చంద్రబాబు మంచి మిత్రుడు: కేసీఆర్‌

CM KCR comments after Meeting With DMK Leaders - Sakshi

మార్పుకోసం ప్రజలు కోరుకుంటున్నారు

ఎవరినైనా కలిసేందుకు సిద్ధం

డీఎంకే నేతలతో భేటీ అనంతరం తెలంగాణ సీఎం

సాక్షి, చెన్నై: దేశవ్యాప్తంగా రాజకీయాల్లో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటులో భాగంగా సీఎం కేసీఆర్‌ ఆదివారమిక్కడ డీఎంకే అధినేత కరుణానిధి, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌తో సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ ప్రాథమిక స్థాయిలోనే చర్చలు జరిగాయని తెలిపారు. ఈ చర్చలు ఆరంభం కాదు.. ముగింపూ కాదని, చర్చలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. ఒక అభిప్రాయానికి రావడానికి రెండు, మూడు నెలలు పడుతుందన్నారు.

భారతదేశం సెక్యులర్‌ దేశంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. వైద్యం, విద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల రంగాలను రాష్ట్రాలకు కేటాయించాలని కేంద్రానికి సూచించారు. దేశ పరిరక్షణ, రక్షణ వ్యవస్థపై కేంద్రం దృష్టి సారించాలని అన్నారు. 2004లో మొదటిసారిగా కరుణానిధిని కలిశానని, 2004లో యూపీఏ ప్రభుత్వంలో డీఎంకే, టీఆర్‌ఎస్‌ కలిసి పనిచేశాయని కేసీఆర్‌ గుర్తుచేశారు. మే 10 నుంచి రైతుబంధు పథకాన్ని తెలంగాణలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టాలిన్‌ ఆహ్వానించామన్నారు. తమ స్నేహం చాలాకాలం కొనసాగుతుందని తెలిపారు.

ఫెడరల్‌ ఫ్రంట్‌పై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదని వెల్లడించారు. థర్డ్‌ ఫ్రంట్‌ అనేది లేనేలేదని, భవిష్యత్తులోనూ చర్చలు కొనసాగుతాయని, ప్రస్తుతం అందరి అభిప్రాయాలను తెలుసుకునే పనిలో ఉన్నామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు, నేను మంచి స్నేహితులమని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాజకీయ కూటమి నిర్మాణంలో భాగంగా ఎవరినైనా కలిసేందుకు వెనుకాడనని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top