
విజయవాడ: చేనేత రంగానికి ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నెరవేర్చలేదని వైఎస్సార్ సీపీ చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ధర్మవరం పర్యటనతో టీడీపీ ప్రభుత్వంలో కలవరం మొదలైందని అన్నారు. చేనేతలకు వైఎస్ జగన్ చేసిన ప్రకటన ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు. లక్షలాది మంది చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రణాళికను జగన్ ప్రకటించారని ప్రశంసించారు. చేనేతలంతా వైఎస్సార్ సీపీ వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు.
తాము అధికారంలోకి రాగానే చేనేతలకు రూ.2 వేలు సిల్క్ రాయితీ ఇస్తామని మంగళవారం ధర్మవరంలో వైఎస్ జగన్ ప్రకటించారు. నేతన్నల రుణాలు మాఫీ చేస్తామని, రూ.లక్ష వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని హామీయిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని పేదలకు 45 ఏళ్లకే పింఛన్ ఇస్తామని.. పింఛన్ సొమ్మును రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచుతామని భరోసాయిచ్చారు.