ఆ మంత్రిని వెంటనే బర్తరఫ్‌ చేయాలి.. 

BJP Leader Sankineni Venkateswara Rao Slams To Minister Jagadish Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మంత్రి జగదీష్‌ రెడ్డి నేతృత్వం వహిస్తున్న సూర్యాపేట నియోజకవర్గంలో వందలకోట్ల అవినీతి జరుగుతోందని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌ రావు ఆరోపించారు. తెలంగాణ 31 జిల్లాలో లేని అవినీతి సూర్యాపేటలో ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కలెక్టర్‌ కార్యాలయం కోసం ఇప్పటి వరకూ స్థల సేకరణ జరగలేదని తెలిపారు. సూర్యపేటలో 70 ఎకరాల స్థలం కేటాయించి బోర్డు పెట్టారు కానీ ప్రస్తుతం అది కబ్జాకు గురువతుందని ఆయన పేర్కొన్నారు.

‘ఈ విషయంపై సీఎం చంద్రశేఖర్‌ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థల సేకరణ గురించి కలెక్టర్‌ను అడిగారు. ఆ సమయంలో అతను కేసు కోర్టులో ఉన్నట్టుగా చెప్పారు. గతంలో సీఎం కూడా వచ్చారు.. అప్పుడు కలెక్టర్‌ సీఎంకి మూడు ప్రతిపాదనాలు ఇచ్చారు. స్థానికంగా సూర్యాపేటలో 200 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు చెప్పారు. నల్ల చెరువు ఇంజనీరింగ్‌ కాలేజ్‌ వద్ద ఉన్న 200 ఎకరాలు పేదవారి ఇళ్ల స్థలాలు చూపించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంతేకాక అమాయక ప్రజల భూములు కొని కలెక్టర్‌ కార్యాలయం కోసం ఇస్తున్నారు. దీంట్లో మంత్రి హస్తం కూడా ఉంది’ అని సంకినేని వెంకటేశ్వర రావు మండిపడ్డారు.

అవే కాకుండా పేదల భూములు, ప్రైవేట్‌ భూములు కొని రూ. 300 కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ఇది నిరూపణ అయితే మంత్రి పదవి నుంచి తప్పుకుంటారా అని సక్కినేని సవాల్‌ విసిరారు. 18 లక్షల చొప్పున నాలుగున్నర కోట్లు కావాలని సీఎస్‌ ఎస్పీ సింగ్‌ని అడిగారు. ఇందులో మంత్రి, కలెక్టర్‌, జాయింట్ కలెక్టర్‌ హస్తం కూడా ఉందని ఆయన అన్నారు. దీనిపై సిట్టింగ్‌ జడ్జ్‌తో విచారణ జరిపించాలి.. లేదా సీబీఐ ఎంక్వైరీ వేయాలని అన్నారు. వైద్యశాఖలో అవినీతి జరిగిందని ఎమ్మెల్యే రాజయ్యను బర్తరఫ్‌ చేసినట్టుగా.. మంత్రి జగదీష్‌ రెడ్డిని బర్తరఫ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇది నిరూపణ కాకపోతే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతానని సక్కినేని వెంకటేశ్వర్‌ రావు చెప్పారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top