నో సీఎం పోస్ట్‌: 13 మంత్రి పదవులే ఇస్తాం!

BJP to give 13 Cabinet berths to Shiv Sena, no deal on CM’s post - Sakshi

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ-శివసేన కూటమి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. సీఎం పదవిని చెరిసగం పంచాల్సిందేనని, అధికారం విషయంలో ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాను పాటించాలని శివసేన గట్టిగా కోరుతున్నప్పటికీ.. అందుకు బీజేపీ ఏమాత్రం అంగీకరించడం లేదు. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఆ పార్టీకి కేవలం 13 మంత్రి పదవులే ఇస్తామని , ఇక ముఖ్యమంత్రి పదవి ఐదేళ్లూ బీజేపీ చేతిలోనే ఉంటుందని, ఈ విషయంలో సేనతో ఎలాంటి డీల్‌ చేసుకునేది లేదని బీజేపీ హైకమాండ్‌ ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఆ పార్టీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ముఖ్యమంత్రి, హోంమంత్రితోపాటు 26 మంత్రి పదవులను తమ వద్ద ఉంచుకోవాలని, అదేవిధంగా టాప్‌ 4 మంత్రిపదవుల విషయంలో సేనతో ఎలాంటి చర్చలకు, బేరసారాలకు తావులేదని కమలదళం భావిస్తోంది. సేన మాత్రం సీఎం పోస్ట్‌ను చెరిసగం పంచాలని, కీలక మంత్రిపదవుల్లోనూ సగం తమకు ఇవ్వాలని కోరుతోంది. దీంతో ఇరుపార్టీల నడుమ పీటముడి కొనసాగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు దేవేంద్ర ఫడ్నవిస్‌ సిద్ధమవుతున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఆయనను పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో రేపో, ఎల్లుండో సీఎంగా ఆయన ప్రమాణస్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

తమ డిమాండ్ల మేరకు బీజేపీ దిగిరాకపోవడంతో శివసేన మరింత మొండి పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. తాము లేకుండా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని వ్యాఖ్యానిస్తోంది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 105, శివసేన 56 సీట్లు గెలుచుకున్నాయి. ప్రతిపక్ష ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాలు కైవలం చేసుకున్నాయి. 17మంది బీజేపీ రెబల్స్‌ గెలువడంతో వారి మద్దతు తమకే ఉంటుందన్న ధీమాతో ఉన్న బీజేపీ శివసేన డిమాండ్లను పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు కాషాయపార్టీల నడుమ ఎలాంటి డీల్‌ కుదురుతుందని, ఎవరు రాజీపడతారు? లేకపోతే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేసినా.. మళ్లీ కలహాల కాపురమే అవుతుందా? అన్నది ఆసక్తి రేపుతోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top