‘ఎగ్జిట్‌’ను మించి సీట్లొస్తాయ్‌

BJP will win more seats in Telangana - Sakshi

కాంగ్రెస్‌ కనుమరుగవుతోంది

టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి త్వరలో వలసలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలకు మించి రాష్ట్రంలో బీజేపీకి లోక్‌సభ సీట్లు దక్కనున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తవాదులు, రాష్ట్ర కాంగ్రెస్‌లోని మరికొందరు నేతలు త్వరలో బీజేపీలో చేరనున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌ తరహాలో తెలంగాణలోనూ నియంతృత్వ పాలన సాగుతోందని విమర్శించారు. ప్రజల్లో నిశ్శబ్ధ విప్లవం రాబోతోందని, బెంగాల్‌ తరహాలోనే రాష్ట్రంలో కూడా బీజేపీ రాజకీయాలను తిరగరాయబోతోందని అన్నారు.

ఇద్దరు చంద్రుల ఫెడరల్‌ ఫ్రంట్‌.. ఫ్యామిలీ ఫ్రంట్‌కు టెంటు లేదని ఏపీ, తెలంగాణ సీఎంలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ సమాజం సమయం కోసం ఎదురుచూస్తోందని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ కనుమరుగు కావడం ఖాయమన్నారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సైన్యం జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ మీద విపక్షాలు రుజువులు అడగడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారన్నారు. ఈ దాడుల్లో దోమ కూడా చనిపోలేదని కేసీఆర్‌ చెప్పారని, బహుశా ఆయనకు జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ చెవిలో చెప్పి ఉంటాడని ఎద్దేవా చేశారు. సైన్యం మీద కన్నా ఉగ్రవాదుల మీదే కేసీఆర్‌కు నమ్మకం ఎక్కువ అని ఆరోపించారు.

బీజేపీయేతర ప్రభుత్వం అని కేసీఆర్‌ కాంగ్రెస్‌కు బయట నుంచి మద్దతు ఇస్తా అంటున్నారని, కత్తులు దూసుకునే పార్టీలు పొత్తులు పెట్టుకుంటే ప్రజలు ఒప్పుకోరని అన్నారు. చంద్రబాబు టీడీపీని సోనియా గాంధీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారన్నారు. చంద్రబాబు చక్రం తిప్పుతారని, కేసీఆర్‌ బొంగరం తిప్పుతారని కొన్ని మీడియా సంస్థలు తెగ ప్రచారం చేస్తున్నాయన్నారు. ఏపీలో ఎదురుకానున్న ఓటమికి చంద్రబాబు ఈవీఎంల ట్యాంపరింగ్‌ అంటూ సాకులు వెతుకుతున్నారన్నారు. ఓ వైపు ట్యాంపరింగ్‌ జరిగిందంటూ.. మరోవైపు నేనే గెలుస్తానని చెప్పుకుంటూ విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారన్నారు. బీజేపీకి స్వతహాగా మెజారిటీ వస్తుందని, ఎన్డీఏకు గతంలో కన్నా ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. మోదీ ఓటమి కోసం కూటమి కట్టి, ఎజెండా లేకుండా ఎన్నికలకు వెళ్లిన విపక్షాల కూటములను ప్రజలు నమ్మలేదన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top