బీజేపీలో రాజ్యసభ ఎన్నికల ఆత్రుత

BJP Trying Destabilise Madhya Pradesh Government, Says Congress - Sakshi

మధ్యప్రదేశ్‌లో పరిణామాలపై కాంగ్రెస్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ/భోపాల్‌: రాజ్యసభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచాలన్న ఆత్రుత బీజేపీలో ఎక్కువైందని కాంగ్రెస్‌ పార్టీ వ్యాఖ్యానించింది. అందుకే మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 14 ఎమ్మెల్యేలను వలలో వేసుకునేందుకు యత్నించిందని ఆరోపించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీ నేతలు కుట్రతో మా ఎమ్మెల్యేలను హరియాణా రాష్ట్రం మనేసర్‌లోని ఓ హోటల్‌లో నిర్బంధించారు. అయితే, ఆ ఎమ్మెల్యేలందరూ వారంతట వారే వచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తిరిగి మద్దతు పలికారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలే లక్ష్యంగా బీజేపీ దాడులు, బెదిరింపులకు పాల్పడుతోంది. బీజేపీలో చేర్చుకోవడం లేదా అనుకూలంగా మార్చుకోవడం ద్వారా మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు యత్నిస్తోంది’ అని ఆరోపించారు. త్వరలో రాజ్యసభ ఎన్నికలున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిర పరచాలన్న తొందర కాషాయ నేతల్లో ఎక్కువైందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీన పరిచేందుకు కుట్ర పన్నుతోందని పేర్కొన్నారు.  

కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా మాట్లాడుతూ.. ‘రాష్ట్రాన్ని గతంలో 15 ఏళ్లపాటు వ్యవహారాలు నడిపిన మాఫియా ముఠా ఇంకా క్రియాశీలకంగానే ఉంది. ఆ ముఠాయే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని దించేందుకు కుట్ర పన్నుతోంది. ఎమ్మెల్యేలను తరలించేందుకు చార్టర్‌ విమానాన్ని ఎవరు పంపారు? స్టార్‌ హోటళ్లలో బసకు డబ్బు ఎవరు చెల్లించారు? అని ఆయన ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సహా బీజేపీకి చెందిన ఐదుగురు నేతలు తమ ఎమ్మెల్యేలతో బేరసారాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘వీరి కుతంత్రాలు సఫలం కావు. మా ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా, బీజేపీకి తాము అమ్ముడుపోయామని, తమను నిర్బంధించారంటూ వచ్చిన వార్తలు అబద్ధమని మధ్యప్రదేశ్‌కు చెందిన బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), సమాజ్‌ వాదీ పార్టీ(ఎస్పీ) ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు రామ్‌ బాయి, సంజీవ్‌ సింగ్‌ కుష్వాహా, రాజేశ్‌ శుక్లా భోపాల్‌లో అన్నారు. (చదవండి: మధ్యప్రదేశ్‌లో మళ్లీ ఆపరేషన్‌ కమలం?)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top