
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి చిదంబరం ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకే కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. మోదీ తలపెట్టిన మెగా ర్యాలీ కోసమే షేడ్యూల్డ్ ప్రకటించకుండా ఆలస్యం చేశారని ఆరోపించారు. అయితే అక్టోబర్ 12 న హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలను నవంబర్ 9న నిర్వహించనున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. కానీ గుజరాత్ విషయంలో ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో చిదంబరం ట్విట్టర్ వేదికగా ఎలక్షన్ కమిషన్‌ను నిలదీశారు. ఈసీ మాత్రం గుజరాత్ ఎన్నికలను డిసెంబర్ 18న నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీ ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌ను ఆలస్యంగా ప్రకటించాలని ఈసీపై ఒత్తిడి తెస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇక మోదీ చేపట్టిన ర్యాలీలో తప్పుడు వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెట్టారని విమర్శించింది. హిమాచల్ ప్రదేశ్‌తో పాటు గుజరాత్‌లో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇక ఈ ఆరోపణలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తిప్పికొట్టారు. కాంగ్రెస్ ఇంకా 2014 ఎన్నికల నాటి పరిస్థితే ఉందనే భ్రమలో ఉన్నట్లుందని ఆయన ఎద్దేవా చేశారు.