‘పవన్‌ స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది’

C Ramachandraiah Slams Chandrababu Naidu Over Sujana Chowdary Fraud - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు సి రామచంద్రయ్య విమర్శించారు. ఆదివారం హైదరబాద్‌లోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మద్దతుతోనే టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వందల కొద్ది డొల్ల కంపెనీలు సృష్టించి.. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల సంపదను కొల్లగొట్టారని మండిపడ్డారు. బాబుకు 2009, 2014 ఎన్నికల ఖర్చు మొత్తం సుజనా చౌదరి నుంచే వచ్చిందని అన్నారు. అమాయక ప్రజలు దాచుకున్న డబ్బును చంద్రబాబు అండ్‌ కో దోచుకుని రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించారని తెలిపారు. ఉగ్రవాదుల కన్న చంద్రబాబు అండ్‌ కో ప్రమాదకరమైన వ్యక్తులని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజల డబ్బు దోచుకుంటున్నారు..
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘అవినీతి అంతా చంద్రబాబుకు తెలిసే జరుగుతుంది. సుజనా చౌదరి చేసిన సాయానికి క్విడ్‌ప్రోకోగా చంద్రబాబు ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇప్పించారు. సుజనా చౌదరి అవినీతి దందాలన్ని చంద్రబాబుకు తెలుసు. గతంలోనే ఆయనపై చర్యలు తీసుకుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. చంద్రబాబు చెప్పిన వారికే ఇరిగేషన్‌ కాంట్రాక్టులు దక్కుతాయి. సాక్షాత్తూ అగ్రిగోల్డ్‌ ఆస్తిని టీడీపీ ఎమ్మెల్యే భార్య కొనుగోలు చేసిందని ఆధారాలు సమర్పించిన చర్యలు లేవు. విశాఖ భూ కుంభకోణంలో మంత్రి భార్యకు ప్రమేయం ఉందని తెలిసినా వదిలేశారు. స్వార్ధ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రజల డబ్బును దోచుకుంటున్నారు. ఈ డబ్బును ఎన్నికల్లో పార్టీ  అభ్యర్థులను గెలిపించడానికి, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తున్నారు. అవినీతిపరులను ఎంకరేజ్‌ చేస్తున్న చంద్రబాబు ఒక ఎకనామికల్‌ టెర్రరిస్ట్‌’ అని అన్నారు.

చంద్రబాబు మాటలు విడ్డూరంగా ఉన్నాయి..
‘చంద్రబాబు చేతిలో సుజనా చౌదరి ఓ పనిముట్టు. 23 మంది ఎమ్మెల్యేలను కొని, మంత్రి పదవులు ఇచ్చి.. గవర్నర్‌ వ్యవస్థను నాశనం చేసిన చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కాపాడతారా?. పెద్దబాబు, చినబాబు రాష్ట్రాన్ని సొంత జాగీరులా పాలిస్తున్నారు. షెల్‌ కంపెనీలతో 6900 కోట్ల రూపాయలను సుజనా చౌదరి కొల్లగొట్టారు. వడ్డీతో కలిపి 8వేల కోట్ల రూపాయలు ఆయన దోచుకున్నారు. ఏ మాత్రం నెట్‌వర్క్‌ లేని కంపెనీలకు బ్యాంకులు ఎలా లోన్‌ ఇచ్చాయి?. బ్యాంక్‌లను మేనేజ్‌ చేసిన చరిత్ర కూడా చంద్రబాబుదే. ఈడీ భ్రష్టు పట్టిందని ఆయన మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దేశంలో బ్యాకింగ్‌ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలక ముందే.. ప్రజలకు బ్యాంకింగ్‌ వ్యవస్థపై నమ్మకం పోకముందే చంద్రబాబును చట్టం ముందు నిలబెట్టాలి. చంద్రబాబు సీబీఐకి రాష్ట్రంలోకి అనుమతి లేదని ఎందుకు జీవోలు ఇస్తున్నార’ని రామచంద్రయ్య ప్రశ్నించారు.

పవన్‌ ఎవరి కనుసన్నల్లో పనిచేస్తున్నారు..
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ సుజనా చౌదరి మోసాలకు పాల్పడ్డారని ఈడీ ప్రకటించినా.. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పందించకపోవడం  దారుణం. శనివారం సుజనాకు సంబంధించి ప్రధాన వార్త ఉన్న పవన్‌ కల్యాణ్‌ దానిపై స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పవన్‌ కల్యాణ్‌ ఎవరి కనుసన్నల్లో పనిచేస్తున్నారనే అనుమానం వస్తుంది. సుజనా చౌదరి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. టీడీపీలో ఆర్థిక నేరగాళ్లు, గుండాలే ఉన్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న సుజనా చౌదరిని సమాజం నుంచి వెలివేయాలి. చంద్రబాబుకు ధైర్యం ఉంటే సుజనా చౌదరిపై స్వతంత్ర ఏజెన్సీతో విచారణ చేయించాల’ని సవాలు విసిరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top