బీసీలకు బర్రెలు, గొర్రెలేనా.. చట్టసభల్లోకి పంపరా?

BJP Leader Laxman Critisize CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గత 30 సంవత్సరాలుగా బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కొనసాగుతుంటే.. ఇప్పుడు ఏ ప్రాతిపదికన 22శాతానికి కుదించారో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేసీఆర్‌ బీసీలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా విడుదల చేసిన రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ ఏ ప్రాతిపదికన విడుదల  చేసిందో చెప్పాలన్నారు. ఐదేళ్లలో ఎలాంటి గణాంక వివరాలు లేకుండా ఎలా తగ్గిస్తారని ప్రశ్నించారు.

బీసీల పట్ల టీఆర్‌ఎస్‌ ప్రభ్వుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బీసీలకు బర్రెలు, గొర్రెలను ఇవ్వడమే కానీ, చట్ట సభల్లో అవకాశం కల్పించేది లేదా అని ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామాన్న కేసీఆర్‌ మాట మార్చారని ఆరోపించారు. బీసీలు న్యాయపరమైన హక్కులు సాధించే వరకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తూ విడుదల చేసిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.
 
సొంత ప్రయోజనాల కోసమే ఫ్రంట్‌
సీఎం కేసీఆర్‌ ప్రజాభివృద్ధిని గాలికొదిలేసి ఫ్రంట్‌ పేరుతో దేశం మీద పడి తిరుగుతున్నారని లక్ష్మణ్‌ విమర్శించారు. సొంతప్రయోజనాల కోసమే ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ఏ ఒక్కరూ కూడా కేసీఆర్‌ ఫ్రంట్‌కు సానుకూలంగా స్పందించడం లేదన్నారు. తెలంగాణాలో ఏ విధంగా టీఆర్‌ఎస్‌కు ప్రజలు మొగ్గు చూపి గెలిపించారో.. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి మొగ్గుచూపి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 

ఓట్ల గల్లంతు కారకులపై చర్యలు తీసుకోవాలి
అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 22లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ఎమ్మెల్సీ రామచంద్రారావు ఆరోపించారు. ఒక్క మల్కాగిగిరి నియోజక వర్గంలోనే 70వేల ఓట్లు గల్లంతయ్యాయన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లోనైనా సరైన ఓటు నమోదు అయ్యేట్లు ఎన్నికల కమిషన్‌ జాగ్రత్త వహించాలని కోరారు. ఓట్ల గల్లంతుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top