లోక్‌సభలో సెలబ్రిటీల పనితీరిదీ! | Celebrity Mps in Lok Sabha | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో సెలబ్రిటీల పనితీరిదీ!

May 13 2019 5:35 PM | Updated on May 13 2019 8:52 PM

Celebrity Mps in Lok Sabha - Sakshi

రాజకీయాలకు సినీ తారలకు అవినాభావ సంబంధం ఉంటుందని తెల్సిందే. కొంత మంది సినీ నటీనటులు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీచేసి చట్టసభల్లోకి అడుగుపెడితే..

సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయాలకు సినీ తారలకు అవినాభావ సంబంధం ఉంటుందని తెల్సిందే. కొంత మంది సినీ నటీనటులు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీచేసి చట్టసభల్లోకి అడుగుపెడితే మరి కొందరు నామినేషన్‌ పద్ధతిలో చట్టసభల్లోకి అడుగుపెడతారు. ఇంకొందరు ఎన్నికల ప్రచారానికే పరిమితం అవుతారు. అలాగే ఈసారి లోక్‌సభ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి సినీ నటీనటులు సన్నీ డియోల్, ఊర్మిళా మటోన్డ్‌కర్, ప్రకాష్‌ రాజ్, గాయకుడు హాన్స్‌ రాజ్‌ హాన్స్‌లు అడుగుపెట్టిన విషయం తెల్సిందే. సాధారణంగా సినీ రంగం నుంచి చట్టసభల్లోకి వచ్చిన వారు సరిగ్గా సమావేశాలకు హాజరుకారని, హాజరైనా కాసేపు కాలక్షేపం చేసి వెళతారని, ఏ చర్చా గోష్టిలో పొల్గొనరనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అది నిజమా ? కేవలం అపోహ మాత్రమేనా? 2014 ఎన్నికల అనంతరం ఏర్పడిన 16వ లోక్‌సభలో వీరి పనితీరు ఎలా ఉందో చూద్దాం!

లోక్‌సభలో మొత్తం పార్లమెంట్‌ సభ్యుల హాజరు సరాసరి 80 శాతం ఉండగా, 19 మంది సెలబ్రిటీల హాజరు సరాసరి 66 శాతం ఉంది. మధుర నుంచి ఇప్పుడు మళ్లీ పోటీ చేస్తోన్న బీజేపీ అభ్యర్థి హేమ మాలిని హాజరు 39 శాతం ఉంది. అతి తక్కువ హాజరు కలిగిన సెలబ్రిటీలో ఆమె రెండో వారు. పశ్చిమ బెంగాల్‌ నుంచి తణమూల్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న బెంగాల్‌ నటుడు దీపక్‌ దేవ్‌ అధికారికి కేవలం 11 శాతం మాత్రమే హాజరీ ఉంది. ఇక చర్చా గోష్ఠుల్లో పాల్గొన్న ఎంపీల సరాసరి హాజరు 67 శాతం కాగా, అదే సెలబ్రిటీల హాజరి శాతం 22 మాత్రమే. మొత్తం ఎంపీలు కలిసి 293 ప్రశ్నలను లేవనెత్తగా సెలబ్రిటీలు 101 ప్రశ్నలు అడిగారు.
 
ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా ఏ చర్చా గోష్ఠుల్లో పాల్గొన లేదు. ఒక్క ప్రశ్నకూడా అడగలేదు. ఆయనతో కలిసి పలు సినిమాల్లో నటించిన అమితాబ్‌ పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించినప్పుడు ఐదేళ్ల కాలంలో ఒకే ఒక్క ప్రశ్న వేశారు. ‘అమితాబ్‌ నోరు విప్పారు’ అంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. 2014 జూన్‌ నెల నుంచి 2019 ఫిబ్రవరి వరకు 331 రోజులు లోక్‌సభ సమావేశాలు జరగ్గా సెలబ్రిటీలకు సరాసరి 66 శాతం హాజరీ ఉంది. వారిలో బెంగాలీ నటుడు జార్జి బేకర్‌కు 98 శాతం హాజరీ ఉంది. 2015, జూలై 13వ తేదీన ఆయన్ని బీజేపీ నామినేట్‌ చేయగా, అప్పటి నుంచి లోక్‌సభ 228 రోజులు సమావేశం కాగా, 223 రోజులు ఆయన హాజరయ్యారు. బీజేపీ ఎంపీ, మరాఠా నటుడు శరద్‌కుమార్‌ బన్సోడేకు 93 శాతం హాజరీ ఉంది. భోజ్‌పూర్‌ గాయకుడు చోటేలాల్‌కు 88, తెలుగు సినిమా నుంచి వెళ్లిన మురళీ మోహన్‌కు 85 శాతం, సినీ–టీవీ నటి కిరణ్‌ కేర్‌కు 84 శాతం హాజరీ ఉంది. 

ప్రశ్నల్లో ముందున్న వారు
హాజరీలో కాస్త వెనకబడినా ప్రశ్నలు అడగడంలో ముందున్నారు బీజేపీ ఎంపీ కిరణ్‌ కేర్‌. ఆమె ఏకంగా 335 ప్రశ్నలు అడిగారు. సభ్యుల సరాసరి ప్రశ్నల సంఖ్య 293. ఆ తర్వాత మురళీ మోహన్‌ అత్యధికంగా 267 ప్రశ్నలు అడిగారు. శత్రుఘ్న సిన్హాతోపాటు బెంగాలీ, ఒడియా నటి మూన్‌మూన్‌ సేన్‌ కూడా ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. సిన్హా ఒక్క డిబేట్‌లో కూడా పాల్గొనలేదు. సేన్‌ మాత్రం ఒకే ఒక డిబేట్‌లో పొల్గొన్నారు. 

ఎంపీలాడ్స్‌లో సెలబ్రిటీలదే పైచేయి
ఎంపీలాడ్స్‌ కింద విడుదలైన నిధులను వినియోగించడంలో రాజకీయ నాయకులకన్నా సెలబ్రిటీలే ముందున్నారు. ఇతర రాజకీయ ఎంపీలు ఎంపీలాడ్స్‌ను సరాసరి 82.9 శాతం వినియోగించగా, ఈ సెలబ్రిటీలు 87.6 శాతం వినియోగించారు. ఎంపీ లాడ్స్‌ కింద ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గం అభివద్ధికి ఐదేళ్ల కాలానికి ఐదు కోట్ల రూపాయలను కేటాయించడం తెల్సిందే. సెలబ్రిటీల్లో సంధ్యారాయ్‌ 98.8 శాతం నిధులను వినియోగించగా, హాజరీలో అందరికన్నా వెనకబడిన దీపక్‌ దేవ్‌ అధికారి ఆ తర్వాత స్థానంలో ఉన్నారు. ఆయన 96.7 శాతం నిధులను అభివద్ధి కార్యక్రమాలకు వినియోగించారు. శత్రుఘ్న సిన్హా 91.1 శాతం వినియోగించారు. ఎంపీ లాడ్స్‌ వినియోగంలో కూడా హేమ మాలిని వెనకబడి ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement