300 సీట్లు ఖాయం

BJP Will Win More Than 300 Seats in Election 2019 - Sakshi

ఈ ఎన్నికల్లో మాకు పోటీయే లేదు: ప్రధాని మోదీ

మమ్మల్ని గెలిపించాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తర్వాత మళ్లీ సంపూర్ణ ఆధిక్యంతో తాము తిరిగి అధికారం చేపడతామని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో తమకు పోటీయే లేదని ఆయన అన్నారు. శుక్రవారం ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. మళ్లీ ఎన్డీయేను గెలిపించాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారనీ, తమ కూటమికి కనీసం 300 సీట్లయితే తప్పక వస్తాయని చెప్పారు. మిషన్‌ శక్తి కార్యక్రమం ఇప్పటికిప్పుడు అనుకుని చేపట్టినది కాదనీ, అసలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం తక్కువ సమయంలో సాధ్యం కాదని మోదీ తెలిపారు.

‘దీన్ని సాహసం అనుకోండి, ప్రారంభ ప్రయత్నం అనుకోంది. ఇవన్నీ అకస్మాత్తుగా జరిగేవి కావు. మనం ఈ ప్రయోగం చేసే సమయంలో అంతరిక్షంలో మనం పంపిన క్షిపణి లక్ష్యాన్ని మాత్రమే ఢీ కొనేలా చూడాలి. అలాంటప్పుడు క్షిపణి దారిలోకి మధ్యలో అడ్డంగా ఇతర ఏరకమైన వస్తువులూ రాకుండా చూసుకోవాలి. ఇందుకోసం ముందుగా ఇతర దేశాలకు మన ప్రయోగ విషయాన్ని తెలియజేసి వారి నుంచి అభ్యంతరాలు లేకుండా చూసుకోవాలి. ఒక నిర్దిష్ట సమయంలో అంతరిక్షంలో మన దారికి ఏవీ అడ్డురాకుండా చూసుకుని ఈ ప్రయోగం చేయాలి. దీనికి ఎంత సమయం పడుతుంది? కొన్ని రోజులు లేదా వారాల్లో అయ్యే పనేనా ఇది?’ అని మోదీ వివరించారు.  

విపక్షాల్లో ఇప్పుడే ఎక్కువ అనైక్యత
2014తో పోలిస్తే ప్రస్తుతం విపక్షాలు మరింత ఐక్యంగా ఉన్నాయన్న వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. నిశితంగా పరిశీలిస్తే విపక్షాలు అప్పటికన్నా ఇప్పుడే ఇంకా ఎక్కువ అనైక్యతతో ఉన్నట్లు స్పష్టమవుతుందన్నారు. ఏపీ, బెంగాల్, ఒడిశా, కేరళ తదితర అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో చేతులు కలిపే పార్టీ లేదని మోదీ పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం కూడా విపక్షాలు ఏకమయ్యే అవకాశమే లేదనీ, ఎన్డీయేకు తక్కువ సీట్లు వచ్చి, ప్రాంతీయ పార్టీలు ఎక్కువ సీట్లు గెలిస్తే మాత్రమే అందుకు ఆస్కారం ఉండొచ్చన్నారు. ఈ ఎన్నికల్లో అయితే తమకు పోటీయే లేదనీ, 2024 ఎన్నికల్లో ఎవరో ఒకరు తమకు పోటీగా వచ్చే అవకాశం ఉందని మోదీ స్పష్టం చేశారు.

నిరుద్యోగంపై విపక్షాలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ‘అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా కూడా విపక్షాలు నిరుద్యోగం అంశాన్ని లేవనెత్తాయి. కానీ అటల్‌ జీ హయాంలో 6 కోట్ల కొత్త ఉద్యోగాలు వచ్చినట్లు గణాంకాలు చెప్పాయి. అదే యూపీఏ పాలనలో వచ్చిన కొత్త ఉద్యోగాలు 1.5 కోటి మాత్రమే. మా ప్రభుత్వ హయాంలో స్వయం ఉపాధి కోసం 4 కోట్ల మంది ముద్ర పథకం కింద బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. వారంతా ఏదో ఓ చిన్న వ్యాపారమైనా చేసి కనీసం మరొక్కరికైనా ఉపాధి కల్పించి ఉంటారు. మా ప్రభుత్వ కాలంలో కోటి మంది ఈపీఎఫ్‌వోలో కొత్తగా నమోదయ్యారు. వారందరికీ ఉద్యోగాలు వచ్చినట్లే కదా’ అని మోదీ       ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top