రేవంత్‌రెడ్డి పార్టీ పదవులకు కోత!

Chandrababu Naidu cuts powers of Revanth Reddy

వెనక్కి తగ్గిన రేవంత్‌ రెడ్డి

తెలంగాణ టీడీఎల్పీ సమావేశం రద్దు

రేవంత్‌ను ఎమ్మెల్యేగానే చూడమన్న చంద్రబాబు

సాక్షి, హైదరాబాద్‌: టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి పార్టీ పదవులకు కోత పడింది. రేవంత్‌రెడ్డిని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, టీడీఎల్పీ నేతగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ తెలిపారు. లండన్‌ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ అంశంపై తనతో ఫోన్‌లో మాట్లాడారని ఆయన వెల్లడించారు.  రేవంత్‌కు పదవులు ఏవీ ఉండవని, ఆయనను కేవలం ఎమ్మెల్యేగానే చూడాలని చంద్రబాబు సూచించినట్లు ఎల్‌.రమణ తెలిపారు. దీంతో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, టీడీఎల్పీ నేతగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని రేవంత్‌కు తాము సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.

అలాగే రేవంత్‌రెడ్డిని అధికారికంగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రకటించలేదని, ఏ నిర్ణయాన్ని అయినా పార్టీ అధ్యక్షుడు తననే తీసుకోమన్నారని ఎల్‌.రమణ పేర్కొన్నారు. ఇక, కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న రేవంత్‌రెడ్డి రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, టీడీఎల్పీ నేతగా కొనసాగితే పార్టీకి నష్టం జరుగుతుందని వివరించినట్లు నిన్న రమణ ఒక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.  మరోవైపు అసెంబ్లీ సమావేశాలపై చర్చించేందుకు ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌ గోల్కొండ హోటల్‌లో టీడీపీ, బీజేపీ నేతల సమావేశం కానున్నారు.

తెలంగాణ టీడీఎల్పీ సమావేశం రద్దు
టీడీఎల్పీ నేతను నేనే. సమావేశం నిర్వహించే హక్కు నాకే ఉంది. ఎల్పీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి రమణ ఎవరు? అంటూ వ్యాఖ్యలు చేసిన రేవంత్‌ రెడ్డి అనూహ్యంగా వెనక్కి తగ్గారు. తెలంగాణ టీడీఎల్పీ సమావేశాన్ని ఆయన రద్దు చేసుకున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top