రాజధాని పేరుతో చంద్రబాబు దోపిడీ

Botsa Satyanarayana fires on Chandrababu about Amaravati - Sakshi

రాజధాని రైతులకు, రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి 

అమరావతి రైతుల ప్లాట్ల అభివృద్ధి, కౌలుదారుల పింఛన్‌కు కట్టుబడి ఉన్నాం

మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజం

సాక్షి, అమరావతి: అధికారాన్ని దుర్వినియోగం చేసి రాజధాని నిర్మాణం పేరిట చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధానికి 2015, అక్టోబర్‌లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు దాదాపు నాలుగేళ్లలో చేసిందేమీ లేదన్నారు. తన హయాంలో రాజధానిని నిర్మించకుండా చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజలు 50 ఏళ్లపాటు అధికారం ఇచ్చారని ఆయన భావించారేమోనని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రాజధాని నిర్మాణం ఏమైందంటూ టీడీపీ ప్రశ్నిస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. రాజధానిని నిర్మించడంలో విఫలమైన చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తానని చెప్పడం ఏమిటని నిలదీశారు.

రాష్ట్ర ప్రజలు, రాజధాని రైతులకు క్షమాపణలు చెప్పాకే పర్యటించాలని డిమాండ్‌ చేశారు. పేద పిల్లలు బాగుపడకూడదనే కక్షతోనే చంద్రబాబు, ఇతర ప్రతిపక్ష నేతలు ఇంగ్లిష్‌ మీడియంను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. వ్యతిరేకిస్తున్నవారి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో ప్రజలు గుర్తించారని చెప్పారు. మాతృభాషను పరిరక్షించుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోదీ మాటలకు కొన్ని మీడియా సంస్థలు వక్రభాష్యం చెబుతూ రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. ఇంగ్లిష్‌ మీడియం వద్దని ప్రధాని చెప్పారా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం తెలుగు అభివృద్ధికి కట్టుబడి ఉందని, అందుకే ఓ సబ్జెక్టుగా తప్పనిసరి చేసిందని గుర్తు చేశారు.  

నిపుణుల కమిటీ సిఫార్సులు ఇవ్వగానే తగిన నిర్ణయం 
రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్ల అభివృద్ధికి, కౌలు రైతులకు పింఛన్‌ అందించడానికి కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. రాజధానితోపాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం నియమించిన నిపుణుల కమిటీ సిఫార్సులు ఇవ్వగానే ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాలు పంచాయతీలా.. పట్టణమా అనేది ఇంకా తేల్చలేదని చెప్పారు. వాటిపై చర్చ జరుగుతోందని.. త్వరలోనే నోటిఫై చేస్తామని తెలిపారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top