
మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ
సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్) : దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్, ఫెడరల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ఏవీ కూడా బీజేపీ, ఎన్‌డీఏ ముందు సరితూగే పరిస్థితులు లేవని, ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లు ఖాయమని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ దేశ భద్రత, రైతు ఆదాయం రెట్టింపు, నిరుద్యోగ సమస్య, దేశ సౌభాగ్యం వంటి స్పష్టమైన విధానాలతో ముందుకెళ్తుందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత ఫెడరల్ ఫ్రంట్ వస్తుందని ప్రచారం చేస్తున్నారని, కానీ ఆమె గెలుస్తుందన్న నమ్మకం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధిస్తుందని, ఓటింగ్ శాతం కూడా పెంచుకుంటుందన్నారు జోస్యం చెప్పారు.
బీసీలకు టీఆర్‌ఎస్ తీరని అన్యాయం
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు అసెంబ్లీ ఎన్నికల నాటికి, ఇప్పటికీ ఆదరణ బాగా తగ్గిందని దత్తాత్రేయ పేర్కొన్నారు. బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌ను 34 శాతం నుంచి 23శాతానికి తగ్గించి తీరని అన్యాయం చేసిందన్నారు. బీసీలు టీఆర్‌ఎస్‌కు స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
జడ్జీతో విచారణ చేయించాలి
ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలతో రాష్ట్రంలో ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనిపై జడ్జీతో విచారణ చేయించాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. కంటితుడుపు చర్యగా ప్రభుత్వం కమిటీని వేసిందని, ఫలితాలు పూర్తిగా తప్పులతడకగా ఉన్నాయన్నారు. ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలన్నారు. అకాలవర్షాలు, వడగండ్లకు నష్టపోయిన రైతాంగానికి పరిహారం ఇవ్వాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. యెండల లక్ష్మీనారాయణ, బస్వా లక్ష్మీనర్సయ్య, లోక భూపతిరెడ్డి, బద్దం లింగారెడ్డి, శివరాజ్, మల్లేష్‌యాదవ్, మనోహర్‌రెడ్డి, ఆకుల శ్రీనివాస్, న్యాలం రాజు, భరత్ భూషణ్, సంతోష్ పాల్గొన్నారు.
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తాచాటాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ శ్రేణులు సత్తా చాటాలని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశాన్ని జిల్లా ఉపాధ్యక్షుడు భరత్ భూషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బండారు దత్తాత్రేయ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ఆదరణ తగ్గిందని, అందుకు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం కానున్నాయని తెలిపారు. పార్టీ గుర్తుపై పోటీ చేసే అభ్యర్థి గెలుపు కోసం ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు అధిక సంఖ్యలో కైవసం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని, అందుకోసం నాయకులు, కార్యకర్తలందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. యెండల లక్ష్మీనారాయణ, లోక భూపతిరెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి అర్వింద్ ధర్మపురి, బస్వా లక్ష్మీనర్సయ్య, గీతారెడ్డి, శివరాజ్‌కుమార్ పాల్గొన్నారు.