అంతా ఆర్భాటం

Chandrababu Naidu Aadharana Scheme Open In YSR Kadapa - Sakshi

ఆదరణ–2 పేరుతో మరో ప్రచారానికి శ్రీకారం

ఇప్పటివరకు జిల్లాలకు లేని కేటాయింపులు

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుకు తెరవని వెబ్‌సైట్‌

సాక్షి, కడప : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఏది చేసినా అంతకంతా ప్రచారం లేనిదే ముందుకెళ్లరని అందరికీ తెలుసు. చేసేది  కొంత.. చెప్పుకునేది కొండంత కావడాన్ని విశ్లేషకులు తప్పుబడుతున్నారు. అణగారిన వర్గాలుగా గుర్తింపు ఉన్న బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి ప్రభుత్వం ఆదరణ–2 పేరుతో చేస్తున్న ఆర్భాటం చూస్తే చంద్రబాబు ప్రచార ఆర్భాటం ఏమిటో ఇట్టే తెలిసిపోతోంది. విజయవాడలో సీఎం చంద్రబాబు లాంఛనంగా ఒకసారి ప్రారంభిస్తే.. తర్వాత అన్ని జిల్లాల్లోనూ వరుసగా ప్రారంభోత్సవాల పేరుతో ఎగ్జిబిషన్లు పెట్టి భారీగా ఖర్చు చేస్తూ వస్తున్నారు. మండలాల నుంచి 139  బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారిని తీసుకొచ్చి పరికరాలను చూపించే ఎగ్జిబిషన్‌ కార్యక్రమానికి తెర లేపారు. అయితే ఆదరణ–2 కింద బీసీ వర్గాలను ఆదుకునేందుకు ప్రత్యేక పథకం ద్వారా 2.55 లక్షల మందికి రూ. 750 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పుకుంటున్నా వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే 2.55 లక్షల మందికి ప్రభుత్వ లెక్కల ప్రకారం కేవలం రూ. 330.40 కోట్లు మాత్రమే సరిపోతోంది. మిగిలిన రూ. 400 కోట్లకు పైబడిన సొమ్మంతా ప్రచారానికే వినియోగిస్తున్నారని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి.

ఎన్నికల ముందు హడావుడి
రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్‌ నాలుగేళ్లు అయిపోయిన తర్వాత చివరి అంకంలో ఎన్నికలకు ముందు తాపత్రయపడుతోంది. ఎలాగోలా బీసీ ఓట్లను కొల్లగొట్టాలన్న లక్ష్యంతో ఆదరణ–2 పేరుతో ఇప్పుడు శ్రీకారం చుట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు  1999 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 1996లో ఒకసారి ఈ పథకం ప్రవేశపెట్టి ఎన్నికల వరకు ప్రచారం చేసుకుని తర్వాత ఎత్తేశారు. అనంతరం 2003లోనూ ఇలాగే జరిగింది. అప్పట్లో బీసీలు బాబు మాటలను పెద్దగా పట్టించుకోకపోవడంతో 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. మళ్లీ ప్రస్తుతం చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చినా ఇప్పటివరకు పట్టించుకోకుండా ఇప్పుడు బీసీలకు సంబంధించి ఆదరణ పథకం–2 పేరుతో అధునాతన పరికరాలు అందిస్తామని ఎగ్జిబిషన్‌ పెడుతున్నారు.

ఇప్పటివరకు అతీగతీ లేదు
మార్చి 15న చంద్రబాబు ఆదరణ–2 పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తే ఇప్పటివరకు అసలు అతీగతీ లేదు. పైగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఆదరణ–2 ఎగ్జిబిషన్ల పేరుతో ప్రచార పర్వానికి తెర లేపారు. ఇంతవరకు కనీసం మండలాల వారీగా జిల్లాలకు సంబంధించి కేటాయింపులు లేవు. ఏ జిల్లాకు కూడా నిధుల మంజూరులో స్పష్టత లేదు. లబిధదారులు దరఖాస్తు చేసుకోవడానికి వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాలేదు.  కానీ జిల్లాల్లో జరిగే సదస్సులకు మండలాల నుంచి బీసీ వర్గాలను తీసుకొచ్చేందుకు ప్రత్యేక వాహనాలు, ప్రచార హోర్డింగ్‌లతో çహోరెత్తిస్తూ నిధుల వరద పారిస్తున్నారు.

బీసీ జనాభా 2.55 కోట్లయితే..2.55 లక్షల మందికే లబ్ధి
 రాష్ట్రంలో బీసీల జనాభా దాదాపు 2.55 కోట్లకు పైగా ఉంటే ఆదరణ పథకం కింద కేవలం 2.55 లక్షల మందికి మాత్రమే అవకాశం కల్పించేలా పథకం రూపొందించారు. అధునాతన పరికరాల పేరుతో ఒక్కొక్క వ్యక్తికి కేటగిరి–1 కింద రూ. 10 వేలు (రూ. 7 వేలు సబ్సిడీ+రూ. 1000 లబ్ధిదారుని వాటా+రుణం కింద రూ. 2000) కలుపుకుని అందిస్తారు. ఉదాహరణకు నాయీ బ్రాహ్మణులు బార్బర్‌ షాపులో ఉండే వీల్‌ చైర్‌ విలువే దాదాపు రూ. 14 వేలు ఉంది. అయితే రూ. 10 వేలు ఎంతమాత్రం సరిపోదని పలువురు పెదవి విరుస్తున్నారు. కేటగిరి–2 కింద  రూ. 20 వేలు, కేటగిరి–3 కింద రూ. 30 వేలు కేటాయిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో కేటగిరి–1 కింద లక్షా 5 వేల మందికి మనిషికి రూ. 10 వేలు చొప్పున.. కేటగిరి–2 కింద 83 వేల మందికి సంబంధించి ఒక్కొక్కరికి రూ. 20 వేలు చొప్పున.. కేటగిరి–3 కింద 67 వేల మందికి సంబంధించి ఒక్కొక్కరికి రూ. 30 వేలు చొప్పున అందించాలని జీఓలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇందులో 70 శాతం సబ్సిడీతోనూ, 10 శాతం లబ్ధిదారుని వాటా, 20 శాతం రుణం కింద అందజేయనున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం పరిశీలిస్తే మొత్తం లబ్ధిదారులు 2.55 లక్షల మందికి గాను దాదాపు రూ. 330.40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అయితే మిగిలిన రూ. 400 కోట్లు  బీసీల అభ్యున్నతి పేరుతో ప్రచారానికి వినియోగిస్తున్నారని బీసీ సంఘాలు రగిలిపోతున్నాయి. బీసీలకు అందించే లబ్ధికంటే ప్రచార ఖర్చులకే ఎక్కువ మొత్తాన్ని వినియోగిస్తున్నారని బీసీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

నేడు కడపలో ఆదరణ–2
కడపలోని మున్సిపల్‌ స్టేడియంలో ఆదరణ–2 పథకం కింద సోమవారం పరికరాల ప్రదర్శన పెడుతున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రచార కార్యక్రమాన్ని పూర్తి చేశారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి జిల్లా కేంద్రానికి ప్రత్యేక వాహనాల ద్వారా తీసుకు వస్తున్నారు.

కుల వృత్తుల వారికి అన్యాయం చేస్తున్న బాబు
రాష్ట్రంలో బీసీల్లో ఉన్న 139 సామాజిక వర్గాల్లోని ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తున్నారు. లబ్ధిదారులకు అంతంత మాత్రం ఇచ్చి ప్రచారానికి ఎక్కువ వినియోగించుకుంటున్నారు. అసలు రూ.10 వేలు, రూ.20 వేలతో ఏం వ్యాపారం చేస్తారు? ఆదరణ పథకం కింద లబ్ధి చేకూరితే  మిగతా వాటికి అర్హులు కాదంటూ ప్రభుత్వం ప్రకటించడం అన్యాయం. లబ్ధిదారుల ఎంపికలోనూ సామాజిక కార్యకర్తల పేరుతో జన్మభూమి కమిటీలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నాం.      – సిద్దవటం యానాదయ్య, రాష్ట్ర కన్వీనర్, ఏపీ బీసీ జేఏసీ

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top