మోదీ, కేసీఆర్‌ పెద్ద కేడీలు

Chandrababu Fires On Modi and KCR - Sakshi

ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు 

ఎక్కడా తాగు, సాగునీటి బాధలు లేకుండా చేశాం

పట్టిసీమతో కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేశాం

సాక్షి, నెట్‌వర్క్‌: మోదీ, కేసీఆర్‌ పెద్ద కేడీలని, వీళ్లకు ఓటేస్తే నియంతల పాలనేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కృష్ణాజిల్లా నాగాయలంక, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, ఆచంటలో శనివారం జరిగిన ఎన్నికల సభల్లో  చంద్రబాబు మాట్లాడుతూ ప్రధాన  మంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని, కేసులకు భయపడి జగన్‌ వారితో లాలూచీ పడ్డారని విమర్శించారు. పట్టిసీమతో కృష్ణాడెల్టాను సస్యశ్యామలం చేశామన్నారు. ఎక్కడా తాగునీరు , సాగునీటి కష్టాలు లేకుండా చేశామని, టీడీపీ గెలుపునకు ప్రచారం చేయాలని కోరారు. రైతులకు పెద్దన్నగా ఉంటూ రూ.24,500 కోట్లు రుణమాఫీ చేశామని చెప్పారు. రెండు ఎకరాల రైతుకు ఏడాదికి రూ.10వేలు సాగు సాయం అందిస్తున్నామని బాబు తెలిపారు. కేసీఆర్‌ రిటర్న్‌ గిప్టు ఇస్తామని బ్లాక్‌మెయిల్‌ చేశాడని, జగన్‌కు మద్దతు ఇస్తున్న కేసీఆర్‌కు ఎన్నికల ద్వారా మనమే రిటర్న్‌ గిప్టు ఇద్దామని చెప్పారు. పోలవరంపై కేసీఆర్‌ కేసులు వేశారని,  మన ఆస్తులు మనకు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధితో రాష్ట్రం ముందుకు సాగాలంటే టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు అన్నారు. డ్వాక్రా చెల్లెమ్మలపైనే నమ్మకం పెట్టుకున్నానని, నా నమ్మకాన్ని వమ్ముచేయవద్దని మహిళలను కోరారు.  కాగా స్థానిక నేతలు చంద్రబాబుని గజమాలతో సత్కరించారు. 

బాబు సభకు స్పందన కరువు 
చంద్రబాబు ఎన్నికల ప్రచారంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలుగు తమ్ముళ్లకు తీవ్ర నిరాశే ఎదురైంది. చంద్రబాబు స్థానిక సమస్యలు ప్రస్తావించకుండానే  20 నిముషాల లోపు ప్రసంగం ముగించడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. దివిసీమ సమస్యలపై  ఎలాంటి హామీలు ఇవ్వకపోవడంతో చంద్రబాబు ప్రసంగం సాగుతుండగానే కొంతమంది వెనుతిరిగి వెళ్లిపోయారు. చంద్రబాబు ఎదురుగా ఉన్న రహదారి జనంతో నిండకపోవడంతో ఆయన ఒకింత అసహనానికి గురయ్యారు.  

డబ్బులు పంచినా: చంద్రబాబు సభకు డబ్బులిచ్చి జనాలను తరలించారు. ఆటోలు, వాహనలు దిగిన తరువాత వచ్చిన వారికి టీడీపీ నాయకులు బహిరంగంగానే డబ్బులు పంచారు. డబ్బులు పంచిన వీడియోలు స్థానిక వాట్సాప్‌ గ్రూపుల్లో హల్‌చల్‌ చేశాయి. డబ్బులు పంచి తీసుకొచ్చినా జనంలో స్పందన లేకపోవడంతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. 

ఉపసభాపతికి అవమానం  
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం ముగిసిన తరువాత  హెలీప్యాడ్‌కు వెళ్లేందుకు ప్రత్యేక వాహనంలో ప్రజలకు అభివాదం తెలుపుతూ వెళ్లారు. ఈయితే మంత్రి కొల్లు రవీంద్ర కారులో ఎక్కగా, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ కొద్ది దూరం పరుగులు తీసినా వాహనంలో ఎక్కించుకోలేదు.  

చంద్రబాబు సభలో అపశృతి
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు హాజరైన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. కొఠాలపర్రు శివారు వీరప్పచెరువుకు చెందిన కడలి నాగమణి(50) డ్వాక్రా మహిళలతో కలసి చంద్రబాబు సభకు వచ్చింది. మీటింగ్‌ ముగిసే సమయానికి సభా ప్రాంగాణంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్తుండగానే తుదిశ్వాస విడిచింది. 

రాజధాని  భూములమ్మి అప్పు తీరుస్తాం
‘రాజధాని కోసం రైతులు రూ.50వేల కోట్ల విలువ చేసే 34 వేల ఎకరాల భూమిని ఇచ్చారు. దానికి పదేళ్లు గ్యారెంటీ ఇచ్చి ప్రతి సంవత్సరం పది శాతం పెంచుకుంటూ వచ్చాను. రైతులు ఇచ్చిన భూమి తిరిగి ప్లాట్లు వేసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌ చేసి తిరిగి భూమి వాళ్లకు ఇచ్చి అమ్ముకోమని చెప్పాం.  రాజధానిలో ఏర్పాటు చేసిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అంతా పోను ఐదారు వేల ఎకరాల భూమి మన దగ్గర మిగిలి ఉంది.  ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం రూ. 50వేల కోట్ల అప్పు తీసుకొచ్చాం. మన దగ్గర ఉన్న భూమి అమ్మితే రూ. 50వేల కోట్ల అప్పు పోను  ఎంతో కొంత మిగులుతుంది. ఆ డబ్బు పెట్టి అభివృద్ధి చేస్తాం.’ అంటూ సీఎం చంద్రబాబునాయుడు తన మనసులో మాటను వెల్లడించారు. గుంటూరు నగరంలో శనివారం మార్కెట్‌ సెంటర్‌ నుంచి రోడ్‌షో నిర్వహించి మాయాబజారు సెంటర్‌లో బహిరంగ సభలో మాట్లాడారు.

సభకు తీసుకొచ్చిన వారికి డబ్బులు పంచుతున్న టీడీపీ నేతలు (ఇన్‌సెట్‌లో) మాట్లాడుతున్న చంద్రబాబు 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top