణ్‌కుమార్‌–జగిత్యాల
ఈర్ల కొమురయ్య–పెద్దపల్లి
ఎన్‌. సత్యనారాయణ గౌడ్‌–రాజన్న సిరిసిల్ల
ఎం. మోహన్‌రెడ్డి–నిజామాబాద్‌
కైలాష్‌ శ్రీనివాస్‌రావు–కామారెడ్డి
నాయిని రాజేందర్‌రెడ్డి–వరంగల్‌ అర్బన్‌ అండ్‌ రూరల్‌
గండ్ర జ్యోతి–జయశంకర్‌ భూపాలపల్లి
జంగా రాఘవరెడ్డి–జనగామ
నిర్మలా గౌడ్‌–సంగారెడ్డి
తిరుపతిరెడ్డి–మెదక్‌
టి.నర్సారెడ్డి–సిద్దిపేట
పి.రోహిత్‌రెడ్డి–వికారాబాద్‌
కూన శ్రీశైలం గౌడ్‌–మేడ్చల్‌ మల్కాజిగిరి
చల్లా నరసింహారెడ్డి–రంగారెడ్డి
ఒబేదుల్లా కొత్వాల్‌–మహబూబ్‌నగర్‌
శంకర్‌ ప్రసాద్‌–వనపర్తి
పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి–జోగులాంబ గద్వాల
డాక్టర్‌ సి.హెచ్‌.వంశీకృష్ణ–నాగర్‌ కర్నూలు
సి.హెచ్‌.వెంకన్న యాదవ్‌–సూర్యాపేట
బి.భిక్షమయ్య గౌడ్‌–యాదాద్రి భువనగిరి
జె.భరత్‌ చంద్రా రెడ్డి–మహబూబాబాద్‌
కె.శంకర్‌ నాయక్‌–నల్లగొండ
వనమా వెంకటేశ్వరరావు–భద్రాద్రి కొత్తగూడెం
పువ్వాడ దుర్గాప్రసాద్‌–ఖమ్మం

సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షులు వీరే...
గ్రేటర్‌ హైదరాబాద్‌–ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌
వరంగల్‌ సిటీ–కేదారి శ్రీనివాసరావు (కట్ల)
నిజామాబాద్‌ సిటీ–కేశ వేణు
ఖమ్మం సిటీ–జావీద్‌
వీరితోపాటు ఖమ్మం సిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎన్‌. దీపక్‌ చౌదరిని నియమించారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top