‘టీఆర్‌ఎస్‌ 6 స్థానాలు గెలిస్తే గొప్పే’

BJP MP Bandaru Dattatreya Slams TRS In Delhi - Sakshi

ఢిల్లీ: తెలంగాణా పార్లమెంటు ఎన్నికల్లో 16 స్థానాలు గెలుస్తామనడం కేటీఆర్‌ అహంభావానికి ప్రతీకని సికింద్రాబాద్‌ బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ విమర్శించారు. ఢిల్లీలో దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ..టీఆర్‌ఎస్‌ ఆరు ఎంపీ స్థానాలు గెలిస్తే గొప్పేనన్నారు. తెలంగాణాలో బీజేపీ బలంగా ఉందని, రేపు తెలంగాణాలో అమిత్‌ షా పర్యటిస్తారని వెల్లడించారు. తెలంగాణాలో కాజీపేట కేంద్రంగా నూతన రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే శాఖా మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్‌, టీడీపీ గుర్తులపై గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించడం అప్రజాస్వామికమన్నారు. ప్రజస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తూ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడం సరికాదన్నారు. బీజేపీ తెలంగాణాలోని 17 స్థానాల్లో పోటీ చేస్తుందని, అలాగే తాను సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు.

ఆ దాడులు చరిత్రలో నిలిచిపోతాయ్‌..!
పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టడమే లక్ష్యంగా భారత వైమానిక దళం చేసిన దాడులు చరిత్రలో నిలిచిపోతాయని వ్యాఖ్యానించారు. భారత్‌ చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు ప్రపంచ దేశాలు మద్ధతుగా నిలవడం దౌత్యవిజయమన్నారు. వైమానిక దాడులను ప్రతిపక్షాలు రాజకీయం చేయడం సరికాదన్నారు. భారత వైమానిక దళం టెర్రరిస్టు స్థావరాలపై దాడులు చేయడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు.

ఆ బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే..
ఆధార్‌ సమాచారాన్ని భద్రంగా ఉంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని దత్తాత్రేయ స్పష్టంగా పేర్కొన్నారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం కేంద్రంపై నిందలు వేయడం సమంజసం కాదన్నారు. ప్రధానిపై అభాండాలు వేసి అప్రదిష్టపాలు చేయడం సరికాదన్నారు. విశాఖ కేంద్రంగా జోన్‌ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంటే దానిని తప్పుపట్టడం సరికాదన్నారు. డివిజన్‌ పేరుతో జోన్ల ఏర్పాటు ఉంటుందే తప్ప రాష్ట్రాల పేరుతో జోన్ల ఏర్పాటు ఉండదన్నారు. ఇలాంటి విషయాలను కూడా రాజకీయం చేయడం చంద్రబాబుకు తగదన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top