ఓబుళాపురం కేసులో వైఎస్‌ జగన్‌ను ఇరికించమన్నారు

Chennamsetti Shashi Kumar sensational comments on chandrababu naidu - Sakshi

సీబీఐ విచారణలో ఆయన పేరు చెప్పాలని చంద్రబాబు ఒత్తిడి 

అలా చేయనందుకు పార్టీ పెద్దలు కక్ష పెంచుకున్నారు

అప్పటి కేసులో సాక్షి, టీడీపీ నేత సంచలన ఆరోపణ

ఆదివారం టీడీపీ వీడి బీజేపీలో చేరిన సి.శశికుమార్‌ 

సాక్షి, అమరావతి: ఓబుళాపురం మైనింగ్‌ కేసులో జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా ఇరికించేలా సీఐబీ అధికారుల వద్ద ఆయన పేరు చెప్పాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆ కేసులో సాక్షి, టీడీపీ రాష్ట్ర నాయకులు చెన్నంశెట్టి శశికుమార్‌ ఆదివారం సంచలన ఆరోపణ చేశారు. కేసు విచారణలో ఆయన పేరు చెప్పలేదని అప్పటి నుంచి తనపై పార్టీ పెద్దలు కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్టు వినలేదనే ఐదేళ్ల కాలంలో తనకు ఒక్కసారి కూడా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదన్నారు. ఆదివారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరిన సందర్భంగా శశికుమార్‌ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

టీడీపీలో 30 ఏళ్ల పాటు పార్టీకి విధేయుడిగా పనిచేస్తే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని తూర్పారబట్టారు. తన అన్న సి.రామచంద్రయ్యను కాదని టీడీపీలో కొనసాగినా గుర్తించలేదన్నారు. పార్టీ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తే తనను కనీసం గుర్తించలేదన్నారు. అందుకే తాను బీజేపీలో చేరాల్సి వచ్చిందని వివరించారు. ఇప్పటికైనా చంద్రబాబు తీరు మార్చుకోక పోతే ఏపీలో టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఇప్పటికే చాలా మంది పార్టీని వీడే యోచనలో ఉన్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పెద్దలు కేవలం వారి సామాజిక వర్గానికి పదవులు కట్టబెడుతూ, రాజకీయాల్లో కనీస అవగాహన లేని లోకేష్‌కు మంత్రి పదవి ఇచ్చి పార్టీలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పనిచేసిన కార్యకర్తలను, నేతలను విస్మరించారని దుయ్యబట్టారు.

    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top