
లక్నో : వివాదాలతో సావాసం చేసే సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజమ్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ను కూల్చివేయాలని అన్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పర్యాటక ప్రాంతాల జాబితాలో తాజ్‌మహల్ పేరును పేర్కొనలేదు. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను యోగి ఆదిత్యనాథ్ సర్కారు విస్మరించడంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఆజమ్ ఖాన్ స్పందించారు. తాజ్‌మహల్‌ను కూల్చివేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయిస్తే తాను మద్దతు ఇస్తానని ప్రకటించారు.
అయితే తాజ్‌మహల్ కూల్చివేయాలని ఆయన చాలా ఏళ్లుగా అంటున్నారు. తాజ్‌మహల్ కూల్చి శివాలయం నిర్మించాలని గతంలో వ్యాఖ్యానించి దుమారం రేపారు. అక్కడితో ఆగకుండా రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవనాలను కూడా కూలగొట్టాలని డిమాండ్ చేశారు. ఈ భవనాలు బానిసత్వానికి ప్రతీకలని, వాటిని కూల్చివేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాధనాన్నిభారీగా వృధా చేసిన స్మారక కట్టడాల్లో తాజ్‌మహల్ ఒకటనీ, అక్కడ నిలబడాలంటేనే తనకు నచ్చదని అప్పట్లో అన్నారు.