సుజనా అడిగితే సీఎం వచ్చి చెప్పాలా? | Sakshi
Sakshi News home page

సుజనా అడిగితే సీఎం వచ్చి చెప్పాలా?

Published Thu, Sep 12 2019 5:59 PM

Botsa Satyanarayana Comments On Chandrababu Naidu Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం చూసి చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన తెలిపారు. మంత్రి బొత్స గురువారం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లడారు. ‘ప్రతిపక్షం పెయిడ్‌ ఆర్టిస్టులతో గందరగోళం సృష్టించాలని చూస్తోంది. చిన్న చిన్న తగాదాలను భూతద్ధంలో చూపించే ప్రయత్నం చేస్తోంది. కావాలనే కొన్ని పత్రికలు విష ప్రచారం చేస్తున్నాయి. వందరోజుల పాలనలో సీఎం జగన్‌ సంక్షేమానికి పెద్దపీట వేశారు. దేవుని దయతో ప్రాజెక్టులు అన్నీ జలకళతో ఉన్నాయి. కొద్ది రోజుల్లో లక్షా 34వేల మంది గ్రామ కార్యదర్శులు విధుల్లో చేరబోతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు వలంటీర్లను నియమించాం’ అని తెలిపారు.

వరద ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారని మంత్రి బొత్స పేర్కొన్నారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ‘నాలుగున్నర ఏళ్లుగా పట్టించుకోకుండా, ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు 36వేల కోట్ల నిర్మాణాలకు రాజధానిలో టెండర్లు పిలిచారు. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పలేదు. రాజధాని ఓ ఒక్క సామాజిక వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో చెందినది కాదు. గత ప్రభుత్వం ఆరువేల కోట్లకు పైగా రాజధానిలో ఖర్చు చేసినట్లుగా చూపించింది. ఆ నిధులు ఏమయ్యాయో తేలాల్సి ఉంది. నిన్నటి వరకు టీడీపీలో ఉన్నవారే రాజధానిపై గందరగోళం సృష్టిస్తున్నారు. సుజనా చౌదరి అడిగితే ముఖ్యమంత్రి వచ్చి చెప్పాలా? పార్టీ కండువా మారింది తప్ప సుజనా ఆలోచన మారలేదని, పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం ఫ్యాషన్‌ అయింది’ అంటూ ఎద్దేవా చేశారు. సుజనా మూలాలు ఇంకా టీడీపీలోనే ఉన్నాయని  బొత్స తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

చదవండి : ‘అది తెలిసే చంద్రబాబు చిల్లర వేషాలు’

Advertisement
Advertisement